Internet Shutdowns India: సమాజంలో నిత్యం ఏదైనా సంఘటన జరిగితే.. అంతర్జాలం ద్వారా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అందులో నిజం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు అసత్య వార్తలు కూడా బాగా వ్యాప్తి చెందుతుంటాయి. కొన్ని హింసను ప్రేరేపించేవి కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఆ నిర్దిష్ట ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్ చేస్తుంటుంది. కారణం.. సమస్య తీవ్రత, భయాందోళనలను వీలైనంత తగ్గించడం, అల్లర్లను నిరోధించడం ఏదైనా కావొచ్చు. దీనిని వ్యతిరేకించేవారూ ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి.
ప్రస్తుతం భారత్ మొత్తం డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. ఇంటర్నెట్ లేకపోతే ఏం చేయలేం అనే పరిస్థితులు వచ్చాయి. నగదు లావాదేవీలు ఎక్కువగా డిజిటల్కే మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌కు వెళితే.. ఏం చేయాలి? దాని కోసం ముందే మనం ఎలా సిద్ధం కావాలి?
చాలినంత నగదు ఉంచుకోవాల్సిందే: ప్రస్తుత రోజుల్లో నిత్యావసరాలు సహా ఏది కొనుక్కోవాలన్నా.. డిజిటల్కే మొగ్గుచూపుతున్నాం. మొబైల్ వ్యాలెట్లు, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు ఇలా ఎన్నో వాడుతుంటాం. కానీ.. ఇంటర్నెట్ లేకుంటే ఏం చేస్తాం? ఒక్కసారిగా అనుకోని పరిస్థితుల వల్ల ఇంటర్నెట్ బంద్ అయితే? ఒక్కోసారి బతకడం కష్టమనే అభిప్రాయం కూడా వస్తుంది.
అందుకే.. ఎప్పుడూ చాలినంత నగదు మీ ఇంట్లో కొంచెం.. కొంత మొత్తం మీ పర్సులో ఉంచుకోవాలి. మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా లిక్విడ్ క్యాష్ అవసరమే. నిజానికి డబ్బులు అవసరమైనంత చేతిలో ఉంచుకోవడం మంచి ఆలోచన. డిజిటల్ చెల్లింపులు విఫలమైనప్పుడే కాకుండా.. చాలా పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రభుత్వం యూపీఐ పేమెంట్స్‌ను నిలిపివేస్తుందనేది కూడా అందరూ తెలుసుకోవాలి.
డాక్యుమెంట్లు, టికెట్లు, హోటల్ బుకింగ్స్: మీకు అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, స్కాన్ కాపీలు వంటివి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయి. కొన్నింటిని ఇంటర్నెట్ లేకుండా యాక్సెస్ చేయలేం. కాబట్టి.. ప్రయాణం చేసే సమయాల్లో అవసరమైన ఫొటోలు, స్క్రీన్ షాట్లు, టికెట్లు, హోటల్ బుకింగ్స్ వంటివి ఆన్లైన్లో చేస్తే వాటి ప్రింట్ అవుట్స్, స్క్రీన్ షాట్స్ తీసుకోవడం ఉత్తమం.
ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్లోడ్: మీ రాష్ట్రం, మీ ప్రాంతాలకు సంబంధించి.. గూగుల్ మ్యాప్స్‌లో ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఎల్లప్పుడూ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు ఎటైనా బయటకు వెళ్లాలనుకున్నా.. సంబంధిత ప్రాంతం మ్యాప్‌ను కూడా ముందే ఆఫ్‌లైన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అకస్మాత్తుగా ఇంటర్నెట్ నిలిపివేసినా.. 4జీ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా.. ఇవే మిమ్మల్ని రక్షిస్తాయి.
4G పనిచేయకపోతే?: 4జీ కనెక్టివిటీ పనిచేయని పరిస్థితుల్లో.. ఫోన్లో ఎవరినైనా సంప్రదించాలన్నా 2Gపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికోసం ఎప్పుడూ కాల్స్, ఎస్ఎంఎస్లు చేసుకునేందుకు తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ఎక్కువగా మొబైల్ ఇంటర్నెట్నే నిలిపివేస్తుంది. కాబట్టి.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ తీసుకోవడం మంచి ఆలోచన. ఇవి చౌకగా కూడా ఉంటాయి. ఇది మీ చుట్టుపక్కల వారిని కూడా ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యేలా చేస్తుంది.
మూవీస్, సాంగ్స్ డౌన్లోడ్: కాలక్షేపం కోసం పాత రోజుల్లో సాంగ్స్, మూవీస్, గేమ్స్, ఇతర కంటెంట్ ఏదైనా ఆఫ్‌లైన్, మెమొరీ కార్డుల్లోకి డౌన్లోడ్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ వంటివి ఈ అలవాట్లను దెబ్బతీశాయి. ఇంటర్నెట్ పనిచేయని పరిస్థితులను ఎదుర్కోవడానికి.. ఈ కంటెంట్‌ను మునుపటిలా డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం.
వీపీఎన్ యాప్: పాక్షిక ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల సమయంలో.. ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యేందుకు VPN యాప్ మీకు ఉపయోగపడొచ్చు. పూర్తిగా ఇంటర్నెట్ బంద్ అయితే మాత్రం ఏం చేయలేం. వీపీఎన్.. మీ సమాచారాన్ని రక్షిస్తుంది. ఇది సురక్షితం కూడా.
బ్రిడ్జ్‌ఫై, ఫైర్‌చాట్: మీ సమీపంలోని ప్రజలతో ఎల్లప్పుడూ అనుసంధానం అయ్యేందుకు బ్రిడ్జ్‌ఫై, ఫైర్‌చాట్ వంటి యాప్స్ ఉపయోగించవచ్చు. ఇది బ్లూటూత్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లను పంపుతుంది.
2G ఫోన్లు వాడితే: ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల్లో ప్రజలతో మమేకం అయ్యేందుకు.. ఫోన్లు చేసుకునేందుకు.. సందేశాలను చేరవేసేందుకు 2G ఫోన్లు ఉపయుక్తంగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్ల కంటే 2జీ హ్యాండ్సెట్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ టార్చ్, ఎఫ్ఎం, కెమెరా, ఎంపీ3, మైక్రో ఎస్డీ కార్డ్ వంటి ఫీచర్లు ఉంటాయి. అందుకే స్మార్ట్ ఫోన్ వాడుతున్నా.. ఒక చిన్న ఫోన్ వెంట ఉంచుకోవడం మంచిది.
ల్యాండ్‌లైన్: మీ ప్రాంతంలో తరచూ ఇంటర్నెట్ షట్డౌన్లు వంటివి విధిస్తున్నట్లయితే.. ల్యాండ్‌లైన్ కనెక్టివిటీ తీసుకోవడం కూడా మంచిదే.
ఇవీ చూడండి: ఫొటో ఎడిటింగ్, ఫైల్ కన్వర్షన్.. అన్నీ టెలిగ్రామ్లోనే! ఈ 'బాట్స్'ను ట్రై చేయండి!!
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. అంతర్జాలం కానుంది ఇక వస్తుజాలం!
'సూపర్ స్మార్ట్' ఫోన్ కావాలా? ఈ 9 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి!