అమెరికా గూగుల్ పే యూజర్లు ఇకపై భారత్, సింగపూర్‌లోని యూజర్లకు నేరుగా నగదు బదిలీ చేసుకోవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వెస్టర్న్ యూనియన్ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 200లకు పైగా దేశాలకు, వైస్ ద్వారా 80కిపైగా దేశాలకు అమెరికా నుంచి గూగుల్ పే యూజర్లు నగదు బదిలీ చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది.
పేమెంట్ చేయాల్సిందిలా..
దేశీయ లావాదేవీలతో పోలిస్తే.. అంతర్జాతీయ పేమెంట్ కాస్త భిన్నంగా ఉండనుంది. అంతర్జాతీయంగా నగదు బదిలీ చేయాలనుకున్నప్పుడు బెనిఫీషియరీని ఎంపిక చేసుకుని.. కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. దీనితో పాటు పేమెంట్ గేట్వేగా వెస్టర్న్ యూనియన్ లేదా వైస్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
గూగుల్‌పే ద్వారా జరిపే అంతర్జాతీయ లావాదేవీల సేవలను జూన్ 16 వరకు ఉచితంగా అందించనుంది వెస్టర్న్ యూనియన్. లావాదేవీ విలువపై కూడా పరిమితులు లేవు. నూతన వినియోగదారులు 500 డాలర్ల వరకు ఉచితంగా ట్రాన్స్ఫర్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వైస్ వెల్లడించింది.