Google Will Delete Gmail Accounts : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. తన యూజర్లలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వినియోగంలో లేని జీ-మెయిల్ అకౌంట్లను డిసెంబర్‌లోగా తొలగిస్తామని ప్రకటించింది. అయితే మీ అకౌంట్ డిలీట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలు మీ కోసం.
'వ్యక్తిగత గూగుల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది'
గూగుల్ ఈ ఏడాది మే నెలలో ఖాతాల విషయంలో ఇన్ యాక్టివ్ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. జీ-మెయిల్ ఖాతాను కనీసం రెండు సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే వాటిని తొలగిస్తామని గూగుల్ మరోసారి హెచ్చరించింది. దాని ప్రకారం 2023 డిసెంబర్ నాటికి ఇన్ యాక్టివ్ అకౌంట్లను తొలగిస్తామని ఆ సంస్థ తెలిపింది. ఇన్‌యాక్టివ్ జీ-మెయిల్ అకౌంట్లు తొలగించే ప్రక్రియలో భాగంగా ఆయా ఖాతాలకు సంబంధించిన జీ-మెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, గూగుల్ ఫోటోలు కూడా డిలీట్ అయ్యే వాటిలో ఉన్నాయి. అయితే ఈ విధానం వ్యక్తిగత గూగుల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఇది సంస్థల ఖాతాలపై ప్రభావం చూపబోదని గూగుల్ స్పష్టం చేసింది. యాక్టివ్‌గా ఉన్న ఖాతాలకు ఎటువంటి ముప్పు లేదని ప్రకటించింది.
ఎందువల్ల జీ-మెయిల్ ఖాతాలను తొలగిస్తోందంటే
జీ-మెయిల్ అకౌంట్ల భద్రతను మెరుగుపర్చేందుకు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను తొలగించాలని ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భావిస్తోంది. ఇన్ యాక్టివ్ ఖాతాల్లో టు ఫాక్టర్ అథెంటికేషన్ సెటప్ ఉండదని, అందువల్ల హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని కంపెనీ చెబుతోంది. అందువల్ల ఇన్ యాక్టివ్‌గా ఉన్న జీ-మెయిల్ ఖాతాలను తొలగించడం వల్ల ఈ తరహా దాడుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని గూగుల్ తెలిపింది.
దశల వారీగా..
ఇన్‌యాక్టివ్ ఉన్న జీ-మెయిల్ అకౌంట్ల తొలగింపు విషయంలో గూగుల్ సంస్థ దశల వారీ విధానాన్ని అనుసరిస్తుంది. అలాంటి వారి జీ-మెయిల్ ఖాతాలకు ఇప్పటికే పలుమార్లు తొలగింపు సందేశాలను పంపించామని ఆ సంస్థ పేర్కొంది. ఉపయోగించని జీ-మెయిల్ ఖాతా విషయంలో దాని రికవరీ అకౌంట్ ఇస్తే వాటికి తొలగింపు సందేశాలు పంపించింది.
జీ-మెయిల్ అకౌంట్ డిలీట్ కావొద్దంటే ఏం చేయాలంటే?
ఇనాక్టివ్‌గా ఉన్న మీ జీమెయిల్ ఖాతాను డిలీట్ కావొద్దనుకుంటే ఈ సూచనలు పాటించండి.
- మీరు ఉపయోగించకుండా ఉన్న జీ-మెయిల్ ఖాతాను యాక్టివేట్ చేయండి.
- టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను సెట్ చేయండి.
- ఆ అకౌంట్ నుంచి మీకు తెలిసిన వారికి మెయిల్ చేస్తుండండి
- గూగుల్ డ్రైవ్‌ను తరచుగా ఉపయోగించండి.
- గూగుల్ సెర్చ్ ఆప్షన్‌ను వాడండి
మీరు రెండు సంవత్సరాల పాటు మీ జీమెయిల్ అకౌంట్‌ను వాడనప్పటికీ మీరు ఇప్పటికే సబ్స్క్రిప్షన్ సెటప్ చేసి ఉండే మీ ఖాతాను గూగుల్ తొలగించదు.