Top 10 Whatsapp Features : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్, అప్డేట్స్తో తమ యూజర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే తీసుకువచ్చిన వాట్సాప్ ఛానల్స్‌కు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్ లాంఛ్ చేసిన టాప్ 10 ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాయిస్ స్టేటస్..
Voice Status Feature : ఈ వాయిస్ స్టేటస్ ఫీచర్ ముఖ్యంగా టైప్ చేయడానికి ఇబ్బందిపడేవాళ్లకు, పెద్దగా చదువుకొని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో మీ ఆలోచనలను.. అందరు స్నేహితులకు సులువుగా ఒకేసారి పంచుకోవచ్చు. టైప్ చేసే పని లేకుండానే వాయిస్ స్టేటస్ రూపంలో మీరు చేరవేయాలనుకున్న సమాచారాన్ని క్షణాల్లో షేర్ చేసేయవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా వాట్సాప్ స్టేటస్ ట్యాబ్‌లో ఉండే పెన్సిల్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మైక్ గుర్తును నొక్కి పట్టుకోండి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని రికార్డ్ చేసి పోస్ట్ చేయండి. ఈ స్టేటస్ 24 గంటల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.
పిన్ మెసేజెస్..
Pin Messages In Chat : వాట్సాప్‌లో చాలా సందేశాలు ఉంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన చాట్లను వెతకాలంటే కాస్త శ్రమతో కూడుకున్న పనే. దీనికి చెక్ పెట్టేందుకే 'Pin Messages In Chat' అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది వాట్సాప్. దీని ద్వారా చాట్ లిస్ట్‌లోని మూడు ముఖ్యమైన చాట్లను వాట్సాప్ స్క్రీన్ టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. ఇలా చాట్లను పిన్ చేయడం వలన ప్రతిసారి మీరు సంబంధిత చాట్‌ను వెతికేందుకు సమయాన్ని వృథా చేసుకోనక్కర్లేదు. ఇందుకోసం మీరు పిన్ చేయాలనుకుంటున్న చాట్‌ను లాంగ్‌ప్రెస్ చేయండి. దీంతో మీకు టాప్‌లో పిన్ ఆకారంలో ఉన్న సింబల్ కనపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన చాట్ పిన్ అవుతుంది.
ఎడిట్ మెసేజెస్..
Edit Messages Feature : కొన్నిసార్లు తొందరలో మన స్నేహితులు లేదా బంధువులకు పంపాల్సిన సందేశాల్లో అక్షర దోషాలు, అన్వయ దోషాలు దొర్లుతుంటాయి. అయితే ఇదివరకు అలా పంపిన తప్పుడు మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. అయితే ఇటీవలే వచ్చిన ఎడిట్ మెసేజెస్ ఫీచర్ సాయంతో తప్పుగా పంపిన మన సందేశాన్ని పూర్తిగా డిలీట్ చేయకుండానే.. సెండ్ చేసిన మెసేజ్‌ను ఎడిట్ చేసి అంటే సరిగ్గా మార్చి పంపించే అవకాశం ఈ Edit Messages Feature వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఫీచర్ కేవలం మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపే పని చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే పంపించిన మెసేజ్‌ను లాంగ్‌ప్రెస్ చేసి మెను బాక్స్ నుంచి ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
కంపానియన్ మోడ్..
Companion Mode Feature : ఈ కంపానియన్ మోడ్ ఫీచర్ సాయంతో ఒక ఫోన్లో ఉన్న వాట్సాప్‌ను మరో మొబైల్లో కూడా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ నయా ఫీచర్ ద్వారా ఒక ఫోన్‌లోని మీ వాట్సాప్ అకౌంట్‌ను మరొక ఫోన్‌కు సులువుగా లింక్ చేయవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌తో పాటు ఐఫోన్ కూడా ఉందనుకుందాం. అప్పుడు మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని వాట్సాప్ చాట్స్‌ను ఐఫోన్ డివైజ్‌లో కూడా చూసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు లింక్ చేయాలనుకుంటున్న మొబైల్లో.. వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేయండి. ఆ తరువాత 'link this device to an existing account'ను సెలెక్ట్ చేసుకోని QR కోడ్‌ను స్కాన్ చేయండి. దీంతో మీ డివైజ్‌లో కంపానియన్ మోడ్ ఎనేబుల్ అవుతుంది.
చాట్ లాక్..
