ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో షియోమీ, రియల్మీ, వన్‌ప్లస్, శాంసంగ్ కంపెనీలు పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రీమియం ఫోన్ల నుంచి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల వరకు ఉన్నాయి. మరి ఆయా కంపెనీలు విడుదల చేయనున్న కొత్త మోడళ్లు ఏవి? వాటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? విడుదల తేదీ ఎప్పుడు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
రెడ్ మీ నోట్ 10 సిరీస్..
భారత్‌లో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఏదైనా ఉందంటే అది రెడ్ మీ నోట్ సిరీస్ అనే చెప్పాలి. గత ఏడాది విడుదలైన నోట్ 9 సిరీస్‌కు శాంసంగ్, రియల్మీ వంటి సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంది. దీనితో ఈసారి నోట్ 10ను సరికొత్త ఫీచర్లతో తీసుకువచ్చేందుకు సిద్ధమైంది షియోమీ.
ఈ సిరీస్‌లో.. నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ పేర్లతో మూడు వేరియంట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మార్చి 4న ఈ మూడు మోడళ్లను ఒకేసారి విడుదల చేస్తుందా? తొలుత ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లను మాత్రమే తీసుకొస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ మోడళ్లు 5జీతో వస్తాయా అనే విషయంపైనా ఇంకా స్పష్టత లేదు. అయితే వీటిలో ఒక మోడల్ మాత్రం 108 మెగా పిక్సెల్ కెమెరాతో రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నోట్ 10 సిరీస్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 700, 732జీ ప్రాసెసర్లతో రావచ్చని టెక్ వర్గాల అంచనా.
వన్ ప్లస్ 9 సిరీస్..
వన్ ప్లస్ 8టీ ఆవిష్కరించినప్పటి నుంచే వన్ ప్లస్ 9 సిరీస్‌పై టెక్ వర్గాల్లో ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ సిరీస్‌లోనూ మూడు వేరియంట్లు ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో వంటి మోడళ్లను ప్రీమియం సెగ్మెంట్లో తీసుకురానున్నట్లు సమాచారం. మూడో వేరియంట్‌ను బడ్జెట్ ధరలో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. బడ్జెట్ వేరియంట్‌ను ప్లస్ 9ఈ, 9ఆర్, 9 లైట్ (ఈ మూడింటిలో ఏదో ఒకటి) పేరుతో రావచ్చని తెలుస్తోంది.
ఇప్పటి వరకు 9 సిరీస్ విడుదల తేదీని వన్‌ప్లస్ అధికారికంగా ప్రకటించలేదు. టెక్ వర్గాల ప్రకారం ఈ నెల 23న వన్ ప్లస్ 9 సిరీస్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. గతంలోనూ వన్‌ప్లస్ మార్చిలో ఎక్కువగా కొత్త మోడళ్లను ఆవిష్కరించడం ఈ అంచనాలకు కారణం.
ఫీచర్ల అంచనాలు..
- వన్ ప్లస్ 9, 9 ప్రో మోడళ్లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- 48 మెగా పిక్సెళ్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు
- ఫారెస్ట్ గ్రీన్, మార్నింగ్ మిస్ట్, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభ్యం
రియల్మీ జీటీ 5జీ
రియల్మీ నుంచి ఎక్స్50 ప్రో తర్వాత రియల్మీ నుంచి వస్తున్న రెండో ఫ్లాగ్ షిప్ ఫోన్ జీటీ 5జీ అని చెప్పొచ్చు. స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ సామర్థ్యంతో ఈ వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వేరియంట్‌ను మార్చి 4న తొలుత చైనాలో విడుదల చేయనుంది రియల్మీ. భారత్‌లో ఈ మోడల్ ఎప్పుడు ఆవిష్కరించనుందనే విషయంపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశముంది.
శాంసంగ్ ఎం 12
శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో వస్తున్న మరో బడ్జెట్ ఫోనే ఈ ఎం 12. ఈ మోడల్ 6.5 అంగుళాల డిస్ప్లే, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగా పిక్సెళ్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండొచ్చని సమాచారం. ఈ వేరియంట్ శాంసంగ్ సొంత ప్రాసెసర్ ఎగ్జినోస్ 8ఎన్ఎంతో రానున్నట్లు తెలుస్తోంది. ఎం 12 మోడల్‌ను మార్చి 11న విడుదల చేయనుంది శాంసంగ్.
ఇదీ చూడండి:మీరూ స్టాకర్వేర్ బాధితులా? తెలుసుకోండిలా?