ఆకుకూరల్లో(Leafy Vegetables) పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూరను భాగం చేసుకునే వారు కొందరుంటే. అసలు ఇవంటేనే గిట్టని వారు మరికొందరుంటారు. కొన్ని ఇళ్లల్లో పిల్లలే కాదు పెద్దలు కూడా ఆకుకూరలంటే ఇష్టపడరు. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలంటే ఏం చేయాలి. ఇవంటే నచ్చని వారితో ఎలా తినిపించాలి? వాటికి సమాధానమే ఆకుకూరలతో చేసే ఈ వెరైటీ రెసిపీలు. ఏ పప్పుతో కలిపో.. లేక ప్రత్యేకంగా వండితేనే కొందరు దీన్ని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసం.. ఆకుకూరలతో శాండ్విచ్, పాస్తా, చట్నీ, కఢీలు ట్రై చేయండి. ఎలా తినరో మీరే చూడండి..
శాండ్‌విచ్‌లు.. రుచికరమైన వీటిని చిన్నాపెద్దా ఎంతో ఇష్టంగా తింటారు. వీటి తయారీలో పాలకూర, బచ్చలికూర, లెట్యూస్ లాంటి వాటిని చేర్చితే రుచి పెరుగుతుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తింటారు.
చట్నీలు... చాలామంది ఆవకాయ, మాగాయ లేకపోతే ముద్ద ముట్టుకోరు. వీటికి ప్రత్యామ్నాయంగా పుదీనా, కొత్తిమీరతో కలిపి రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, చాట్‌లలోనూ దీన్ని వాడుకోవచ్చు.
కఢీ.. ఉత్తర భారతంలో పెరుగుతో చేసుకునే ప్రత్యేకమైన వంటకమిది. దీంట్లో శుభ్రం చేసిన పాలకూరను మిక్సీపట్టి పేస్ట్ వేస్తే సరి. ఇది ఈ కూరకు ప్రత్యేకమైన రుచిని ఆపాదించిపెడుతుంది.
పాస్తా... పాలకూర(Leafy Vegetables), ఇతర ఆకుకూరలను పేస్ట్ చేసి పాస్తాలో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. చిన్నారులకు అందులో ఆకుకూరలు వేసినట్లు కూడా తెలియదు.
చిరుతిండి... బచ్చలికూర బజ్జీ, పాలకూర పకోడీ... ఇలా రకరకాలుగా చేసి తినిపించ వచ్చు. లేదా ఆకుకూరలతో కలిపి కారం కారంగా చాట్ చేసిపెట్టండి.