How To Create Emoji in Google : వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. ఇలా ఏ యాప్ ఓపెన్ చేసినా మనకు ఎమోజీలు కనిపిస్తాయి. మన స్మార్ట్‌ఫోన్‌లో వాడే కీబోర్డుల్లోనూ బోలెడు ఎమోజీలు దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు మనకు కావాల్సిన ఎమోజీ దొరక్కపోవచ్చు. అలాంటప్పుడే అనిపిస్తుంది.. ఎమోజీలను మనమే ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని! అయితే మీకు నచ్చిన ఎమోజీని.. ఇప్పుడు చాలా సింపుల్‌గా గూగుల్ సెర్చ్‌తో డిజైన్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Emoji Kitchen : గతంలో ఎమోజీ కిచెన్ పేరిట జీబోర్డులో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్. తాజాగా దాన్ని వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్‌లో ఎమోజీ కిచెన్ అని సెర్చ్ చేసి ఎమోజీలను మీకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు. అందుకోసం మొదట ఎమోజీ అని సెర్చ్ చేయాలి. తర్వాత 'గెట్ కుకింగ్' ఆప్షన్ క్లిక్ చేస్తే.. రెండు వేర్వేరు ఎమోజీలను కలిపే ఆప్షన్ కనిపిస్తుంది. కళ్లద్దాలతో ఉన్న ఎమోజీకి మాస్కూ తొడగొచ్చు. లేదంటే టెడ్డీ, బన్నీని కలిపేసి ఓ కొత్త జంతువు ఆకారాన్నీ రూపొందించొచ్చు. ఇలా మీకు నచ్చిన ఎమోజీని క్రియేట్ చేసిన అనంతరం.. కాపీ ఆప్షన్ ద్వారా వినియోగించుకోవచ్చు. కాకపోతే, ఎమోజీ రూపంలో కాకుండా పీఎన్‌జీ ఫైల్ రూపంలో మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది.
Create Emoji in Simple Steps : గూగుల్‌లో ఎమోజీలను క్రియేట్ చేయడం ఎలా?
- గూగుల్లోకి వెళ్లి సెర్చ్ ఎమోజీ కిచెన్ అని ఎంటర్ చేయాలి.
- మీకు 'Get cooking' అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు కొన్ని ఎమోజీలు దర్శనమిస్తాయి.
- మొదట మీకు కావలసిన ఎమోజీని ఎంచుకోవాలి.
- తరువాత రెండవ ఎమోజీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి.
- వెంటనే రెండూ కలిపిన ఎమోజీ రిజల్ట్ కుడివైపు వస్తుంది.
- వచ్చిన ఎమోజీని కాపీ చేసుకుని వినియోగించుకోవచ్చు.
ఈ గూగుల్ ఎమోజీ కిచెన్ ఉపయోగించి ఎలాంటి ఎమోజీ అయిన యూజర్ తయారు చేసుకోవచ్చు. వీటితో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కొత్త ఎమోజీలను తయారుచేసి మీ స్నేహితులకు పంపవచ్చు. ఈ గూగుల్ ఎమోజీలను ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో మాత్రమే కాదు.. డెస్క్‌టాప్‌లో, ఐఫోన్ల్లో కూడా వినియోగించుకోవచ్చు.