Chat lock Feature : మీ వాట్సాప్‌లోని పర్సనల్ చాటింగ్ లేదా డేటాను ఇతరులు చూడకుండా ఉంచేందుకు ఈ చాట్ లాక్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చాట్నైతే మీ స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ చూడకుండా లేదా చదవకుండా ఉంచాలనుకుంటున్నారో ప్రత్యేకంగా ఆ చాట్‌కు మాత్రమే పాస్వర్డ్ ద్వారా లాక్ వేసుకోవచ్చు. అంతేకాకుండా సంబంధిత చాట్‌ను హైడ్ కూడా చేసుకోవచ్చు. అయితే లాక్ చేసిన చాట్ నుంచి మీకు ఏదైనా సందేశం వస్తే అది మీకు కేవలం వాట్సాప్ నోటిఫికేషన్ రూపంలో మాత్రమే కనిపిస్తుంది తప్ప మెసేజ్ వివరాలు కనబడవు. కాగా, ఈ చాట్ లాక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి చాట్ ఇన్ఫోకు వెళ్లి Chat Lockపై నొక్కండి.
వాట్సాప్‌లో HD క్వాలిటీలో ఫొటోలు..
Send Full-Resolution Images : వాట్సాప్ తీసుకువచ్చిన ఈ Send Full-Resolution Images ఫీచర్‌తో మీరు ఫుల్ హెచ్డీ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు అప్లికేషన్ టాప్‌లో ఉండే HD సింబల్‌ను ఎంచుకోవాలి. అయితే హెచ్డీ రూపంలో పంపే మీడియా ఫైల్స్ సాధారణం కంటే ఎక్కువ డేటా లేదా ఇంటర్నెట్ను వినియోగిస్తాయనే విషయం గుర్తుంచుకోండి.
గుర్తుతెలియని కాల్స్ సైలెంట్లో..
Silence Unknown Calls Feature : అపరిచితులు లేదా కంపెనీల నుంచి తరచూ మీ ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను ఈ Silence Unknown Calls ఫీచర్ ద్వారా అడ్డుకోవచ్చు. వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమెటిగ్గా బ్లాక్ అవుతాయి లేదా సైలెంట్‌లోకి వెళ్లిపోతాయి. అంటే మీ కాంటాక్ట్స్‌లో లేని వ్యక్తి ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు మీ ఫోన్ రింగ్ గానీ, వైబ్రేట్ గానీ అవ్వదు.
వాట్సాప్ ఛానల్స్..
WhatsApp Channels Feature : ఇటీవలే లాంఛ్ చేసిన ఈ WhatsApp Channels ఫీచర్ ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన హీరోలు, రాజకీయల నాయకులు లేదా ఇతర వ్యక్తుల నుంచి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు మీ వాట్సాప్ అప్లికేషన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ వాట్సాప్ అకౌంట్లో Updates అనే కొత్త అప్డేట్ కనిపిస్తుంది. దీంతో మీరు కూడా వాట్సాప్ ఛానల్‌ను సులువుగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వేరొకరి ఛానల్‌ను కూడా ఫాలో అవ్వవచ్చు. ఛానల్ యజమానులు పెట్టే పోస్టులను మీరు లైక్, షేర్ కూడా చేసుకోవచ్చు.
స్క్రీన్ షేరింగ్..
Screen Sharing Feature : కొన్నిసార్లు మీరు మీ ఫోన్‌లోని ఏదైనా ఫైల్ లేదా సమాచారాన్ని మరొకరికి చూపించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో స్క్రీన్షాట్లు తీసి పంపించడం కాస్త శ్రమతో కూడుకున్న పని. ఒక్కోసారి అవి పంపడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఈ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ యూజర్లకు చక్కగా ఉపయోగపడుతుంది. దీని సాయంతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీరు మీ డివైజ్‌లోని సదరు మీడియా ఫైల్‌ను స్క్రీన్ షేరింగ్ రూపంలో అవతలి వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్న వ్యక్తికి వీడియో కాల్ చేయాలి. తరువాత స్క్రీన్ దిగువన ఉన్న స్క్రీన్ షేరింగ్ ఐకాన్‌ను నొక్కండి.
న్యూ లేఅవుట్..
New Layout Feature : గత కొంతకాలంగా ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ లే-అవుట్‌ను మార్చేందుకు వాట్సాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
WhatsApp Secret Code Feature : వాట్సాప్ సీక్రెట్ కోడ్‌తో.. మీ ఛాట్స్ మరింత భద్రం!