వనీలా ఐస్‌క్రీం తింటున్నారా? అయితే అది ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి తయారు చేసిందయ్యి ఉండొచ్చు! ఇప్పుడు కాదు గానీ మున్ముందు ఇలాగే ఆలోచించాల్సి ఉంటుంది. జన్యుపరంగా మార్పు చేసిన బ్యాక్టీరియా సాయంతో ప్లాస్టిక్ వ్యర్థాలను వనీలా రుచిగా మార్చే పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వనీలా రుచి, వాసనకు కారణమేంటో తెలుసా? వనిలిన్. దీన్ని వనీలా కాయల నుంచి గానీ కృత్రిమంగా గానీ తయారు చేస్తుంటారు. సుమారు 85% వనిలిన్ శిలాజ ఇంధనాల నుంచి తీసిన రసాయనాలతోనే తయారవుతోంది. ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, ఔషధాలు, కలుపు నివారకాల వంటి పలు ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. రోజురోజుకీ దీనికి గిరాకీ పెరుగుతూ వస్తోంది. మూడేళ్ల కిందట సుమారు 40,800 టన్నులుగా ఉన్న డిమాండ్ 2025 నాటికి 65వేల టన్నులకు చేరుకోగలదని భావిస్తున్నారు.
ప్లాస్టిక్ నుంచి వనిలిన్..
దీన్ని అందుకోవటానికి వనీలా కాయల దిగుబడి సరిపోదు. కృత్రిమంగా తయారుచేయటమే పరిష్కార మార్గం. అందుకే శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని రూపొందించారు. పాలీథీలేన్ టెరెథాలేట్‌తో తయారైన ప్లాస్టిక్‌ను టెరిథాలిక్ ఆమ్లంగా మార్చే అవకాశముందని గతంలోనే గుర్తించారు. ఈ టెరిథాలిక్ ఆమ్లాన్ని జన్యుమార్పిడి చేసిన ఇ-కొలి బ్యాక్టీరియా సాయంతో వనిలిన్‌గా మార్చొచ్చని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా నిరూపించారు. టెరిథాలిక్ ఆమ్లం, వనిలిన్ రసాయన మిశ్రమాల తీరు దాదాపు ఒకేలా ఉంటుంది. అందువల్ల మూల కర్బన పదార్థానికి అనుసంధానమైన హైడ్రోజన్, ఆక్సిజన్ల సంఖ్యను కాస్త అటూఇటూగా మారిస్తే చాలు. జన్యుమార్పిడి బ్యాక్టీరియా చేసే పని ఇదే. బ్యాక్టీరియాను టెరిథాలిక్ ఆమ్లంతో కలిపి 37 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత వద్ద 24 గంటలసేపు ఉంచగా.. సుమారు 79% ఆమ్లం వనిలిన్‌గా మారిపోవటం గమనార్హం. ఇది వనిలిన్ డిమాండ్‌ను అందుకోవటానికే కాదు.. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గటానికీ ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయని అంచనా. వీటిల్లో 14% మాత్రమే పునర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విలువైన పదార్థాలను తయారుచేస్తే రెండు విధాలా ఉపయోగపడుతుందనటం నిస్సందేహం.
ఇదీ చూడండి: మార్కెట్లో 'క్రీమ్‌స్టోన్' సరికొత్త ఐస్‌క్రీంలు