లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యూపిల్.. మార్కెట్లోకి తన కొత్త ఉత్పత్తులను విడుదల చేసే ముందు ఓ భారీ ఈవెంట్ నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మంగళవారం 'టైమ్ ఫ్లైస్' పేరుతో ఆ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా కారణంగా ఆన్లైన్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో.. మార్కెట్లోకి విడుదలవ్వొచ్చని అంచనాలు ఉన్న ప్రోడక్ట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్- 6
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న యాపిల్ వాచ్ సిరీస్ -5కు కొనసాగింపుగా వాచ్ సిరీస్- 6 రాబోతోంది. ఇందులో ప్రముఖంగా బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. దీనితోపాటు స్లీప్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉండబోతోంది. అలాగే ఈ వాచ్ యాపిల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) 7 మీద పని చేస్తుందట. గత సిరీస్ వాచ్‌ల కంటే మరింత కాలం మన్నేలా బ్యాటరీను పొందుపరుస్తున్నారట.
యాపిల్ వాచ్ ఎస్‌ఈ
వాచ్ సిరీస్- 6తోపాటు యాపిల్ వాచ్ ఎస్‌ఈ పేరుతో మరో వాచ్ కూడా తీసుకొస్తారని అంటున్నారు. ఇది ‘ఎస్‌ఈ’ ఫోన్ల తరహాలోనే తక్కువ ధరలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో వాచ్ 4, వాచ్ 5 తరహా ఫీచర్లు ఉంటాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాచ్ 3కి రీప్లేస్‌మెంట్‌గా ఈ వాచ్ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐప్యాడ్ ఎయిర్ 4
ఈ ఏడాది మొదట్లోనే యాపిల్ కొత్త ఐప్యాడ్ ప్రో ను విడుదల చేసింది. కాబట్టి ఈ ఈవెంట్‌లో ఇంకా లాంచ్‌కి మిగిలి ఉన్న ప్యాడ్ వెర్షన్ ఐప్యాడ్ ఎయిర్. ఈ ఈవెంట్‌లో ఐప్యాడ్ ఎయిర్ 4ను యాపిల్ తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సంవత్సరం కొత్త ఐప్యాడ్‌లు రాకపోవచ్చని మాట కూడా వినిపిస్తోంది. దీనిపై స్పష్టత లేదు.
సిలికాన్ మ్యాక్‌బుక్
ల్యాప్‌టాప్స్ కోసం యాపిల్ చిప్‌సెట్‌లను తయారు చేస్తున్నట్లు ఇటీవల డబ్ల్యూడబ్ల్యూడీసీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ చిప్ సెట్ పేరు యాపిల్ సిలికాన్ అని తెలిసింది. ఈ ఈవెంట్‌లో యాపిల్ ఆ చిప్‌సెట్‌తో మ్యాక్‌బుక్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో 14 అంగుళాల స్క్రీన్ ఉంటుందని సమాచారం. అయితే ఈ ల్యాపీని కాకుండా... తక్కువ ధరలో మ్యాక్‌బుక్ తీసుకొచ్చే అవకాశమూ ఉంది.
ఎయిర్‌పాడ్స్ స్టూడియో
యాపిల్ నుంచి వచ్చిన ఎయిర్‌పాడ్స్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీనితో హెడ్‌ఫోన్స్ విభాగంలో మరికొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యాపిల్. ఈ క్రమంలో ఎయిర్‌పాడ్స్ స్టూడియో పేరుతో హెడ్‌ఫోన్స్ లాంచ్ చేసే అవకాశం ఉందట. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ ట్యాగ్స్
యాపిల్ నుంచి ఎయిర్ ట్యాగ్స్ వస్తాయి అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా వస్తువులు మరిచిపోతే సులభంగా వెతుక్కోవడానికి ట్రాకర్‌గా ఈ ట్యాగ్స్ పని చేస్తాయి. ఇవి యూ1 అల్ట్రా వైడ్‌బ్యాండ్ సెన్సర్‌తో పనిచేస్తాయి. వీటితోపాటు హోంప్యాడ్ స్పీకర్, ఎయిర్ పవర్ వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటివి కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరి... ఐఫోన్ 12
మామూలుగా అయితే.. యాపిల్ ఈవెంట్‌లో ఐఫోన్స్‌ను ప్రధానంగా లాంచ్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అందరూ అదే అనుకున్నారు. అయితే యాపిల్ ప్లానింగ్ మార్చేసింది. కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్లు తీసుకొచ్చే క్రమంలో ఈసారి ఆలస్యమవుతోందట. ఇప్పటివరకు వచ్చిన ఊహాగానాలు, వార్తల ప్రకారం.. ఈ సారి నాలుగు ఐఫోన్లు రాబోతున్నాయి. త్వరలోనే ఈ ఫోన్ల కోసం ప్రత్యేక లాంచ్ ఈవెంట్ పెడతారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ద్వితీయార్ధంలో ఈ ఈవెంట్ ఉండొచ్చు.
6.1 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ మ్యాక్స్, 5.4 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ 12 తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేరుతో మరో రెండు మొబైల్స్ వస్తాయట. ఇవన్నీ 5జీ నెట్‌వర్క్‌తో పని చేస్తాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మ్యాక్స్‌లో ఓఎల్‌ఈడీ ప్యానల్స్ ఉండబోతున్నాయి. ఈసారి కెమెరాల విషయంలోనూ యాపిల్ మార్పులు చేస్తోంది. ప్రో మోడల్స్‌లో లైడార్ సెన్సర్‌ను తీసుకొస్తున్నారట. ఆగ్‌మెంటడ్ రియాలిటీ యాప్స్‌కు ఇది ఉపయుక్తంగా ఉంటుందట.
- భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు యాపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్ చూసే వీలుంది.
ఇదీ చూడండి:బొమ్మలతో దిమ్మతిరిగే అవకాశాలు!