కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి మాస్క్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇదే అవకాశంగా మలుచుకుని పలువురు తమ ప్రతిభను కనబరుస్తూ అనేక రకాల ముఖ కవచాలను సృష్టించారు. వాటికి గిరాకీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇటీవల ఓ టెక్ నిపుణుడు డిజిటల్ మాస్క్‌ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్కు చెందిన ఓ సంస్థ.. స్వయంగా వైరస్‌ను నాశనం చేయగల స్మార్ట్ ఫేస్‌మాస్క్‌ను తయారు చేసింది. 'లీఫ్' పేరుతో విడుదలైన ఈ మాస్క్.. ప్రపంచంలోనే తొలిసారి యూవీసీ సాంకేతికతతో రూపొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పర్యావరణహిత మాస్క్
పునర్వినియోగానికి వీలుండేలా 'లీఫ్ మాస్క్'ను డెట్రాయిట్కు చెందిన రెడ్‌క్లిఫ్ హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసింది. ఈ మాస్క్‌లో ఎన్99+ హెపా(హై ఎఫీషియెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్) ఫిల్టర్‌ను అమర్చినట్లు సంస్థ తెలిపింది. ఈ మాస్క్ పారదర్శకంగా ఉండటం వల్ల దీన్ని ధరించినా ముఖం కనిపిస్తుంది.
"రోజురోజుకు మాస్క్‌ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఒకసారి ఉపయోగించి పారేసే ముఖ కవచాల వల్ల పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు 'లీఫ్ మాస్క్'ను తయారు చేశాం. ఇది శక్తిమంతమైంది. పునర్వినియోగించుకొనే అవకాశం ఉండటం వల్ల వాతావరణానికి ఎటువంటి హాని ఉండదు.
-ఆడమ్ లైట్‌మ్యాన్, రెడ్‌క్లిఫ్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకులు
లీఫ్ మాస్క్ ప్రయోజనాలు..
- మార్కెట్లో అత్యంత అధునాతన ఫిల్టర్ కలిగిన మాస్క్ ఇదే.
- గాలిలోని 99.9997% కాలుష్య కారకాలను అడ్డుకుంటుంది. 0.3 మైక్రాన్ల పరిమాణం గల సూక్ష్మ కణాలను సైతం లోపలకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది.
- మాస్క్‌కు అమర్చిన ఓ స్విచ్‌ను నొక్కినట్లయితే వైరస్ నాశనమవుతుంది. స్వయంగా శుభ్రపరుచుకుంటుంది.
- ఈ మాస్క్‌లో ఉపయోగించే ఫిల్టర్ నెలరోజుల వరకు పనిచేస్తుంది.
- మాస్క్ ఉన్నా వినియోగదారుల ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ధరిచినా ఫేస్ టెక్నాలజీ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌లను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు.
- వినియోగదారులకు నచ్చిన రంగులో లీఫ్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు సైజుల్లో..
పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరికి తగిన సైజుల్లో మాస్క్‌లు తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. దాని ప్రకారం.. 3 నుంచి 8 ఏళ్ల చిన్నపిల్లలకు 55 మీమీ, 7 నుంచి 12 ఏళ్ల పిల్లలకు 65 మీమీ, పెద్దవారికి 85 మీమీ, మరీ పెద్ద ముఖం ఉన్నవారికి 115 మీమీ సైజుల్లో మాస్క్‌లు లభిస్తున్నాయి.
మాస్క్ ధర..
లీఫ్ మాస్క్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఈ మాస్క్‌లో ఉపయోగించే ఫిల్టర్ ఆధారంగా ధర నిర్ణయించారు. హెపా ఫిల్టర్ ఉన్న మాస్క్ ధర 49 అమెరికన్ డాలర్లు(రూ.3,700). హెపా కార్బన్ ఫిల్టర్ ఉన్న మాస్క్ ధర 89 అమెరికన్ డాలర్లు(రూ.6,725).
ఇదీ చూడండి: మీరు మాట్లాడినా, నవ్వినా చెప్పే స్మార్ట్ మాస్క్ ఇది...