పబ్జీ.. దేశంలో ఈ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యువతరంలో ఈ ఆన్లైన్ ఆటకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పబ్జీతో గడిపేస్తుంటారు. ఖాళీ సమయంలో ఆడదామనుకుని పబ్జీ డౌన్లోడ్ చేసుకునే వారు.. కొంతకాలానికే దానికి బానిసగా మారిపోతున్నారు. తమ విలువైన సమయాన్ని ఈ ఆన్లైన్ గేమ్‌కు బలిచేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో పబ్జీ ఓ సంచలనం. దీని మీద మీమ్లూ ఎక్కువే. అదే విధంగా టీవీ ఛానళ్లలో ఈ గేమ్‌పై చర్చలు కూడా జరుగుతాయి. ఆట ఎలా ఉన్నా దానికి బానిసగా మారితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. పెద్దగా లాభం లేకుండా పోయింది. యువత నరనరాల్లోనూ పబ్జీ ఇంకిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. కానీ దీని వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకున్న వారు 'వావ్' బదులు 'వామ్మో!' అని అనక తప్పదు.
ఇదీ చూడండి:- చైనాకు మళ్లీ ఝలక్.. పబ్జీ సహా 280 యాప్‌లపై నిషేధం!
మొదలుపెడితే ఇక అంతే...
ఆటలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటం, ఆయుధాలతో కాల్చుకోవడం, చంపుకోవడం హింసను ప్రేరేపించే విషయాలు. పబ్జీ వ్యసనంగా మారిన వారి విషయంలో.. పరిస్థితులు నిజంగానే దారుణంగా ఉంటున్నాయి. ఈ ఆట నేపథ్యంలో ఆత్మహత్యకు సంబంధించిన ఘటనలు పెరిగిపోవడం ఇందుకు ఓ ఉదాహరణ. అంతేకాకుండా దీని ప్రభావం మొత్తం జీవనశైలిపై పడుతోంది. వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలు నాశనమవుతున్నాయి. దీనితో వారు శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.
ఇదీ చూడండి:- రాత్రంతా పబ్జీ ఆడాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు
గేమ్ ఆద్యంతం విద్వేషపూరిత భావాలను రేపుతుంది. దీంతో ప్లేయర్ల మానసిక స్థితి తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 2018లోనే హెచ్చరించింది. రోజులో ఒక గంట ఆడితే ఫర్వాలేదని.. కానీ 4-6 గంటల పాటు అదే పనిగా పబ్జీ ఆడితే శరీరానికి, మానసిక స్థితికి ఎంతో ప్రమాదకరమని స్పష్టం చేసింది.
అయితే చాలా మంది రాత్రంతా పబ్జీ ఆడుతూనే గడిపేయడం ఆందోళన కలిగించే విషయం. దీంతో వారు రోజంతా బద్ధకంగా గడుపుతున్నారు. ఒంట్లో శక్తి తగ్గిపోతోంది. కళ్ల మంటలు, తీవ్ర తలనొప్పి వస్తాయి.
అటు ఉద్యోగులు.. ఇటు విద్యార్థులు..
ఉద్యోగంలో డెడ్‌లైన్స్ ఉంటాయి. వాటిని అందుకోవడానికి ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు. ఈ సమయంలో ఆటవిడుపుగా మొదలుపెట్టే పబ్జీ.. మోయలేని భారంగా మారిపోతోంది. దీంతో డెడ్‌లైన్స్ అందుకోలేకపోతున్నారు ఉద్యోగులు. ఫలితంగా వృత్తిలో అనేక ఒతిళ్లు ఎదురవుతున్నాయి. ఈ ప్రభావం కుటుంబంపైనా పడుతోంది. ఈ పరిణామాలు కొన్నికొన్ని సార్లు భాగస్వాముల మధ్య విడాకులకు దారితీస్తున్నాయి.
ఇదీ చూడండి:- పబ్-జీ అడొద్దన్నాడని అన్ననే చంపేశాడు
విద్యార్థులపై పబ్జీ ప్రభావం ఘోరం. 'ఇంకో గేమ్.. ఇంకొక్క గేమ్' అనుకుంటూ పుస్తకాలను పక్కనపెట్టేస్తున్నారు. దీంతో మార్కులు పడిపోతున్నాయి. పబ్జీ ఆడే విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ పేరుతో పబ్జీ ఆడుతుంటే.. పాఠ్యాంశాలు బోరింగ్‌గా మారుతున్నాయి.
'చికెన్ డిన్నర్' కోసం తిప్పలు...
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి విషయం "విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్" అనే నినాదం. ఆటలో గెలిచే వారికి ఇది దక్కుతుంది. దీంతో మరింత ఉత్తేజంగా పదేపదే ఆడటం మొదలుపెడుతున్నారు. ఇందులో ఉండే ఆడియో చాట్స్‌తో ఇతర ప్లేయర్లతో మాట్లాడవచ్చు. దీనితో వారందరూ సామాజికంగా యాక్టివ్‌గా ఉంటున్నట్టు భావిస్తున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధం. ఆటలో గెలుపోటములు సహజం. అయితే ఈ ఆటలో గెలుపు ఇచ్చే కిక్‌తో పోల్చుకుంటే ఓటమి అనంతరం కలిగే బాధ రెట్టింపు.
ఇదీ చూడండి:- పబ్జీ ఆడుతుంటే గుండెపోటు- యువకుడి మృతి
భారత సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతకు విరుద్ధంగా ఉన్నందున పబ్జీ సహా 118 చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది ప్రభుత్వం.