వివిధ పదార్థాల్ని కట్ చేయడానికి ఉపయోగించిన కత్తుల్ని ఊరికే అలా పైపైన నీటితో కడిగేస్తుంటారు చాలామంది! కానీ దీనివల్ల ఆయా పదార్థాల అవశేషాలు పూర్తిగా తొలగిపోక.. క్రమంగా దానిపై తుప్పు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు.. వాటిపై బ్యాక్టీరియా పెరిగిపోయి.. అది ఇతర పదార్థాలకూ వ్యాపించే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయనంలో కూడా తేలింది. అందుకే ఉపయోగించిన ప్రతిసారీ కత్తుల్ని డిష్‌వాష్ సోప్‌తో శుభ్రం చేసి, పొడిగా తుడిచి, విడిగా భద్రపరచాలి.
ఈ మధ్య డిష్‌వాషర్ల వాడకం పెరిగిపోయింది.. అయితే ఈ క్రమంలో కొంతమంది కత్తుల్ని కూడా ఇందులోనే వేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల ఆ మెషీన్ ఉత్పత్తి చేసే వేడి, ఒత్తిడి కారణంగా కత్తులు పదును కోల్పోవడంతో పాటు డ్యామేజ్ కూడా కావచ్చు. అందుకే వాటిని చేత్తోనే శుభ్రం చేయడం మంచిది.
కత్తులు బాగా శుభ్రపడతాయన్న ఉద్దేశంతో కొందరు బ్లీచ్, నిమ్మకాయతో రుద్దుతుంటారు. తద్వారా అవి శుభ్రపడడం మాట అటుంచితే ఈ పదార్థాలు కత్తుల్ని త్వరగా తుప్పు పట్టేలా చేస్తాయట!
అలాగే ఈ క్రమంలో స్క్రబ్బర్‌ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ గరుకుదనం వల్ల కత్తుల బ్లేడ్స్ పదును కోల్పోయే అవకాశాలున్నాయి. అంతేకాదు.. కత్తుల్ని శుభ్రం చేసే క్రమంలో చేతులు, వేళ్లకు గాయాలు కాకుండా ఉండాలంటే ‘కట్ రెసిస్టంట్ కిచెన్ గ్లోవ్స్’ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి.
రోజువారీ హడావిడిలో కత్తుల్ని గిన్నెల మధ్యలో, ఏదో ఒక పాత్రలోనో పడేసే వారూ లేకపోలేదు. అయితే అలా చేస్తే దానికుండే పదునైన ఎడ్జ్ వల్ల ఇతర పాత్రలపై గీతలు పడడంతో పాటు కత్తుల షార్ప్‌నెస్ కూడా తగ్గుతుందట! అందుకే కిచెన్ కత్తుల్ని ప్రత్యేకమైన స్టాండ్‌లో మాత్రమే భద్రపరచాలి.
కిచెన్ కత్తుల్ని ఎప్పటికప్పుడు పదునెక్కించడం కూడా మర్చిపోవద్దు. ఇందుకోసం మార్కెట్లో విభిన్న రకాల నైఫ్ షార్ప్‌నర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు నచ్చింది ఇంటికి తెచ్చుకుంటే బయటికి వెళ్లే అవసరం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కత్తుల్ని సానపెట్టుకోవచ్చు.
కాయగూరలు, పండ్లు.. వంటివి కట్ చేసే క్రమంలో చాలామంది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటికి బదులుగా చెక్కతో చేసిన చాపింగ్ బోర్డుల్ని వాడితే ఇటు ఆరోగ్యానికీ నష్టం జరగదు.. అటు కత్తి పదును కోల్పోకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. ఎందుకంటే చెక్క కంటే ప్లాస్టిక్ మరింత గట్టి ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కత్తి పదును తగ్గే అవకాశాలు ఎక్కువ.
కత్తుల్ని నీటిలో ఎక్కువ సేపు ఉంచినా తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి కడిగిన వెంటనే పొడి క్లాత్‌తో తుడిచి నైఫ్ స్టాండ్‌లో అమర్చాలి. అలాగే అప్పుడప్పుడూ కాస్త వంట నూనెను కత్తి బ్లేడ్స్‌పై పూస్తే అవి తుప్పు పట్టకుండా జాగ్రత్తపడచ్చు.
మాంసం కట్ చేయడానికి చెక్కతో చేసిన చాపింగ్ బోర్డులు ఉపయోగించడం వల్ల వాటిని శుభ్రపరచడం సులువవుతుంది.. అలాగే హానికారక బాక్టీరియా కూడా ఇతర పదార్థాలకు విస్తరించకుండా జాగ్రత్తపడచ్చు.