ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన వినియోగదారులకు వాయిస్ మెసేజ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 140సెకండ్లలో వాయిస్ మెసేజ్‌లు పంపుకునే ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
భారత్‌తో పాటు.. బ్రెజిల్, జపాన్‌లలో 140 సెకన్ల నిడివి గల ప్రత్యక్ష సంభాషణ (డైరెక్ట్ కన్వర్జేషన్).. డైరెక్ట్ వాయిస్ మెసేజ్ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ప్రజలు ప్రత్యక్ష సంభాషణలు జరిపేందుకు ఈ ఫీచర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రకటించింది. ప్రయోగదశలో ఈ మూడు దేశాల్లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ప్రయోగం ద్వారా వినియోగదారులు వారి అనుభూతులను మరింత వినూత్నంగా వెల్లడించగలరని ట్విట్టర్ తెలిపింది. సందేశాలను ఎక్కడైనా, ఎప్పుడైనా వినగలరని వివరించింది. భావోద్వేగాలు, సానుభూతి, నైపుణ్యాల వంటి అంశాలు వ్యక్తపరిచేందుకు ఇదొక మంచి వేదిక కాగలదని పేర్కొెంది.
''వాయిస్ సందేశాలు ప్రజల సంభాషణలను మరింత సులభతరం చేస్తాయి. ఇతరుల స్వరాన్ని వింటూ నైపుణ్యాలు, భావోద్వేగాలను పంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా దేశంలో వాయిస్ సందేశాలను అందుబాటులోకి తీసుకొచ్చి, వారి వ్యక్తీకరణలకు నూతన మార్గాన్ని ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాం.''
- మనీష్ మహేశ్వరి, ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్.
ప్రజలు అత్యంత వేగంగా సంభాషణలు జరిపేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమ మేనేజర్ అలెక్స్ అకెర్మాన్ గ్రీన్‌బర్గ్ తెలిపారు.
''ఈ ఫీచర్లో ప్రతి వాయిస్ సందేశం 140 సెకన్ల వరకు ఉంటుంది. ప్రజలు త్వరగా చాట్ చేయడానికి సహాయపడుతుంది. టైప్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు వారి భావాలను వ్యక్తీకరించవచ్చు. వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అంకితభావంతో పనిచేస్తున్నాం.''
-అలెక్స్ అకెర్మాన్ గ్రీన్‌బర్గ్, ప్రోగ్రామ్ మేనేజర్.
ఇవీ చదవండి: నకిలీ ఖాతాల కట్టడికి ట్విట్టర్లో మరిన్ని లేబుల్స్!
ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు