వెబ్ బ్రౌజర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది క్రోమే. అంత ప్రాచుర్యం పొందింది మరి. ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లకు పైగా మంది దీన్ని వాడుతున్నారని అట్లాస్ వీపీఎన్ నివేదిక పేర్కొంటోంది. జనాభాలో 41% మంది క్రోమ్‌నే వాడుతున్నారు. బ్రౌజర్లలో 60% వాటా దీనిదే! ఇంత ఆదరణ పొందినప్పటికీ 90% మందికి దీని ఎక్స్‌టెన్షన్ల గొప్పతనమేంటో తెలియనే తెలియదు. పనుల్లో సాయం చేస్తూ ఉత్పాదకతను పెంచటానికివి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల వివరాలేంటో చూద్దాం.
వన్‌ట్యాబ్
ఒకేసారి చాలా ట్యాబ్‌లు తెరచి ఉంచేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వన్‌ట్యాబ్ ఎక్స్‌టెన్షన్‌ను జోడించుకొని, దీని గుర్తు మీద క్లిక్ చేస్తే చాలు. ఆయా ట్యాబ్‌లన్నీ ఒక జాబితా కింద ఒదిగిపోతాయి. వాటిని తిరిగి చూడాలనుకుంటే అవసరమైన దాన్ని రిస్టోర్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకేసారి రిస్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇది 65% వరకు మెమరీని ఆదా చేస్తుంది. ట్యాబ్‌ల గందరగోళాన్ని తగ్గిస్తుంది.
టూడూఇస్ట్
దీన్ని ఒకరకంగా ఆన్‌లైన్‌లో రోజువారీ వ్యవహారాలను చక్కబెట్టే జాబితా అనుకోవచ్చు. అందుకే వర్జ్ వెబ్‌సైట్ దీన్ని 'ద బెస్ట్ టు-డు లిస్ట్ రైట్ నౌ' అనీ ప్రకటించింది. చిన్నా పెద్దా వ్యవహారాలను, ప్రాజెక్టులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించుకోవటానికి సాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. దీనికి వెబ్‌సైట్స్‌ను టాస్క్‌లుగా జోడించుకోవచ్చు. బ్లాగ్ పోస్ట్‌ను రీడింగ్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. విష్‌లిస్ట్‌లో ఐటమ్‌ను సేవ్ చేసుకోవచ్చు. తర్వాత చేసుకోవాల్సిన పనులను యాడ్ వర్క్ టాస్క్‌లుగా జోడించుకోవచ్చు. రోజులో చేయాల్సిన పనులను 'ప్లాన్ యువర్ డే' విభాగంలో నిర్ణయించుకోవచ్చు. గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్, జేపియర్, ఎవర్‌నోట్, స్లాక్ వంటి 60కి పైగా యాప్‌లతో యాక్సెస్ చేసుకునే సదుపాయమూ ఉంది. అందువల్ల పనులు తేలికగా పూర్తవుతాయి. ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఫాక్స్‌క్లాక్స్
ఇది ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టైమ్‌జోన్ల సమయాలను బ్రౌజర్ కింద కనిపించేలా చేస్తుంది. బ్రౌజర్ స్టేటస్‌లోనే గడియారాన్ని చూపిస్తుంది. అవసరమైన టైమ్ ఫార్మాట్లనూ సెట్ చేసుకోవచ్చు. కావాలంటే కొత్త ఫార్మాట్‌ను సృష్టించుకోవచ్చు. ఏదైనా వెబ్‌సైట్‌ను చూస్తున్నప్పుడు గడియారం అడ్డుగా వస్తుందని అనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. దీనిలోని జోన్ పికర్ ద్వారా ప్రపంచంలోని అన్ని టైమ్‌జోన్లను దేశాలు, ప్రాంతాలు, పట్టణాల వారీగా బ్రౌజ్ చేయొచ్చు. సెర్చ్ సిటీస్ ఫీచర్‌తో ఆయా పట్టణాలను వర్చువల్‌గా గుర్తించొచ్చు. ఇది తనకుతానే టైమ్‌జోన్ డేటాబేస్‌కు అప్‌డేట్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆయా ప్రాంతాల్లోని సరైన సమయాన్నే తెలియజేస్తుంది.
లాస్ట్‌పాస్
ఇది అవార్డు గెలుచుకున్న పాస్‌వర్డ్ మేనేజర్. పాస్‌వర్డ్‌లతో పాటు నోట్స్, చిరునామా, క్రెడిట్ కార్డుల వంటి వాటి వివరాలను సెక్యూర్ వాల్ట్‌లో భద్రంగా సేవ్ చేసి పెడుతుంది. ఒక్క మాస్టర్ పాస్‌వర్డ్‌తోనే వీటిని కంప్యూటర్, మొబైల్ ఫోన్ల ద్వారా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఇది తనకుతానే వివరాలను ఫిల్ చేస్తుంది కూడా. పాస్‌వర్డ్ తెలియకపోవటం వల్ల అకౌంట్లు లాకయ్యే ప్రమాదాన్ని తప్పిస్తుంది. పత్రాలను, పాస్‌వర్డ్‌లను ఫిల్ చేసేటప్పుడు సమయాన్ని ఆదా చేస్తుంది.
