Nobel Prize 2022 In Medicine: వైద్యరంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు. మానవులకు అత్యంత సమీప జాతి భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
వైద్య రంగంలో అవార్డు గ్రహీత పేరు ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సందడి మొదలైనట్లైంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.