చేతి గడియారంలోనే సెల్‌ఫోన్... ఇది ఇప్పటి సాంకేతికతకు పెద్ద కష్టమేమీ కాదు. సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. టెలిఫోన్లు, వైర్లెస్ ఫోన్లు(మొబైల్ ఫోన్లు), స్మార్ట్ఫోన్లు ఇప్పుడు 5G. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త మార్పులు సంభవిస్తున్నాయి.
మరి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ ఎప్పుడు చేశారో మీకు తెలుసా? ఫస్ట్ కాల్ వెళ్లి నేటికి 75 ఏళ్లు.
1946 జూన్ 17న మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఇప్పటిలా చేతిలో పట్టుకొని వెళ్లేందుకు వీలుగా ఉండేవి కావు. 80- పౌండ్ పేరుతో పిలిచే ఆ టెలిఫోన్లను.. కార్లలోనే అమర్చారు. ఇవి పెద్ద పెద్ద నగరాలు, హైవే కారిడార్లకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యక్తిగతంగా కాకుండా.. కంపెనీల అవసరాల కోసమే వీటిని వాడేవారు.
1948 నాటికి 5 వేల మంది.. ఈ తరహా మొబైల్ ఫోన్ల వినియోగదారులుగా మారారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత.. 1973లో చేతిలో పట్టుకొని తిరిగేందుకు వీలైన(హ్యాండ్‌హెల్డ్ మొబైల్ ఫోన్లు) ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
భారత్‌లో ఎప్పుడు..?
1995 జులై 31న భారతదేశంలో మొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు. అప్పటి టెలికాం మంత్రి సుఖ్ రామ్, అప్పటి బంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు మధ్య తొలి మొబైల్ ఫోన్ సంభాషణ జరిగింది. ఆ తర్వాత భారతదేశం టెలికాం రంగంలో విప్లవం చూశాం. అప్పట్లో మొబైల్ ఫోన్ ఉండటం ఓ లగ్జరీ. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఓ అవసరంగా మారిపోయింది.
దశాబ్దాల కృషితోనే..
ఇప్పుడు మనం వాడే స్మార్ట్ఫోన్ల వెనుక ప్రభుత్వాల దశాబ్దాల కృషి ఉంది. ఎందరో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు మొబైల్ ఫోన్ పరికరాల కోసం శ్రమించారు. ఇప్పుడు మనం వాడే ఫోన్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇదింకా అభివృద్ధి చెందొచ్చు.
హృదయ స్పందనలు తెలుసుకోవడం, సంజ్ఞలతోనే ఫోన్‌ను నియంత్రించడం, గది పరిమాణాన్ని కొలవడం వంటి రాడార్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 'సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడికి వెళుతుందో ఊహించడం కష్టం. కానీ దశాబ్దాల పరిశోధన, ప్రయోగాలు.. బంగారు భవిష్యత్తు అభివృద్ధికి మూల కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు.
ఇదీ చూడండి: చరవాణితో జాగారం..ఒంటికి హానికరం