సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ కనిపెట్టిన రోజు ఆయన పరిస్థితి ఎలా ఉంది ? సెల్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్‌గా మారుతుందని కూపర్ ముందే ఊహించారా.? ప్రజల జీవితంలో సెల్‌ఫోన్ ఇన్ని మార్పులు తెస్తుందని అంచనా వేశారా...? భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ ఎలా మారబోతుందనే దానిపై కూపర్ ఏం చెప్పారు. సెల్‌ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు కూపర్ అంతరంగం తెలుసుకుందాం.
1973.. ఏప్రిల్ 3న న్యూయార్క్ నగరంలోని హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ మొబైల్ ఫోన్ నుంచి సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్.. మొదటి కాల్ చేసి 50 ఏళ్లు పూర్తయింది. అంటే అర్ధ శతాబ్దం క్రితం మానవుడు మొబైల్ ఫోన్‌లో తొలి కాల్ మాట్లాడాడు. మోటరోలా కమ్యూనికేషన్ సిస్టమ్స్ విభాగానికి నాయకత్వం వహించిన కూపర్.. మొట్ట మొదటి వాణిజ్య పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ రూపొందించారు. మొబైల్ కనిపెట్టినప్పుడు మార్టిన్ కూపర్.. కేవలం ఆ ఫోన్ పరిమాణం గురించే ఆందోళన చెందారు.
50 సంవత్సరాల క్రితం నేను సెల్‌ఫోన్‌ను రూపొందించినప్పుడు.. తొలి ఫోన్ కాల్ చేసినప్పుడు.. ఏదో ఒక రోజు ఇది అందరి దగ్గర ఉంటుందని నాకు తెలుసు. అది చాలా పాత కాలం. 1973లో ఇంటర్నెట్ లేదు. నమ్మినా నమ్మకపోయినా డిజిటల్ కెమెరాలు లేవు. భారీగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు లేవు. ఈ పరిస్థితుల్లో మేం తయారు చేసిన మొబైల్ ఫోన్ బరువు ఒక కిలో కంటే ఎక్కువ ఉండేది. 25 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఉండేది. కిలో బరువు ఓ సమస్యేనా అని మీకు అనిపించవచ్చు. కానీ దానిని మీ తలపై 20 నిమిషాలకు మించి పట్టుకోలేరు. కాబట్టి ఆ సమయం చాలా క్లిష్టమైనది.
-మార్టిన్ కూపర్
1973లో తాను చేసిన ఒక్క ఫోన్ కాల్ సెల్‌ఫోన్ విప్లవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడిందని మార్టిన్ కూపర్ తెలిపారు. కానీ మొబైల్ కనిపెట్టిన రోజు అది చారిత్రాత్మక క్షణమని తాము తెలుసుకోలేకపోయామని ఆరోజు ఘటనలను కూపర్ గుర్తు చేసుకున్నారు. కానీ ఏదో ఒకరోజు ఫోన్ అందరి దగ్గర ఉంటుందని మాత్రం కచ్చితంగా అనుకున్నామని వివరించారు. భవిష్యత్తులో ఆధునిక స్మార్ట్‌ఫోన్‌ల ఆకృతి గురించి తనకు అంత వ్యామోహం లేదని కూపర్ వెల్లడించారు. కానీ భవిష్యత్తు ఫోన్‌లో మన శరీరంపై అమర్చుకునేలా ఉంటాయని.. బహుశా సెన్సార్‌లుగా అవి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయని అంచనా వేశారు.
"భవిష్యత్తులో సెల్‌ఫోన్‌లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న పిచ్చి నాకు లేదు. కానీ మీ ఫోన్‌ను చేతితో పట్టుకుని... చేతితో దానిని ఇబ్బందికరంగా మీ తల దగ్గర పెట్టుకుని.. మాట్లాడే స్థితిలో ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఏదో ఒకరోజు సెల్‌ఫోన్‌ను సెన్సార్లులాగా మన శరీరంపై అమరుస్తారని నేను భావిస్తున్నాను. అది మీ ఆరోగ్యాన్ని నిరంతరం అంచనా వేస్తూ ఉంటుంది. అనారోగ్యాన్ని వెంటనే గుర్తిస్తూ మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుంది" అని మార్టిన్ కూపర్ అన్నారు.
సెల్‌ఫోన్ అభివృద్ధిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మార్టిన్ కూపర్.. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడంపైనే ఆందోళన వ్యక్తం చేశారు. "సెల్‌ఫోన్‌పై నా అత్యంత ప్రతికూల అభిప్రాయం ఏమిటంటే.. భవిష్యత్తులో మనకు ఎలాంటి గోప్యత ఉండదు. ఎందుకంటే మన గురించిన ప్రతి విషయం ఎక్కడో ఓ దగ్గర రికార్డ్ చేస్తూనే ఉంటారు. ఇది చాలామందికి మన వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మన గోప్యతను ఎలా రక్షించాలో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సి రావచ్చు. గోప్యతను కాపాడడం అతిపెద్ద సవాలు" అని మార్టిన్ కూపర్ చెబుతున్నారు.
తాను ప్రస్తుతం ఈ–మెయిల్ చెక్ చేసుకునేందుకు, ఫొటోలు, యూట్యూబ్ వీడియోలు చూసేందుకు స్మార్ట్ ఫోన్ వాడుతున్నానని మార్టిన్ కూపర్ తెలిపారు. హియరింగ్ ఎయిడ్ ను కంట్రోల్ చేసేందుకూ ఉపయోగిస్తున్నానని వివరించారు. ఏదైనా సమస్య వస్తే సమాధానం కోసం ఇంటర్నెట్‌ను వాడుతున్నట్లు కూపర్ వెల్లడించారు. ఫోన్‌లో తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న సెల్‌ఫోన్ పితామహుడు.. టిక్ టాక్ అంటే ఏంటో తనకు తెలియదని తెలిపారు. ప్రస్తుతం లక్షల కొద్దీ యాప్‌లు వచ్చాయని.. అందులో చాలా వరకు తనకు అస్సలు తెలియవని కూపర్ వివరించారు.