ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్స్‌ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఫోన్ అనేది స్టేటస్ సింబల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మొబైల్ చేతిలో ఉంటే అన్నీ ఉన్నట్లే అనేలా పరిస్థితి తయారైంది. తినే భోజనం దగ్గర నుంచి ప్రయాణాల కోసం వాడే క్యాబ్‌ల వరకు అన్నీ మొబైల్‌లో నుంచి ఒక్క క్లిక్ ద్వారా బుక్ చేసేయొచ్చు. ఆర్థిక లావాదేవీలు కూడా వాటిలో నుంచే జరిగిపోతున్నాయి.
మొబైల్ వినియోగం తారాస్థాయికి చేరడం వల్ల ఫోన్ తయారీ సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. దీంతో మునుపటి కంటే తక్కువ ధరకే మొబైల్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాల్లో ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఉంటారు. వీరు అధిక ధరలు ఉండే ఫ్లాగ్‌షిప్ ఫోన్లను కొనడానికి అంతగా ఆసక్తి చూపరు! అందుకే మొబైల్ తయారీ సంస్థలు మన మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని మిడ్ రేంజ్ ఫోన్లను ఎక్కువగా రూపొందిస్తున్నాయి. రూ.30వేల ధరలో మొబైల్ తయారీ సంస్థలు అందిస్తున్న మిడ్ రేంజ్ ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో
గతేడాది ప్రథమార్థంలో మోటోరోలా సంస్థ ఎడ్జ్ 30 ప్రో ఫోన్‌ను లాంఛ్ చేసింది. మిడ్ రేంజ్ ఫోన్లలో అత్యంత వేగవంతమైన మోడల్ ఇదే. ఈ ఫోన్లను స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్ఓఎస్‌తో విడుదల చేశారు. సాధారణంగా ఈ చిప్‌సెట్‌తో మొబైల్స్ వేడెక్కడం లాంటి సమస్యలు వస్తాయి. కానీ ఎడ్జ్ 30 మోడల్ దీనికి మినహాయింపు అనే చెప్పాలి.
గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి, ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేంత బడ్జెట్ లేనివారికి ఈ ఎడ్జ్ 30 ప్రో మంచి ఎంపిక అని చెప్పొచ్చు. 144 హెడ్జెస్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ లాంటి ఫీచర్లు ఉన్న ఈ మొబైల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లను రూ.29,999 వేలు చెల్లించి దక్కించుకోవచ్చు.
ఐక్యూవోవో నియో 7
ఎడ్జ్ 30 ప్రో తర్వాత మరో మంచి మిడ్ రేంజ్ ఫోన్‌గా ఐక్యూవోవో నియో 7ను చెప్పుకోవచ్చు. గేమింగ్ కాకుండా రోజువారీ అవసరాలకు మొబైల్‌ను వినియోగించే వారికి ఇదో మంచి ఎంపిక. దీని బిల్డ్ క్వాలిటీ ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ ఉన్న ఈ ఫోన్‌లో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. మంచి ఫీచర్లతో ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను రూ.30,985కు సొంతం చేసుకోవచ్చు.
రియల్ మీ 10 ప్రో ప్లస్
మిడ్ రేంజ్ ఫోన్లలో మరో మంచి ఎంపికగా రియల్ మీ 10 ప్రో! ఈ జాబితాలో ఉన్న మొబైల్స్‌లో ఇది అంత వేగవంతమైనది కాకపోవచ్చు కానీ రూ.30 వేల లోపు ధరలో వచ్చే మొబైల్స్‌లో ఇది మంచి ఎంపికే. ఈ లిస్టులోని మిగతా ఫోన్లతో పోలిస్తే రియల్ మీ 10 ప్రో ప్లస్ ప్రాసెసర్ కాస్త స్లో. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో నడిచే ఈ మొబైల్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇలాంటి డిస్‌ప్లేను అందిస్తున్న అతికొద్ది మిడ్ రేంజ్ ఫోన్లలో ఇదొకటి. 108 మెగాపిక్సల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్న రియల్ మీ 10 ప్రో ప్లస్ ధర రూ.24,999గా ఉంది.
రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్
రెడ్ మీ నోట్ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ నోట్ 12 ప్రో ప్లస్. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్.. మల్టీటాస్కింగ్ కోసం మొబైల్స్‌ను వాడేవారికి మంచి ఎంపిక. ఇందులో ప్రధాన ఆకర్షణ 200 మెగాపిక్సల్ కెమెరా. మంచి కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. గేమింగ్‌తో సంబంధం లేకుండా ఫొటోల కోసం ఫోన్ కావాలనుకుంటే రూ.29,999కు నోట్ 12 ప్రో ప్లస్‌ను కొనొచ్చు.
నథింగ్ ఫోన్ (1)
ఈమధ్య కాలంలో ఏ మొబైల్ లాంఛ్‌కు రానంత క్రేజ్ వచ్చింది నథింగ్ ఫోన్‌కే. నథింగ్ మోడల్ మార్కెట్‌లోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అయినా ఇప్పటికీ మిడ్ రేంజ్ మొబైల్స్‌లో తన స్థానాన్ని నిలుపుకుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో మంచి అమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. ఈ మొబైల్ ఇంటర్ ఫేస్ మిగతా ఫోన్ల కంటే కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి. మిడ్ రేంజ్‌లో ఉన్న మిగతా మోడళ్ల కంటే కాస్త భిన్నమైన ఫోన్ తీసుకుందామని భావించే వారు నథింగ్ ఫోన్ (1)ను ప్రయత్నించొచ్చు. దీని ధర రూ.28,999గా ఉంది.