Google street view India: భారత్‌లో స్ట్రీట్ వ్యూ సేవలను గూగుల్ మళ్లీ ప్రారంభించింది. దేశీయ టెక్ సంస్థలైన టెక్ మహీంద్రా, జెనిసిస్‌తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా తొలుత 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు గూగుల్ తెలిపింది. ఈ మేరకు దిల్లీలో బుధవారం గూగుల్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
తొలి దశలో హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, దిల్లీ, పుణె, నాసిక్, వడోదరా, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఆయా నగరాల్లో లక్షన్నర కిలోమీటర్లు స్ట్రీట్ వ్యూలో కవర్ అయినట్లు గూగుల్ పేర్కొంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఓ వీధిని 360 డిగ్రీల్లో పనోరమా షాట్స్‌లో వీక్షించొచ్చు. కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లో గానీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి 10 నగరాల్లోని స్ట్రీట్ వ్యూలను చూడొచ్చు.
గూగుల్ 15 ఏళ్ల క్రితమే స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించగా.. 2011లో తొలిసారి భారత్‌కు తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అడ్డు చెప్పింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలతో జట్టు కట్టి తాజాగా గూగుల్ వీటిని తీసుకొచ్చింది.
స్ట్రీట్ వ్యూతో పాటు ప్రమాదాలను అరికట్టేందుకు మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్ ఆప్షన్ సైతం గూగుల్ తీసుకొచ్చింది. బెంగళూరు, చండీగఢ్‌లో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. స్థానిక ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా తాము ప్రయాణిస్తున్న రహదారిపై గరిష్ఠంగా ఎంత వేగం వెళ్లొచ్చో గూగుల్ మ్యాప్ సూచిస్తుంది. దీంతో పాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి గాలి నాణ్యతను తెలుసుకునే సదుపాయం సైతం తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీనిద్వారా యూజర్ కోరుకున్న చోట ఎయిర్ క్వాలిటీని చెక్ చేయొచ్చు. త్వరలోనే పలు నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు గూగుల్ తెలిపింది.