గ్రామర్లీ
ఇది ఆంగ్లంలో రాస్తున్నప్పుడు వ్యాకరణ దోషాలు రాకుండా చూస్తుంది. ఇలా రాత నైపుణ్యాలు మెరుగు పరచుకోవటానికి తోడ్పడుతుంది. తేలికైన ఇంటర్ఫేస్‌తో కూడిన గ్రామర్లీ ఎక్స్‌టెన్షన్ అక్షర క్రమాన్ని, వ్యాకరణాన్ని, విరామ చిహ్నాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. తప్పులు దొర్లితే సరిచేసుకోవాలనీ సూచిస్తుంది. రాసే విధానాన్ని, స్పష్టతనూ విప్పి చెబుతుంది. కేవలం తప్పులను సవరించటానికే కాదు.. ఆత్మ విశ్వాసంతో రాసేలా చూస్తుంది. భావ వ్యక్తీకరణకు మంచి పదాలనూ చూపెడుతుంది. ఆన్‌లైన్‌లో మంచి ఆంగ్ల ప్రయోగానికి చేదోడుగా నిలుస్తుంది. బెరుకు లేకుండా వ్యవహారాలు నిర్వహించుకోవటానికి తోడ్పడుతుంది.
స్టేఫోకస్డ్
ఇంటర్నెట్‌లో ఎన్నెన్నో వెబ్‌సైట్‌లు. సామాజిక మాధ్యమ వేదికల పోస్టులు. ఏవేవో ఆకర్షిస్తుంటాయి. గంటల కొద్దీ సమయం గడిచిపోతుంది. దీంతో చేయాల్సిన పనిని పక్కనపెట్టి ఆన్‌లైన్‌లో దారి తప్పొచ్చు! ఇలాంటి సమయాల్లో స్టేఫోకస్డ్ ఎక్స్‌టెన్షన్ తిరిగి దారికి తీసుకొస్తుంది. సమయాన్ని వృథా చేసే వెబ్‌సైట్లలో ఎక్కువసేపు గడపకుండా చూస్తుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సైట్‌లో ఎంతసేపు గడపాలో ముందే నిర్ణయించుకోవచ్చు. సమయం ముగిశాక దాన్ని పెంచుకోవాలంటే అది చేసే సవాల్‌ను స్వీకరించాల్సిందే. దాన్ని పూర్తి చేస్తే గానీ సమయం పెంచు కోవటానికి కుదరదు. ఈమెయిళ్లు, ఫేస్‌బుక్, ట్విటర్, రెడిట్, వికీపీడియా.. ఇలాంటి వెబ్‌సైట్లలో ఎంతసేపు గడిపారన్నది ఇట్టే చూసుకోవచ్చు. ఎక్కడైనా ఎక్కువసేపు గడిపితే వెంటనే ఆ విషయం తెలిసిపోతుంది.
అండ్ స్క్రీన్ రికార్డర్
డెస్క్‌టాప్ లేదా ట్యాబ్ స్క్రీన్ రికార్డు చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చు. వెబ్‌సైట్ మొత్తం పేజీని లేదా కనిపించే భాగం ఇలా అవసరమైనట్టుగా క్యాప్చర్ చేసుకోవచ్చు. తీసుకున్న స్క్రీన్ షాట్‌కు టూల్‌బార్ సాయంతో నోట్స్ కూడా జోడించుకోవచ్చు. టెక్నికల్ సమస్యలు ఎదురైనప్పుడు ఎవరికైనా స్క్రీన్‌షాట్‌ను, రికార్డింగ్‌ను సవివరంగా పంపించు కోవటానికి ఇది వీలు కల్పిస్తుంది.
గూగుల్ ట్రాన్స్‌లేట్
ఆన్‌లైన్‌లో దేనికోసమో వెతుకుతుంటాం. బ్రౌజర్ వేరే భాషలో ఉండొచ్చు. దాన్ని అనువాదం చేసి పెట్టటానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎక్స్‌టెన్షన్ మంచి టూల్. బ్రౌజ్ చేస్తున్నప్పుడే తేలికగా అనువాదం చేసుకోవచ్చు. టెక్స్ట్‌లో భాగాన్ని హైలైట్ లేదా రైట్ క్లిక్ చేసి ట్రాన్స్‌లేట్ గుర్తు మీద నొక్కితే చాలు. ఎంచుకున్న భాషలోకి అనువాదం అవుతుంది. బ్రౌజర్ టూల్‌బార్ మీదుండే ట్రాన్స్‌లేట్ గుర్తును నొక్కితే మొత్తం పేజీ అనువాదం అవుతుంది.
ఇవీ చదవండి: