Tesla Smartphone: ఎలాన్ మస్క్... సాధ్యం కాదనుకున్న దాన్ని పట్టుబట్టి చేసి చూపించడమే ఆయన ప్రత్యేకత. టెస్లా విద్యుత్తు (ఎలక్ట్రిక్) కార్లతో వాహన పరిశ్రమ రూపురేఖలనే మార్చేస్తున్న ఆయన దృష్టి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లపై పడింది. ఈ భూమండలంలోనే కాకుండా, అంతరిక్షం నుంచి.. చివరికి మార్స్ గ్రహం నుంచి సైతం 'హలో' అనగలిగే స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించటానికి ఆయన సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. టెస్లా విద్యుత్తు వాహనాలను అమెరికా రోడ్ల మీద పరుగులు తీయించడమే కాకుండా, 'స్పేస్ ఎక్స్' మిషన్‌తో అంగారక (మార్స్) గ్రహాన్ని కాలనీగా మార్చాలనే ఆలోచన చేస్తున్న ఎలాన్ మస్క్, ఏది చేసినా 'గ్రాండ్' గానే చేస్తారని అంటారు. అందువల్ల ఆయన స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అద్భుతాలు ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారనే చర్చ మొదలైంది.
విశ్వంలో ఉపయోగపడేలా..
ఎలాన్ మస్క్ తీసుకురానున్న టెస్లా మొబైల్ ఫోన్‌కు పేరూ ఖరారైంది. అదే 'పై' స్మార్ట్‌ఫోన్. దాని ప్రత్యేకతలపై వస్తున్న వార్తలు మరింత ఆశ్చర్య పరుస్తున్నాయి. ముఖ్యంగా 'స్టార్‌లింక్' సదుపాయం. 'నేను అంగారక గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను..' అని గతంలో మస్క్ అన్న మాటలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే 'పై' ఫోన్లో స్టార్‌లింక్ టెక్నాలజీని పొందుపరచనున్నారని చెబుతున్నారు. ఈ ఫోన్ తీసుకుని అంతరిక్షంలోకి.. మార్స్‌కు సైతం వెళ్లినా, అక్కడి నుంచి భూమి మీద ఉన్న వారితో మాట్లాడొచ్చమాట! ఈ విశ్వంలో ఎక్కడైనా వినియోగించడానికి అనువుగా తీర్చిదిద్దుతున్న ఫోన్‌గా చెబుతున్నారు.
క్రిప్టో మైనింగ్‌కూ
'మార్స్‌కాయిన్' అనే క్రిప్టో కరెన్సీని ఈ ఫోన్‌తో మైనింగ్ చేయాలన్నదీ ఆలోచన అట. మనిషి మొదడు- స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేసే బ్రెయిన్- ఫోన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. దీన్ని శాటిలైట్ ఫోన్‌గా వినియోగించుకోవచ్చు. 'తురాయ', ఇరిడియమ్' అనే శాటిలైట్ ఫోన్లు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇవి ఎంతో ఖరీదైన ఫోన్లు. వీటితో పోల్చితే టెస్లా మోడల్ పై, అందుబాటులో లభించే శాటిలైట్ ఫోన్ కావాలన్నది ఆకాంక్ష. ఈ ఫోన్‌ను సౌరశక్తితో ఛార్జ్ చేయొచ్చు. కాసేపు ఎండలో పెడితే ఫోన్ రీఛార్జి అవుతుంది. ఫోన్ వెనుక ప్యానెల్ మీద ప్రత్యేకమైన 'కోటింగ్' వేస్తారు. దీనివల్ల పరిసరాలను బట్టి ఫోన్ రంగు మారుతుంది.ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దాని ప్రకారం... టెస్లా పై స్మార్ట్‌ఫోన్ ధర 800 - 1200 డాలర్ల (సుమారు రూ.60,000-90,000) మధ్య ఉండొచ్చు. కాస్త అటూ ఇటుగా ఐఫోన్ ధరలు కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. అంటే టెస్లా ఫోన్, ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ఉన్న దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వబోతోందన్నమాట. అయితే 'పై' స్మార్ట్‌ఫోన్‌పై ఇంతవరకూ టెస్లా నుంచి కానీ, ఎలాన్ మస్క్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనలు, సంకేతాలు లేవు.
ప్రచారంలో ఉన్న ప్రత్యేకతలు:
- 48 ఎంపీ ముందు కెమెరా
- 108 ఎంపీ క్వాడ్ కెమెరా వెనుక
- 6.5 అంగుళాల 4కే సూపర్ అమోల్డ్ డిస్ప్లే
- స్మాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్
- 2టీబీ ఫ్లాష్ స్టోరేజ్
- బ్రెయిన్- ఫోన్ ఇంటర్‌ఫేస్
- స్టార్‌లింక్ టెక్నాలజీ (మార్స్ గ్రహం మీదా పనిచేసేలా)
- 210ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్
- 5జీ, సోలార్ ఛార్జింగ్
ఇదీ చూడండి: కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ జోరు- మారుతీ, హ్యుందాయ్ బేజారు