కృత్రిమ మేధతో పనిచేసే వర్చువల్ అసిస్టెంట్లలో ఛాట్‌జీపీటీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టటానికి సిద్ధమైంది. అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవలే దీన్ని ఆవిష్కరించింది. మనం ఇచ్చే సమాచారం నుంచి నేర్చుకునే రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇది జెనరేటివ్ ప్రి-ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్ (జీపీటీ) సాయంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇప్పటికే 10లక్షల మందికి పైగా దీన్ని పరీక్షించారు. మనుషులు మాట్లాడుకుంటున్నట్టుగానే వ్యాఖ్యలకు, విజ్ఞప్తులకు స్పందించటం దీని ప్రత్యేకత. ఎదురు ప్రశ్నలు సంధిస్తూ చర్చను కొనసాగిస్తుంది కూడా. అందుకే మున్ముందు ఇది బోధన, పాత్రికేయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఓపెన్‌ఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి దీంతో ఎవరైనా ఫీడ్‌బ్యాక్‌ను సేకరించొచ్చు.
అద్భుత నైపుణ్యాలు
ఛాట్‌జీపీటీకి చాలా నైపుణ్యాలే ఉన్నాయి. వీటిల్లో ఒకటి అనుచిత విజ్ఞప్తులను తిరస్కరించటం. ఉదాహరణకు- ఎవరినైనా వేధించటమెలా? అని అడిగారనుకోండి. ఇతరులను వేధించటం సమంజసం కాదని సమాధానమిస్తుంది. అంతేకాదు.. 'వేధించటం చాలా తీవ్ర సమస్య. వేధింపులకు గురయ్యేవారికే కాదు.. వేధించే వారికీ తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎవరినైనా వేధించటం కన్నా దయతో, గౌరవంతో చూడటం మంచిది' అని హితవు చెబుతుంది కూడా. ఛాట్‌జీపీటీ మరో ప్రత్యేకత. ఏదైనా ప్రశ్నలో తప్పుడు వివరణ ఉన్నా గుర్తించటం. ఉదాహరణకు- 'వాస్కోడిగామా ఇండియాకు 2010లో ఎప్పుడు వచ్చారు?' అని ప్రశ్నించారనుకోండి. 'వాస్కోడిగామా 1524లో మరణించారు. కాబట్టి ఆయన 2010లో ఇండియాకు వచ్చే అవకాశమే లేదు' అని చెప్పేస్తుంది. ఇలాంటి సందేహాలను ఊహాత్మక ప్రశ్నలుగా భావిస్తుండటం, వీటిల్లోని తప్పుల గురించి చర్చిస్తుండటం విశేషం.
పరిమితులు లేకపోలేదు
ప్రయోగాత్మక పరీక్షల్లో బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ దీనికి కొన్ని పరిమితులు లేకపోలేదు. కొన్నిసార్లు ఇది రాసే అంశాలు యుక్తమైనవిగా తోచినప్పటికీ తప్పుడు సమాధానాలు, అవసరంలేని జవాబులూ ఇవ్వచ్చు. ఇలాంటి ప్రతిస్పందనలను సరి చేయటం నిజంగా కష్టమేనని ఓపెన్‌ఏఐ చెబుతోంది. ఆయా వాస్తవాలను నిర్ధరించటానికి మూల వనరులు లేకపోవటం పెద్ద సమస్యగా నిలుస్తోంది. కొన్ని పదబంధాలను తరచూ వాడుతుండటమూ కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో సమాధానాలు పెద్దగా ఉంటాయి కూడా. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం కన్నా అడిగేవారు ఏం కోరుకుంటున్నారో అనేది ఊహించటం మరో సమస్య. కొన్నిసార్లు హానికారక సూచనలకు లేదా వివక్షతో కూడిన ప్రవర్తనకూ స్పందించొచ్చు. నిజానికి మనిషి లాంటి ఛాట్‌బోట్లను రూపొందించటానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. కానీ సఫలం కాలేకపోయాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ 2016లో టే బోట్‌ను రూపొందించింది. యూజర్లు దీనికి జాతి వివక్షకు అనుగుణంగా ఉండటాన్ని నేర్పించారు. ఫలితంగా ఎదురుదెబ్బ తగిలింది.
ఛాట్‌బోట్లు ఎలా పనిచేస్తాయి?
ఛాట్‌బోట్ పరిజ్ఞానంలో అత్యంత కీలకమైంది నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) ప్రక్రియ. గూగుల్ నౌ, యాపిల్ సిరి, మైక్రోసాఫ్ట్ కోర్టానా వంటి వర్చువల్ అసిస్టెంట్లలోని వాయిస్ రికగ్నిషన్ వ్యవస్థలకు ఆధారమైన పరిజ్ఞానం కూడా ఇదే. ఛాట్‌బోట్లు ముందుగా మనం అందించే టెక్స్ట్ సమాచారాన్ని స్వీకరిస్తాయి. సంక్లిష్టమైన ఆల్గోరిథమ్‌లతో విశ్లేషించుకొని, మనం అడిగినదేంటని గుర్తిస్తాయి. దీని ఆధారంగా తగిన సమాధానాన్ని ఇస్తాయి. కొన్ని ఛాట్‌బోట్లు అత్యంత నైపుణ్యంతో మనుషుల మాదిరిగానే చర్చిస్తాయి కూడా. తాజా ఛాట్‌జీపీటీ టూల్ మరో అడుగు ముందుకేసి విచక్షణతోనూ స్పందిస్తుండటం విశేషం.
ఏఐ బ్లాగర్లు వస్తారా?
అధునాతన భాషా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఛాట్‌బోట్లు బ్లాగులు కూడా రాస్తాయా? ఏదో ఒకనాడు ఇది సాధ్యమేనని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రయోగ పరీక్షల్లో ఛాట్‌జీపీటీ అనితర సాధ్యమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది మరి. ఉపాధ్యాయులు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను ఛాట్‌జీపీటీకి సంధించగా అది పూర్తి మార్కులు లభించేలా సమాధానాలు ఇవ్వటం గమనార్హం. అంతగా తెలియని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఎదురయ్యే కోడింగ్ సవాళ్లను పరిష్కరించటానికి ప్రోగ్రామర్లు ప్రయత్నించగా.. ఒకట్రెండు లైన్లు రాయగానే వాటి ఉపయోగాన్ని సైతం విశ్లేషించింది.
అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పాత్రికేయ ప్రొఫెసర్ ఒకరు తాను విద్యార్థులకు ఇచ్చే పనిని పూర్తి చేయమని ఛాట్‌బోట్‌కు పురమాయించారు. ఆన్‌లైన్ సెక్యూరిటీ, ప్రైవసీ మీద బంధువుకు సూచనలను ఇస్తూ ఉత్తరం రాయమని అడిగారు. "ఏదైనా వెబ్‌సైట్ లేదా ఈ మెయిల్ సక్రమమైనది కాదని అనిపిస్తే.. ఇది మోసమేమోనంటూ ఇతరులు రిపోర్టు చేశారేమో శోధించి చూసుకోవటం మంచిది" అని సలహా ఇచ్చేసింది. దీనికి ఆయన మంచి మార్కులు ఇచ్చేశారు కూడా. ఒక బ్రిటన్ పత్రిక 2020లో ఛాట్‌జీపీటీకి పూర్వ రూపమైన జీపీటీ-3 రాసిన బ్లాగును ప్రచురించింది కూడా. ఇందులో అది కృత్రిమ మేధ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ఇది కేవలం సౌకర్యం కలిగించేదనని పేర్కొంది. ముఖ్యంగా పాత్రికేయులు, రచయితల వంటి వారికి బాగా ఉపయోగపడగలదనీ స్పష్టం చేసేసింది! ఏదేమైనా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విడమరచుకొని, మనలాగా క్రోడీకరించగలిగే ఛాట్‌బోట్లు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఛాట్‌జీపీటీ మాదిరిగా ఇవి మరింత అధునాతనంగా రూపొందితే కొద్ది సంవత్సరాల్లోనే ప్రొఫెసర్లు, ప్రోగ్రామర్లు, పాత్రికేయుల ఉద్యోగాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.