Mobile Tracking Without GPS : స్మార్ట్ ఫోన్ రాకతో చాలా వస్తువులకు కాలం చెల్లిపోయింది. రేడియో, కెమెరా దగ్గర్నుంచి గడియారం, క్యాలెండర్ వరకు ఇలా ఎన్నో వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఫోన్లో ఎన్నో సదుపాయలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో అన్నింటికీ ఫోనే దిక్కయింది. అయితే మనం వాడే ఇన్‌బిల్ట్ యాప్ మొదలుకుని వెలుపలి యాప్స్ వరకు అన్నీ లొకేషన్ యాక్సెస్ అడిగేవే. అయితే ప్రతి స్మార్ట్ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా లొకేషన్ సర్వీసు ఆప్షన్ ఆన్‌లో ఉంటుంది. అడ్రస్, ఎక్కడున్నామో, ఎక్కడికెళ్లాలో తెలుసుకోవడం కోసం ఈ సర్వీసును వాడుతుంటాం. కొంతమంది యూజర్స్ కొన్ని కారణాల చేత దాన్ని డిసేబుల్ చేస్తుంటారు. కానీ అది ఆఫ్మోడ్లో ఉన్నా కూడా మనం ఎక్కుడన్నామో ఇతరులు తెలుసుకునే అవకాశముంది. ఇతర టెక్నాలజీ, పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. అదేలాగంటే?
1. సెల్ క్యారియర్ టవర్లు
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సెల్ టవర్లున్నాయి. మీ లొకేషన్ ఆఫ్‌లో ఉన్నా.. ఫోన్ సిగ్నళ్ల ద్వారా మీరెక్కడున్నారో ఇట్టే కనిపెట్టవచ్చు. మీ ఫోన్ సిగ్నల్ ప్రాంతం, రేంజ్‌ను బట్టి కచ్చితమైన లొకేషన్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ఎప్పుడూ దగ్గర్లోని సెల్ టవర్స్‌కు కనెక్ట్ అయ్యే ఉంటుంది.
2. పబ్లిక్ వైఫై నెట్ వర్క్
బస్, రైల్వే, మెట్రో ఇలా అన్ని స్టేషన్లలో ప్రస్తుతం ఫ్రీ వైఫై నెట్ వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ ఉచితంగా వాడుకోవచ్చనే ఉద్దేశంతో వీటికి కనెక్ట్ అవుతారు. కానీ మీ లొకేషన్ ఆఫ్‌లో ఉన్నా.. వీటి ద్వారా మీరెక్కడున్నారో తెలుసుకోవచ్చు. అనేక ఫ్రీ వైఫై ప్రొవైడర్లు కనెక్షన్ కోసం మీ డివైజ్ మీడియా ఆక్సెస్ కంట్రోల్ (ఎంఏసీ) చిరునామా సేకరిస్తారు. దీని వల్ల మీరు కనెక్ట్ అయినప్పుడు సందర్శించే ప్రదేశాల వివరాలు తెలుస్తాయి.
3. స్టింగ్ రేస్
వీటిని సెల్ సైట్ సిమ్యులేటర్స్ అని కూడా అంటారు. ఈ పరికరంతో దగ్గర్లోని డివైజ్‌ల లొకేషన్ సులభంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎక్కువగా ఒక ప్రదేశంలోని డివైజ్‌ను పట్టుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఉపయోగిస్తారు. దీని సిగ్నళ్లు సెల్‌ఫోన్ సిగ్నళ్ల కంటే సమర్థంగా పనిచేస్తాయి. ఎంతలా అంటే దీన్ని ఆన్ చేసిన ప్రదేశంలో అక్కడున్న డివైజ్‌ల టవర్ల సిగ్నళ్లు డిస్ కనెక్ట్ అయి.. స్టింగ్ రేస్‌కు కనెక్ట్ అయ్యేంత.
4.బ్లూటూత్ ట్రాకింగ్
బ్లూటూత్ ట్రాకింగ్ వల్ల కూడా మనం ఉన్న లొకేషన్ తెలుసుకోవచ్చు. ఫోన్లోని మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రెస్‌ను గుర్తించి రికార్డు చేయడం వల్ల బ్లూటూత్ ట్రాకింగ్ పనిచేస్తుంది. కొంతమంది తమ స్టోర్లలో, పబ్లిక్ ప్లేసుల్లో బ్లూటూత్ బీకాన్స్ పెట్టి తమ కస్టమర్ల ప్రవర్తనకు అనుగుణంగా యాడ్స్ పంపిస్తారు. ఈ బీకాన్లు దాని సమీపంలో బ్లూటూత్ ఆన్‌లో ఉన్న పరికరాల్ని గుర్తించగలవు మన స్మార్ట్ ఫోన్లు సహా. తద్వారా ఆ ప్రాంతంలోని డివైజ్ కదలికలకు అనుగుణంగా డేటాను సేకరించగలవు.
