డెస్క్‌టాప్‌లో అందరూ అత్యంత ఇష్టంగా వినియోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. కానీ, కొన్నిసార్లు ఇది నెమ్మదిగా పేజీలను లోడ్ చేస్తుంది. దీంతో అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే స్లో నెట్‌వర్క్ కనెక్షన్‌లో కూడా గూగుల్ క్రోమ్‌లో బ్రౌజింగ్ వేగాన్ని పెంచే 5 ఎక్స్‌టెన్షన్ సాఫ్ట్‌వేర్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో ఏ ఒక్కటీ కూడా మీ కంప్యూటర్ వేగాన్ని పెంచడానికి ఉద్దేశించింది కాదు. కానీ ఇవి క్రోమ్ వెబ్ పేజీల మీద ప్రభావం చూపించి త్వరగా లోడ్ అయ్యేలా చేస్తాయి.
ఫాస్టర్ క్రోమ్: క్లిక్ చేయకుండానే!
ఫాస్టర్ క్రోమ్ అనేది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఓ ఎక్స్‌టెన్షన్. వెబ్‌పేజీలో ఏదైనా ఒక వార్త, సమాచారాన్ని కర్సర్ పాయింట్‌తో క్లిక్ చేయకుండానే ఇది ముందుగా లోడ్ చేసి ఉంచుతుంది. బ్రౌజర్‌లో మౌస్ కదలికల్ని ట్రాక్ చేయడం ద్వారా ఫాస్టర్ క్రోమ్ పని చేస్తుంది. కర్సర్ పాయింట్ ఏదైనా వార్త, లింక్‌పై 65 మిల్లీ సెకన్లు ఆగగానే అక్కడి డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో లోడ్ చేస్తుంది. దీంతో ఆ లింక్‌పై మౌస్‌తో క్లిక్ చేయగానే వేగంగా సమాచారం మనకు కనిపిస్తుంది. సాధారణంగా వినియోగదారులు 100మిల్లీ సెకన్లలో పేజీ లోడ్ కావాలని ఆశిస్తారు. ఇక్కడ 65 మిల్లీసెకన్లలో, అదీ క్లిక్ చేయకముందే డేటా లోడ్ అయి ఉండటంతో వెబ్ బ్రౌజర్ గతం కన్నా చాలా వేగంగా పని చేస్తుంది. వినియోగదారుడు కొన్ని పేజీల్లో ఫాస్టర్ క్రోమ్ వినియోగం వద్దని కోరుకుంటే దాంట్లో నుంచి సైన్ అవుట్ కావచ్చు.
mcafee వెబ్ బూస్ట్ వీడియోల ఆటోప్లేకు అడ్డుకట్ట
గూగుల్ క్రోమ్ ద్వారా కొన్ని వెబ్‌సైట్ పేజీలు తెరవగానే వీడియోలు ఆటోప్లే అవుతుంటాయి. దీంతో బ్రౌజింగ్ వేగం తగ్గుతుంది. ఈ mcafee వెబ్ బూస్ట్ ద్వారా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు. సాధారణంగా క్రోమ్ బ్రౌజర్ వినియోగదారులు ఆటో ప్లేయింగ్ వీడియోలను ఆపడానికి బ్లాక్ చేసే విధానాలను వినియోగిస్తుంటారు. కానీ ఆ తర్వాత డెవలపర్స్ వాటిని అడ్డుకునే విధంగా అప్‌డేట్ ఇస్తారు. ఈ ప్రయాసంతా తప్పించుకొని వీడియోల ఆటోప్లేను అడ్డుకునేందుకు సరైన ఆప్షన్ ఈ ఎక్స్‌టెన్షన్.
