మొబైల్ గేమ్ డెవలపర్లకు మరోసారి షాకిచ్చింది టెక్ దిగ్గజం యాపిల్. చైనా ఐ స్టోర్ నుంచి ఒకేసారి 29,800 యాప్‌లు తొలగించింది. ఇందులో 26,000 వరకు గేమింగ్ యాప్‌లు ఉన్నట్లు ప్రముఖ పరిశోధన సంస్థ క్విమై వెల్లడించింది. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది.
గేమ్ పబ్లిషర్లకు చైనా ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబర్లను సమర్పించేందుకు జూన్ ఆఖరు తేదీని తుది గడువుగా నిర్ణయించింది యాపిల్. ఈ విషయంపై ఏడాది ప్రారంభంలోనే గేమ్ డెవలపర్లకు సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ లైసెన్స్ వివరాలు సమర్పించని గేమ్‌లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా కొత్త నిబంధనలు..
గేమింగ్ కంటెంట్ నిబంధనలు కఠితనరం చేసేందుకు చైనా ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త నిబంధనల పాటించని గేమ్‌లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగిస్తున్నాయి టెక్ సంస్థలు.
అయితే తుది గడువు ముగిసిన నెల తర్వాత.. యాపిల్ ఉన్న ఫళంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇంతకు ముందు కూడా జులై మొదటి వారంలో 2,500లకు పైగా యాప్‌లను చైనా ఐ స్టోర్ నుంచి తొలగించింది యాపిల్.
చైనా కొత్త నిబంధనలు గేమ్ డెవలపర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు. చైనా ఏడాదికి 1,500 గేమ్‌లకు మాత్రమే లైసెన్సులు ఇస్తుందని చెబుతున్నారు. గేమ్‌లకు లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చైనా ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం తీసుకుంటుందని వెల్లడించారు విశ్లేషకులు. దీని వల్ల గేమ్ డెవలపర్లు అనుమతుల కోసం దీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సి వస్తుందని.. ఫలితంగా వారి ఆదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంటున్నారు.
ఇదీ చూడండి:'శాంసంగ్' యూవీ స్టెరిలైజర్తో 10 నిమిషాల్లో క్రిములు ఖతం!