మొబైల్ ప్రియులను అలరించేందుకు మరిన్ని స్మార్ట్‌ఫోన్లు (Smartphones) రాబోతున్నాయి. గత పది నెలల్లో అదిరిపోయే ఫోన్లు రిలీజ్ అయ్యాయి. బేసిక్, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఇలా వివిధ విభాగాల్లో వచ్చిన స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒక రేంజ్ అనుకుంటే.. వాటిని మించి మరిన్ని ప్రత్యేకతలతో నవంబర్ నెలలో కొత్త మొబైల్స్ (November Smartphones) మార్కెట్‌లోకి సందడి చేయనున్నాయి. అవేంటో ఓసారి చూసేయండి!
నెలాఖరున వస్తుందట...
హైఎండ్ రేంజ్‌లో మంచి స్పెసిఫికేషన్స్ కోసం ఎదురుచూసేవారికి ఆసుస్ కొత్త ఫోన్ తీసుకురాబోతోంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆసుస్ 8z అందుబాటులోకి రానుంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందువైపు 12 ఎంపీ కెమెరా.. వెనుకవైపు రెండు కెమెరాలుంటాయి. అందులో ఒకటి 64 ఎంపీ వైడ్ కెమెరా కాగా.. మరొకటి 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇస్తున్నారు. ధర ₹62,205 ఉండనుంది. నవంబర్ 30న విడుదల చేయనున్నట్లు సమచారం.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_asus.jpg)
రెడ్‌మీ నుంచి మూడు...
భారత్‌లో రెడ్‌మీ (Redmi) నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయంటే చాలు.. ఆ ఫోన్ల ప్రత్యేకతలు తెలుసుకొని తీరాల్సిందే అన్నట్టుగా ఎదురుచూస్తుంటారు టెక్ గురూలు. అంతే స్పీడ్‌లో నచ్చితే కొనేస్తారు కూడా. ఈసారి రెడ్‌మీ నోట్ సిరీస్ (Redmi Note 11 Series) నుంచి మూడు కొత్త ఫోన్లు (రెడ్‌మీ నోట్ 11, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్) రాబోతున్నాయి. నోట్ 11 సిరీస్ ఫోన్లన్నీ క్వాడ్ కెమెరాతో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సల్స్ ఉంటుంది. 5జీ కనెక్టివిటీతో పాటు బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్లు చైనాలో అక్టోబర్ 28న విడుదల చేస్తుండగా.. భారత్‌లో నవంబర్ చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. వీటి ధర ₹14,000 నుంచి ₹25,700 వరకు ఉంటుందని అంచనా.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_redmi-note-11.jpg)
షావోమి 11 సిరీస్‌లో...
షావోమి (Xiaomi) త్వరలో మరో కొత్త మోడల్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. షావోమి 11టీ (Xiaomi 11T) పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేయనుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 108 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ రానుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది. నవంబర్ రెండు, మూడు వారాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నాయి.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_xiaomi.jpg)
పోకో నుంచీ రెండే...
పోకో నుంచి వచ్చే M సిరీస్ (POCO M Series) ఫోన్లు నవంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 5జీ నెట్‌వర్క్ సపోర్టు ఉండనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. వెనుకవైపు క్వాడ్ కెమెరాతో పాటు, ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ ఉండనుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఇవ్వనున్నారు. ప్రారంభ ధర ₹15,990 నుంచి ఉండొచ్చని సమాచారం. బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ కోసం ఎదురుచూసే వినియోగదారులకు ఈ మొబైల్ బాగుంటుందని టెక్ నిపుణులు అభిప్రాయం.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_poco.jpg)
'ప్రగతి' ఓఎస్‌తో...
ఇది దీపావళికి ముందే జియో ఫోన్ నెక్స్ట్ (JioPhone Next) మార్కెట్లోకి రావొచ్చని అంచనా. 2జీ నుంచి 4జీ స్మార్ట్ ఫోన్‌వైపు మళ్లే వారికి బడ్జెట్ రేంజ్‌లో ఇది ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కోసం జియో ప్లాట్‌ఫామ్స్, గూగుల్ సంయుక్తంగా 'ప్రగతి' ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశాయి. వెనుక, ముందు రెండు వైపులా 13 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ రానుంది. దీని ధర ₹3 వేల నుంచి ₹4 వేలు వరకు ఉంటుందని తెలుస్తోంది. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 2జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ వెర్షన్స్... స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్ ఉండొచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
వన్‌ప్లస్ 9 సిరీస్‌లో...
వన్‌ప్లస్ (Oneplus) నుంచి ఈ సారి 9RT (Oneplus 9RT) ఫోన్ సందడి చేయనుంది. ఈ ఫోన్ ధర ₹39వేల నుంచి ప్రారంభం కానుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపున ట్రిపుల్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉండనుంది. ఈఫోన్‌కు ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే.. మల్టీ టాస్కింగ్, మెమరీ మేనేజ్‌మెంట్ కోసం 7జీబీ వర్చువల్ ర్యామ్ (Virtual RAM)ను ఇవ్వనున్నారు. నవంబర్ మధ్యలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_1plus-9rt.jpg)
ఐకూ కొత్త మొబైల్స్
ఐకూ 8, 8 లెజెండ్ (iQOO 8 Series) పేరుతో ఐకూ రెండు కొత్త మొబైల్స్‌ను నవంబర్ చివర్లో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన ‘ఐకూ 8 ప్రో’ను భారత్‌లో ఐకూ 8 లెజెండ్‌గా తీసుకొస్తున్నారు. ప్రధాన కెమెరా 48ఎంపీ మెగాపిక్సల్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందువైపు 24 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ ఉండొచ్చు. 6.76 అంగుళాల 2K OLED డిస్‌ప్లేతో రానుంది. 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించారు. ఐకూ 8 ధర ₹40 వేలుపైగా ఉండొచ్చు. ఇక ఐకూ లెజెండ్ ధర అయితే ₹50 వేలకుపైగా ఉండొచ్చని సమాచారం.
![November Smart Phones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508625_iq00.jpg)
శాంసంగ్, ఒప్పొ, వివో నుంచి నవంబర్ నెలలో కొత్తగా ఎలాంటి ఫోన్లూ రావడం లేదని సమాచారం. మైక్రోమాక్స్, లావా నుంచి కొత్త ఫోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి.
గమనిక: ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు నవంబర్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్లను ఇక్కడ ఇచ్చాం. ఇవి కాకుండా మరికొన్ని మొబైల్స్ మార్కెట్‌లోకి రావొచ్చు. అలానే పైఫోన్లలోని స్పెసిఫికేషన్స్, ధరల్లో మార్పులు ఉండొచ్చు.
ఇదీ చూడండి: అదిరే ఫీచర్లతో రూ.14 వేలలోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే!