Google Messages Features : గూగుల్ మెసేజెస్.. ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ప్రముఖ మెసేజింగ్ యాప్. అయితే మనం ఫోన్ కొనుగోలు చేసినప్పుడు వచ్చే సాధారణమైన ఇన్‌బాక్స్ యాప్, గూగుల్ మెసేజెస్ యాప్ రెండూ ఒక్కటే అని భావిస్తారు చాలా మంది. కానీ, సాధారణ ఇన్‌బాక్స్ యాప్ సాయంతో మనం పంపించే సందేశాల మాదిరిగానే గూగుల్ మెసేజస్ యాప్‌లోనూ సందేశాలు పంపవచ్చు. కానీ, కేవలం ఇలా మెసేజ్‌లు పంపిచండమే కాకుండా దాదాపు 11 రకాల పనులను మనం దీని సాయంతో చక్కబెట్టేయొచ్చు. మరి అవేంటో.. మీకు తెలియని ఫీచర్స్ గూగుల్ మెసేజింగ్ యాప్‌లో ఏం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మన ప్రమేయం లేకుండానే..
Schedule Messages Google Chat : గూగుల్ యాప్ ద్వారా మనం షెడ్యూల్డ్ మెసేజ్‌లను కూడా పంపొచ్చు. మన స్నేహితులకు గానీ ఇతరులకు పంపే సందేశాలను అప్పటికప్పుడే కాకుండా ఒక నిర్ణీత సమయానికి పంపాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. మనం పంపాల్సిన మెసేజ్‌ను ముందే టైప్ చేసి పెట్టుకుంటాం. ఇలా సిద్ధంగా ఉంచిన మెసేజ్‌కు మనం ఓ తేదీ, టైమ్‌ను కేటాయించవచ్చు. ఉదాహరణకు ఆగస్టు 8 అర్ధరాత్రి 2 గంటలకు ఒక వ్యక్తికి మన సందేశం డెలివరీ అయ్యే విధంగా డేట్, టైమ్‌ను సెట్ చేస్తే.. సరిగ్గా అదే సమయానికి ఆ సందేశం మన ప్రమేయం లేకుండానే ఆగస్టు 8న అతనికి చేరుతుంది.
హై-క్వాలిటీ వీడియోలనూ పంపొచ్చు..
Google Messages High Quality Video : సాధారణంగా ఎంఎంఎస్ ద్వారా కూడా మనం వీడియోలను ఇతరులకు పంపొచ్చు. కాకపోతే ఆ వీడియో వారికి చేరేసరికి దాని క్వాలిటీ పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాక తక్కువ నిడివి ఉన్న వీడియోలను మాత్రమే మామూలు మెసేజింగ్ యాప్ ద్వారా పంపొచ్చు. అయితే గూగుల్ మెసేజెస్‌లో ఇటువంటి పరిమితులు ఏమీ లేవు. చక్కటి నిడివి గల వీడియోలను హై-క్వాలిటీలో పంపించుకోవచ్చు. అయితే మీరు పంపిన వీడియో సందేశాన్ని అవతలి వ్యక్తి గూగల్ ఫొటోస్ లింక్ రూపంలో స్వీకరిస్తాడు. ఆ లింక్‌తో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు.
సందేశానికి సబ్జెక్ట్ లైన్ జోడించొచ్చు..
Google Messages Subject Line : మీరు మీ కొలీగ్‌కు ఓ అత్యవసరమైన సందేశాన్ని పంపాలని అనుకున్నప్పుడు ఈ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు. మీరు పంపే మెసేజ్‌కు ఉన్న ఆవశ్యకతను అవతలి వ్యక్తికి తెలియజేసేలా దానికి ఓ సబ్జెక్ట్ లైన్‌ను కూడా యాడ్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు పంపే సందేశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి చదవాలని యూజర్‌కు తెలియజెప్పేందుకు అర్జెంట్ అని కూడా మార్క్ చేయవచ్చు. మీ సందేశానికి సబ్జెక్ట్ లైన్‌ను జోడించినప్పుడు మీరు పంపే ఎస్ఎంఎస్ కాస్త ఎంఎంఎస్గా మారుతుంది. అయితే అన్ని మొబైల్ ఫోన్లు ఎంఎంఎస్ను సపోర్ట్ చేయవు. ఒకవేళ మీ ఫోన్లో ఈ సదుపాయం లేకపోతే ఈ ఫీచర్‌ను మీరు వినియోగించలేరు.
ఫ్లోటింగ్ చాట్ బబుల్స్‌తో మరింత ఈజీగా..
Floating Chat Bubbles Google Messages Android : మీరు ఏదైనా పనిలో లీనమయినప్పుడు. మీ మొబైల్‌కు వచ్చే అతిముఖ్యమైన సందేశాలను చూడలేకపోతారు. అలాంటప్పుడు మీరు ఫ్లోటింగ్ చాట్ బబుల్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనితో మీరు మీ ఫోన్‌ను పక్కన పెట్టుకొని పనిచేసేటప్పుడు ఏదైనా సందేశం వస్తే దాన్ని మీరు సులువుగా గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు మెసేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బబుల్స్ అండ్ టాగుల్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండి. కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్ పేరుతో ఈ ఫీచర్‌ను గమనించవచ్చు.
