Apple Security Flaw 2023 : యాపిల్ యూజర్లకు అలెర్ట్. యాపిల్ ప్రొడక్టుల్లో ముఖ్యంగా ఐఫోన్ నుంచి యాపిల్ వాచ్ వరకు అన్నింటిలో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గుర్తించింది. ఈ సెక్యూరిటీ లోపాలను ఉపయోగించుకుని, సైబర్ నేరగాళ్లు చాలా సులువుగా సదరు డివైజ్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
సాఫ్ట్‌వేర్‌లో లోపాలు?
Apple Software Security Risks : యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ కాంపోనెంట్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్, కెర్నల్, వెబ్‌కిట్ కాంపోనెంట్ల్లో లోపాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు.. ఐఫోన్ నుంచి యాపిల్ వాచ్‌ల వరకు అన్నింటినీ హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఎలా అంటే.. హ్యాకర్లు యాపిల్ యూజర్లకు ఒక రిక్వెస్ట్‌ను పంపిస్తారు. ఇది సాధారణమైన అంశమే కదా అని ఓపెన్ చేస్తే.. ఇక అంతే సంగతులు. మీ డివైజ్ యాక్సెస్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దీనితో మీ డివైజ్‌లోని సున్నితమైన డేటా మొత్తం సైబర్ నేరగాళ్లు చేజిక్కించుకుంటారు. దీని వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగానూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
వెంటనే అప్డేట్ చేసుకోవాలి!
Apple Software Update 2023 : ఐఫోన్, యాపిల్ వాచ్, టీవీ, మ్యాక్ బుక్‌లోని భద్రతాపరమైన లోపాలను సరిదిద్దాలంటే.. యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా విడుదలైన watchOS, tvOS, macOS అప్డేటెడ్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి.
సాఫ్ట్వేర్ లిస్ట్
Apple Affected Software List : సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్ https://cert-in.org.in/ లో ఎఫెక్టెడ్ యాపిల్ సాఫ్ట్వేర్ లిస్ట్ ఉంది. అవి ఏమిటంటే..
- Apple macOS Monterey versions prior to 12.7
- Apple macOS Ventura versions prior to 13.6
- Apple watchOS versions prior to 9.6.3
- Apple watchOS versions prior to 10.0.1
- Apple iOS versions prior to 16.7 and iPad OS versions prior to 16.7
- Apple iOS versions prior to 17.0.1 and iPad OS versions prior to 17.0.1
- Apple Safari versions prior to 16.6.1
మీ యాపిల్ డివైజ్‌ల్లో కనుక ఇవి ఉంటే.. కచ్చితంగా వెంటనే లేటెస్ట్ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోండి. లేకుంటే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంది.
CERT అంటే ఏమిటి?
భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) పనిచేస్తుంది. ఇది ఆన్లైన్లో జరిగే స్కామింగ్, హ్యాకింగ్ లాంటి భద్రతాపరమైన ప్రమాదాలను కనిపెట్టి, యూజర్లను అలెర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ డొమైన్ సెక్యూరిటీని పర్యవేక్షిస్తూ ఉంటుంది.