వెబ్ బూస్ట్: కామన్ పేజీలు ఒకేసారి లోడ్ అవుతాయ్
క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్ పేజీలని వేగంగా లోడ్ చేసేందుకు వెబ్ బూస్ట్ విభిన్నమైన పద్ధతిని వినియోగిస్తుంది. ఇది కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా పేజీలు లోడ్ చేసేందుకు తక్కువ పని, సమయం తీసుకుంటుంది. అన్ని వెబ్ పేజీల్లో కనిపించే సోషల్ మీడియా షేరింగ్ బటన్స్, గూగుల్ యాడ్స్‌కు కోడ్ ఒకేలా ఉంటుంది. సాధారణ విధానంలో ఇవి ప్రతీసారి వేర్వేరు పేజీల్లో కొత్తగా డౌన్‌లోడ్ కావడంతో బ్రౌజింగ్‌లో సమయం తీసుకుంటుంది. కానీ వెబ్‌బూస్ట్ వీటిని ఒకే సారి లోడ్ చేసుకుంటుంది. దీంతో ప్రతి వెబ్‌సైట్ పేజీలో తిరిగి డౌన్‌లోడ్ చేయాల్సిన పని ఉండదు. ఈ కారణంగా తక్కువ సమయంలో వెబ్‌పేజీలు లోడ్ అవుతాయి. ఈ విధానంతో చిత్రాలు కానీ, వీడియోలు కానీ క్వాలిటీ కూడా తగ్గకపోవడం విశేషం.
షట్ అప్: విసుగు తెప్పించే కామెంట్స్ ఉండవు
క్రోమ్ బ్రౌజర్ వినియోగదారులు యూట్యూబ్ లాంటి వీడియో స్ట్రీమింగ్, న్యూస్ పోర్టల్స్ తదితర పేజీలు తెరిచినప్పుడు వాటిలో పోస్టుల కింద ఉన్న కామెంట్లు డీఫాల్ట్‌గా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ కామెంట్లు వ్యతిరేక భావజాలంతో ఉండటంతో అవి చూడగానే మనకు చిరాకు, నిరుత్సాహం కలుగుతుంది. వెబ్‌పేజీల్లో కామెంట్లను డీఫాల్ట్‌గా చూడకూడదనుకుంటే షట్ అప్ ఎక్స్‌టెన్షన్ ఉండాల్సిందే. దీంతో వెబ్‌పేజీల లోడింగ్ వేగం పెరగడమే కాదు, వినియోగదారుడు ఎంచుకున్న వెబ్‌సైట్లలో కామెంట్లు చూడాలనుకుంటే కొన్ని క్లిక్‌లతో ఆ వెబ్‌సైట్‌ను ఫిల్టర్‌లో ఉంచి అందులో కామెంట్లు చూడవచ్చు.
ఏఎంపీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్
ఏఎంపీ(యాక్సిలరేటెడ్ మొబైల్ పేజీస్) అనేది మొబైల్ ఫోన్‌లో వెబ్ పేజీలను వేగంగా లోడ్ చేసేందుకు గూగుల్ చేపట్టిన ప్రాజెక్ట్. ఇది డెస్క్‌టాప్‌లో కూడా పనిచేస్తోంది. ఏఎంపీ వెబ్‌పేజీకి సంబంధించిన హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్‌ఎస్, గూగుల్ క్యాచీని వినియోగించి గూగుల్ సెర్చ్, గూగుల్ న్యూస్ లాంటి పేజీలను త్వరగా ఓపెన్ చేస్తుంది. కొందరు ఇండిపెండెంట్ డెవలపర్లు చేసిన పరిశోధలో ఏఎంపీ ద్వారా 300 నుంచి 400 శాతం వేగంతో పేజీలు లోడ్ అవుతున్నట్లు తేలింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వినియోగదారుడు ఏఎంపీ ద్వారా కాకుండా మామూలు వెబ్‌పేజీ చూడాలనుకుంటే పేజీలోని నీలం రంగు ఏఎంపీ ఎక్స్‌టెన్షన్ ఐకాన్‌ను వినియోగించి బయటకు రావచ్చు. ఈ ఎక్స్‌టెన్షన్ చాలా కాలంగా అప్‌డేట్లు అందుకోవడం లేదు. మరోవైపు దీని డెవలపర్లు కొత్తగా ఏఎంపీ బ్రౌజర్‌ను తయారు చేసే పనిలో ఉన్నారు.
ఇదీ చూడండి: కరోనా మోసాలపై గూగుల్ తెలుగు వెబ్‌సైట్ షురూ