కంప్యూటర్లోనూ గూగుల్ మెసేజ్
Google Messages On Desktop : గూగుల్ మెసేజెస్ స్పెషాల్టీ ఏంటంటే.. దీనిని మన డెస్క్‌టాప్ కంప్యూటర్లోనూ సులభంగా ఇన్స్టాల్ చేసుకుని వాడొచ్చు. ఇందుకోసం యాప్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ తప్పనిసరి. అలా సెట్ చేసుకున్న తర్వాత మీ పీసీలోనే మీరు సందేశాలను చూడొచ్చు, చదవచ్చు. దీనితో మెసేజెస్ కోసం తరచుగా ఫోన్ చూడాల్సిన పని కూడా తగ్గుతుంది.
టెక్ట్స్ సైజ్‌ను పెంచుకోవచ్చు..
Change Font Size In Google Messages : గూగుల్ మెసేజెస్ ద్వారా మనం పంపే సందేశాల్లోని టెక్ట్స్ పరిమాణాన్ని ఎక్కువ, తక్కువ చేసుకొని చదివే వీలు మనకు ఈ యాప్‌లో ఉంటుంది. అంటే అక్షరాల సైజ్‌ను చిన్నగా, పెద్దగా కూడా చేయొచ్చు. ఇందుకోసం జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్‌ను వాడొచ్చు.
24 గంటల తర్వాత ఓటీపీలు డిలీట్..
Auto Delete OTPs After 24 Hours : మనకి వచ్చే వివిధ రకాల ఓటీపీలు 24 గంటల్లో డిలీట్ అయ్యేలా సెటింగ్స్ చేసుకునే, ఆటో డిలీట్ ఓటీపీస్ ఆప్షన్ మనకు గూగుల్ మెసేజింగ్ యాప్‌లో ఉంటుంది. దీనితో కొన్ని నెలలుగా మన మొబైల్లో నిండిపోయిన జంక్ ఓటీపీలు డిలీట్ అవుతాయి. ఫోన్లో స్టోరేజ్ కూడా మిగులుతుంది.
బర్త్‌డే రిమైండర్లు ఇస్తుంది..
Birthday Reminder Message Text : స్నేహితులు, బంధువులకు సంబంధించి పుట్టినరోజు తేదీలను గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టం. అటువంటి సమయాల్లో బర్త్‌డే రిమైండర్ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది. మీ ప్రియమైన వారి బర్త్‌డే ఏ రోజు ఉందో గూగుల్ మెసేజస్‌లోని ఈ ఫీచర్ మీకు గుర్తుచేస్తుంది. దీనితో మీరు గుర్తు పెట్టుకొని మరీ మీ స్నేహితులకు బర్త్‌డే విషెస్ చెప్పొచ్చు. దీనిని ఎనేబుల్ చేయడానికి మెసేజ్ సెట్టింగ్స్> సజెషన్స్> నడ్జస్ను క్లిక్ చేయండి. చివరగా బర్త్‌డే రిమైండర్స్పై టాగుల్ చేయండి.
ఐఫోన్ ఎమోజీలు ఆండ్రాయిడ్‌లో..
Use Emojis In Google Messages : సాధారణంగా ఐఫోన్ ద్వారా పంపే ఎమోజీలను ఆండ్రాయిడ్ మొబైల్స్ సపోర్ట్ చేయవు. దీనితో ఐఫోన్ యూజర్ మీకు లవ్ సింబల్‌తో కూడిన ఎమోజీని పంపిస్తే అది మీ ఫోన్లో అవతలి వ్యక్తి మీ సందేశాన్ని ప్రేమించాడు అనే టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ గూగుల్ మెసేజెస్ యాప్ సెట్టింగ్స్ద్వారా ఐఫోన్ యూజర్ పంపిన ఎమోజీలన్నీ ఎటువంటి మార్పులు లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో చూడొచ్చు.
కావాల్సిన సందేశాలను ఫిల్టర్ చేయవచ్చు..
Search Messages In Google Messages : మన ఫోన్‌కు కొన్ని సందేశాలు టెక్ట్స్ రూపంలో వస్తాయి. మరికొన్ని డాక్యుమెంట్స్ రూపంలో వస్తాయి. ఇంకొన్ని లింక్స్ రూపంలో వస్తాయి. ఇలా అన్ని మన మొబైల్లో ఉన్నప్పటికీ మనకి ఉపయోగపడే సందేశం మనకి కావాల్సినప్పుడు దొరకడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో కేటగిరీల వారిగా ఫిల్టర్ చేసుకొని మనకి కావాల్సిన సందేశాన్ని రాబట్టవచ్చు..
సందేశాలను తాత్కాలికంగా ఆపవచ్చు..
Snooze Messages In Google Chat : మీరు ఏదైనా మీటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు మీ మొబైల్‌కు వచ్చే సందేశాలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటాయి. అలాంటి సమయాల్లో తాత్కాలికంగా మెసేజెస్ రాకుండా స్నూజ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ సమయానికి ఖాళీగా ఉంటారో ఆ తేదీ, టైమ్‌ను కూడా ఫిక్స్ చేయవచ్చు. దీనితో మీరు ఫ్రీ అయ్యాక మీరు మిస్ అయిన సందేశాలను చూసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి సంబంధిత ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.