మనకు రోజువారీగా వచ్చే మెయిల్స్‌లో దాదాపు 99.9 శాతం స్పామ్, ఫిషింగ్ మెయిల్స్ ఉంటాయని మీకు తెలుసా?.. అవును, ఇది నిజం. దీన్ని గూగుల్ సంస్థ కూడా ధ్రువీకరించింది. సబ్స్క్రిప్షన్ రెన్యూవల్ చేసుకోండి, ఉద్యోగాలు పొందండి, మీరు లాటరీ గెలుపొందారు అంటూ వచ్చే నకిలీ మెయిల్స్‌తో అందరూ జాగ్రత్తగా ఉండాలని గూగుల్ హెచ్చరిస్తోంది. ఇలా అనుమానాస్పద లేదా ప్రమాదకర మెయిల్స్‌ను ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ వాటిని తెరిస్తే మీ వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ జీమెయిల్లో అనుమానాస్పద మెయిల్స్ కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని గూగుల్ సంస్థ చెబుతోంది. వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిందిగా తాము ఎప్పుడూ యూజర్లను కోరమని ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ మీ జీమెయిల్‌కు తరచూ అలాంటి మెయిల్స్ వస్తున్నాయా? అయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మెయిల్స్ వస్తే, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పే పలు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రహస్యంగా ఉంచడమే ఉత్తమం
మీ సోషల్ మీడియాతో పాటు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్స్‌ను మెయిల్స్ ద్వారా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంక్ ఖాతాల నంబర్స్, ఇతర వివరాలను రహస్యంగా ఉంచుకోవాలి. ఈమెయిల్స్ అనే కాకుండా మిగతా ప్లాట్ ఫామ్స్‌లో కూడా ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దు. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్స్‌గా చెప్పుకునే ఆధార్ లాంటి వివరాలను కూడా షేర్ చేసుకోవద్దు.
అలాంటి లింక్స్‌ను ఓపెన్ చేయొద్దు
క్రెడిట్ కార్డు నంబర్లను కూడా మెయిల్స్ రూపంలో ఎవరితోనూ షేర్ చేయవద్దు. కుటంబ సభ్యులకు సంబంధించి, ఉదాహరణకు మీ తల్లి పూర్తి పేరు లాంటి వివరాలను రహస్యంగా ఉంచాలి. పుట్టినరోజుతో పాటు పలు వ్యక్తిగత విషయాలను మెయిల్స్‌లో షేర్ చేసుకోకూడదు. మనకు మెయిల్స్ చేసే సెండర్‌కు ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదు. మెయిల్స్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు లేదా ఇతర అటాచ్ మెంట్స్‌ను డౌన్లోడ్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలాగే మెయిల్లో ఎంబెడ్ చేసి ఉండే లింక్స్‌ను కూడా ఓపెన్ చేయకూడదు.
వెంటనే ఫిర్యాదు చేయాలి
ఒకవేళ గూగుల్ నుంచి మెయిల్ చేస్తున్నామని, మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వండంటూ ఏవైనా సందేశాలు వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి. దీనికోసం రిపోర్ట్ సస్పీషియస్ ఈమెయిల్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ మీ సమాచారం మెయిల్ ద్వారా అప్పటికే చోరీకి గురైతే వెంటనే ఆయా ఖాతాల ద్వారా ఎలాంటి లావాదేవీలు జరిగాయనేది తెలుసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాతో మోసాలు జరుగుతున్నాయో లేదో తెలుసుకుని.. పాస్ వర్డ్స్ లాంటివి మార్చడం ద్వారా తప్పుడు లావాదేవీలను అడ్డుకోవాలి.
ఇవీ చదవండి : విసిగించే స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు ఇక చెక్.. నేటి నుంచే కొత్త రూల్స్!
ఆండ్రాయిడ్ ఫోన్లో అదిరిపోయే ట్రిక్స్.. ఈ 5 ఫీచర్లు తెలిస్తే మీ పనులు మరింత ఈజీగా..