కొన్నేళ్లుగా ఆన్‌లైన్ సమాచార శోధనలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా గూగుల్‌కు చాట్‌జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీతో కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ సైతం తన అస్త్రశస్త్రాలతో సన్నాహాలు చేసుకుంటోంది. బార్డ్ పేరిట కృత్రిమ ఆధారిత చాట్‌బోట్‌ను సిద్ధం చేస్తోంది.
అంతరిక్ష ఆవిష్కరణలు సైతం..
ప్రస్తుతం బార్డ్‌ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ఓ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్ అందించగలుగుతుందని గూగుల్ తెలిపింది. 'సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్ ఓ వేదికగా మారుతుంది' అని సుందర్ పిచాయ్ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అప్రమత్తమైన గూగుల్..
చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్‌ఏఐకి అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. బార్డ్‌కు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్‌జీపీటీకి పోటీనిచ్చేలా బార్డ్ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించింది. అట్లాస్ ప్రాజెక్టు పేరిట గూగుల్ ఈ బార్డ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
LaMDA ఆధారంగా..
బార్డ్ అనేది చాట్‌జీపీటీ తరహాలోనే కృత్రిమ మేధ ఆధారిత ప్రయోగాత్మక సంభాషణా సేవ. దీన్ని 'లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్(LaMDA)' ఆధారంగా రూపొందించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు అంతర్జాలం నుంచి తాజా, నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది.
చాట్‌జీపీటీ, బార్డ్ మధ్య తేడా..
చాట్‌జీపీటీని విజయవంతం చేయడానికి ఓపెన్‌ఏఐలోకి మైక్రోసాఫ్ట్ దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. దీన్ని బింగ్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానించే పనిలో ఉంది. దీనికి పోటీగానే బార్డ్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం 2021 వరకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే చాట్‌జీపీటీ సమాధానాలిస్తోంది. కానీ, బార్డ్ మాత్రం ఆన్‌లైన్‌లో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించుకుంటోంది. ఇది బార్డ్‌కు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం చాట్‌జీపీటీ అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంది. చాట్‌జీపీటీ ప్లస్ పేరిట పెయిడ్ వెర్షన్ కూడా అందిస్తున్నారు. బార్డ్ మాత్రం ఇంకా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. అందరూ దీన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా కొంత సమయం పట్టొచ్చు.
కీలక ఒప్పందం..
మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌ను కృతిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసేలా మార్చడంపై దృష్టిసారించింది. అందుకు ఓపెన్‌ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ నిర్వహిస్తున్న చాట్‌జీపీటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ .. ఓపెన్ఏఐతో 10 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదర్చుకుందని ద వెర్జ్ కథనం ప్రకారం తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ చాట్‌బాట్‌పై మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. మైక్రోసాఫ్ట్ బింగ్‌తో పాటు, వర్డ్, పవర్‌పాయింట్, ఔట్‌లుక్‌కు చాట్‌జీపీటీ సాంకేతికతను జోడించాలని ప్రయత్నిస్తోంది.