Digilocker Services Whatsapp: వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు డిజీలాకర్ సేవలను పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇక నుంచి వాట్సాప్‌లో పాన్ కార్డ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
కొవిడ్ సమయంలోనే.. ప్రభుత్వ సేవలను మరింత సరళంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 'My Gov హెల్ప్ డెస్క్'ను.. కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా మార్చి 2020లో ప్రారంభించింది. కొవిడ్‌కు సంబంధించిన సమాచారం, వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటి సేవలను అందిస్తుంది. అయితే, తాజాగా వాట్సాప్‌లో డిజీలాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఏం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?: పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సీబీఎస్ఈ 10వ తరగతి సర్టిఫికెట్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ద్విచక్ర వాహన బీమా పాలసీ, 10వ తరగతి మార్క్‌షీట్, 12వ తరగతి మార్క్‌షీట్, బీమా పాలసీ పత్రాలు వంటి పలు పత్రాలను ఇక వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ సేవలను ఎలా పొందాలి?: దేశంలో ఉన్న వాట్సాప్ వినియోగదారులు చాట్‌బాట్ ద్వారా +91 9013151515 నెంబరుకు 'నమస్తే' లేదా 'హాయ్' లేదా 'డిజీలాకర్' మెసేజ్ పంపడం ద్వారా ఈ డిజీలాకర్ సేవలను పొందవచ్చు. డిజీలాకర్‌లో ఇప్పటికే దాదాపు 10 కోట్లకు పైగా ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 5 బిలియన్లకు పైగా పత్రాలు జారీ అయ్యాయి.