డ్రైవరు లేకుండా ప్రయాణించే అటానమస్ కార్ల గురించి విన్నాం. ఇప్పుడిక భవనాల వంతు వచ్చింది. కదలకుండా ఉండే భవనాలకి అటానమస్ పరిజ్ఞానం ఎందుకూ అంటే- లైట్లకీ ఫ్యాన్లకీ ఏసీలకీ హీటర్లకీ.. ఇలా ఎన్నో పరికరాలకు మనం కరెంటు వాడతాం. ఆ వాడకంలోనూ 40 శాతం వృథా అవుతోందట. పైగా తయారీ నుంచీ వినియోగం వరకూ విద్యుచ్ఛక్తి బోలెడు కర్బన ఉద్గారాలకు కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి రూపొందించిన బ్రెయిన్‌బాక్స్‌ని భవనానికి అనుసంధానిస్తే అది ఇంటర్నెట్‌నుంచి వాతావరణ సూచనలకు సంబంధించిన డేటాని తీసుకుంటుంది. దాన్ని బట్టి ఉష్ణోగ్రతలను అంచనా వేసి తదనుగుణంగా భవనంలో విద్యుత్ వాడకాన్ని నియంత్రిస్తుంది. పలు భవనాల్లో ఇప్పటికే బ్రెయిన్‌బాక్స్‌ని వాడటం వల్ల ఇంధన వాడకంతోపాటు కర్బన ఉద్గారాల విడుదల 40 శాతందాకా తగ్గుతోందట.
గ్రీన్ బిల్డింగ్ పరిజ్ఞానంలో సరికొత్త విప్లవంగా పేర్కొంటున్న ఈ విధానం- మొదట భవనం పరిసరాల్నీ, చుట్టూ ఉన్న వాతావరణాన్నీ, లోపల జరుగుతున్న వినియోగాన్నీ అర్థంచేసు కుంటుంది. దాన్నిబట్టి భవనానికి సంబంధించిన ఎనర్జీ ప్రొఫైల్‌ని తయారుచేసుకుని, రియల్‌టైమ్‌లో పనిచేసే 25 ఆల్గారిథమ్స్ ఆధారంగా భవనానికి చెందిన హెచ్‌వీఏసీ(హీటింగ్, వెంటిలేషన్, ఏసీ) వ్యవస్థని క్రమబద్ధం చేస్తుంది. ఎక్కడా మనుషుల ప్రమేయం ఉండదు.
- ఇదీ చూడండి : వచ్చే ఐదేళ్లలో.. ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్.!