LG Waterless Washing Machine: సంప్రదాయ వాషింగ్ మెషీన్లను వినియోగించాలంటే లీటర్ల కొద్దీ నీరు, డిటర్జెంట్ అవసరమవుతుంది. ఈక్రమంలో చాలా నీరు వృథాగా పోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ.. నీటి అవసరం లేని వాషింగ్ మెషీన్లను తయారు చేస్తోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తుల తయారీలో భాగంగా.. నీరు అవసరం లేని వాషింగ్ మెషీన్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది.
Waterless Washing Machine details:
ఎల్జీ రూపొందించనున్న సాంకేతికతకు వాణిజ్య, పరిశ్రమలు, ఇంధన మంత్రిత్వ శాఖల అనుమతులు లభించాయి. దీంతో సాంకేతికతపై ట్రయల్స్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. నీటికి బదులుగా కార్బన్ డయాక్సైడ్ను వినియోగిస్తూ ఈ వాషింగ్ మెషీన్‌ను రూపొందించనుంది ఎల్జీ. వాతావరణంలో గ్యాస్ రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను రిఫ్రిజిరేషన్, కంప్రెషన్ ప్రక్రియల ద్వారా ద్రవ రూపంలోకి మార్చనుంది. ఇలా మారిన ద్రవరూప కార్బన్ డయాక్సైడ్ను బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ వినియోగించుకుంటుంది.
Water machine using carbon dioxide
ద్రవ కార్బన్ డయాక్సైడ్‌లో ఉండే చిక్కదనంతో బట్టలపై ఉన్న మురికిని వాషింగ్ మెషీన్ తొలగిస్తుంది. ఉతకడం పూర్తైన తర్వాత ద్రవ కార్బన్ డయాక్సైడ్ను తిరిగి.. వాయు స్థితికి మార్చుతుంది. తద్వారా ఈ వాషింగ్ మెషీన్ నుంచి మురికి నీరు, డిటర్జెంట్ వంటి వ్యర్థాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
ఎప్పుడు వస్తుందంటే?
ఈ సాంకేతికతపై ట్రయల్స్ పూర్తైన తర్వాత కంపెనీ తన రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత మెషీన్లను అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వచ్చేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: iPhone ఐఫోన్ బంపర్ ఆఫర్- 12 సిరీస్‌పై భారీ డిస్కౌంట్