5.స్పైవేర్ అండ్ మాల్వేర్
మీ జీపీఎస్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ.. ఫోన్లో అప్పటికే ఏదైనా మాల్వేర్ ఉంటే దాని ద్వారా లొకేషన్ కనుక్కోవచ్చు. ఒక ప్రోగ్రామ్ రూపంలో ఏదైనా మాల్వేర్ను మన ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి డేటా ఆక్సెస్ చేస్తుంది. మన వ్యక్తిగత గోప్యత, భద్రతా కారణాల రీత్యా మన ఫోన్ ఇతరులు ట్రాక్ చేయకుండా కాపాడుకోవడం అవసరం. మరి మన డివైజ్‌ను ట్రాక్ చేయకుండా ఉండాలంటే ఈ విధంగా చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పబ్లిక్ ప్లేస్‌లలో వైఫై వాడకండి
ఉచితంగా వస్తుందని పబ్లిక్ ప్లేసుల్లోని వైఫై కనెక్ట్ చేసి ఇంటర్నెట్ వాడకండి. కొన్ని సార్లు మన వైఫై సెట్టింగ్స్‌లో ఉన్న విధానం వల్లా ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ముందు ఆ సెట్టింగ్స్‌ని మార్చుకోండి. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో వైఫై కనెక్షన్ ఆఫ్ చేయండి.
2. జీపీఎస్ టర్న్ ఆఫ్ చేయండి
అవసరం లేకపోయినా కొందరు జీపీఎస్‌ను ఎప్పటికీ ఆన్‌లో ఉంచుతారు. కానీ ఇది మంచిది కాదు. అవసరమున్నప్పుడు మాత్రమే ఆన్ చేసి మిగతా సమయాల్లో ఆపేయండి. లొకేషన్ సర్వీసులు ఆఫ్ చేయడం వల్ల సాధారణంగా లొకేషన్ ట్రాకర్ల నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశముంటుంది.
3. వీపీఎన్ ఉపయోగించి ఇంటర్నెట్ వాడండి
ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు Virtual Private Network (VPN) ని ఉపయోగించడం వల్ల అది మన ఆన్ లైన్ ఆక్టివిటీ, డేటాను ఎన్ క్రిప్ట్ చేస్తుంది. మన లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి వివరాలు ఇతరులు కనుక్కోలేరు. ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు వీపీఎన్ మీకొక ప్రైవేట్ నెట్ వర్క్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ఇతరులు, సైట్ నిర్వాహకులు మీ డేటాను సేకరించలేరు.
4. అవసరం లేనప్పుడు బ్లూటూత్ ఆఫ్ చేయండి
నిర్ణీత ప్రదేశంలో వైర్ లెస్ కమ్యూనికేషన్ కోసం బ్లూటూత్ బెస్ట్ ఆప్షన్. కానీ దీని ద్వారా కూడా ఫోన్ లొకేషన్ కనుక్కోవచ్చు. వివిధ డివైజ్ లు కనెక్ట్ చేయడానికి కొన్ని ఎయిర్ ట్యాగ్లు బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. కాబట్టి బ్లూటూత్ ట్రాకింగ్ నిరోధించడానికి.. అది అవసరం లేని సమయాల్లో ఆఫ్ చేయాలి.
5. సోషల్ మీడియాలో లొకేషన్ షేర్ చేయకండి
కొత్త ప్రదేశానికి వెళ్లినా, ఇన్ స్టాలో ఫొటో అప్లోడ్ చేసినా లొకేషన్ ట్యాగ్ చేయడం ప్రస్తుతం పరిపాటి అయింది. దీని ద్వారా మీరెక్కడున్నారో కచ్చితంగా తెలియకపోయినా.. ఫలానా ప్రాంతంలో ఉన్నారని క్లూ మాత్రం లభిస్తుంది.
6. థర్డ్ పార్టీల నుంచి యాప్స్ డౌన్లోడ్ ఆపండి
ప్లేస్టోర్ వంటి నమ్మదగిన వాటి నుంచే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇతర పార్టీల నుంచి చేసుకోవడం వల్ల మాల్వేర్ వచ్చే ప్రమాదముంది.
7. యాప్ అనుమతులు పరిశీలించుకోండి
యాప్స్ పనిచేయడానికి నిర్దిష్ట అనుమతులు అవసరం. కానీ కొన్ని యాప్‌లు అవసరం లేకున్నా వాటిని అడుగుతాయి. అలాంటి వాటికి అనుమతులివ్వడం కూడా ప్రమాదకరమే. అవసరం లేని వాటికి అనుమతులు రద్దు చేయండి.
8. సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయండి
సాఫ్ట్ వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మన ఫోన్‌ను భద్రంగా ఉంచుకోవచ్చు. ఇందులో వచ్చే సెక్యూరిటీ ప్యాచ్‌లు ఎప్పటికప్పుడు బగ్‌లకు పరిష్కారం చూపిస్తాయి.
అయితే.. పైన చెప్పిన వన్నీ.. మీ ఫోన్‌ని ట్రాక్ చేయకుండా కాపాడతాయని గ్యారెంటీ కాదు. మీ సర్వీస్ ప్రొవైడర్ ఫోన్ ట్రాక్ చేయవచ్చు. ఎందుకంటే.. మొబైల్ సక్రమంగా పనిచేయడానికి, కమ్యూనికేషన్ కోసం దగ్గర్లోని సెల్ టవర్లను వినియోగించుకుంటుంది. అందువల్ల మనం ఏ ప్రాంతంలో ఉన్నామో సిగ్నళ్ల ఆధారంగా వారు కనుక్కోవచ్చు. అయినప్పటికీ మన ఫోన్ ట్రాక్ చేయకుండా కాపాడుకునే ఏకైక మార్గం.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి బ్యాటరీ తీసేయడం మాత్రమే. ఇలాంటప్పుడు ఎవరైనా ట్రాక్ చేయాలని చూసినా.. స్విచ్ ఆఫ్ చేయకముందు సిగ్నల్ లొకేషన్ మాత్రమే చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.