అచారీ చికెన్
![variety dishes with chicken like achari and chettinad fry curries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8699611_387_8699611_1599384366523.png)
కావలసినవి:
చికెన్: అరకేజీ, ఎండుమిర్చి: నాలుగు, దనియాలు: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: పావుటేబుల్‌స్పూను, జీలకర్ర: టేబుల్‌స్పూను, మెంతులు: పావుచెంచా, సోంపు: ఒకటిన్నర చెంచా, ఉల్లిముక్కలు: కప్పు, టొమాటోముక్కలు: ముప్పావుకప్పు, నూనె: రెండుటేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, చక్కెర: ఒకటిన్నర చెంచా, పెరుగు:అరకప్పు, ఆవకాయ గుజ్జు: టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు: పావుకప్పు, అల్లం తరుగు: చెంచా.
తయారీ విధానం:
ఎండుమిర్చి, దనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. చల్లారాక మిక్సీలో పొడి చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి, వేడయ్యాక ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ముందుగా చేసుకున్న పొడి వేయాలి. రెండు నిమిషాలయ్యాక టొమాటో గుజ్జు, కారం, పసుపు, తగినంత ఉప్పు, చక్కెర వేసి బాగా కలపాలి. అన్నీ వేగాక గిలకొట్టిన పెరుగు, దాని తరువాత చికెన్ ముక్కలు, అరకప్పు వేణ్నీళ్లు పోయాలి. చికెన్ పూర్తిగా ఉడికాక ఆవకాయ గుజ్జు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి.
చెట్టినాడ్ పెప్పర్ చికెన్
![variety dishes with chicken like achari and chettinad fry curries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8699611_862_8699611_1599384491929.png)
కావలసినవి:
చికెన్: అరకేజీ, జీలకర్ర: చెంచా, దనియాలు: రెండు చెంచాలు, ఎండుమిర్చి: అయిదు, మిరియాలు: మూడుచెంచాలు, దాల్చినచెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు, సోంపు: చెంచా, ఎండుకొబ్బరిపొడి: పావుకప్పు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు: పది, నూనె: అరకప్పు, బిర్యానీఆకులు: రెండు, ఆవాలు: చెంచా, ఉల్లిపాయ ముక్కలు: రెండుకప్పులు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, టొమాటోగుజ్జు: ఒకటిన్నర కప్పు, ఉప్పు: తగినంత, కారం: రెండు చెంచాలు, పసుపు: చెంచా, చింతపండుగుజ్జు: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు.
తయారీవిధానం:
జీలకర్ర, దనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు, సోంపు, ఎండుకొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేయించి, చల్లారాక అన్నీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. అదే బాణలిలో బిర్యానీ ఆకులు, ఆవాలు వేసి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించి రుబ్బిన మసాలా టొమాటో గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై చింతపండుగుజ్జు చేసి మరికాసేపు ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లాలి.
చికెన్ రోస్ట్
![variety dishes with chicken like achari and chettinad fry curries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8699611_107_8699611_1599384457186.png)
కావలసినవి:
చికెన్: కేజీ, పసుపు: పావుచెంచా, కారం: పావు చెంచా, దనియాలపొడి: పావుచెంచా, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, పచ్చిమిర్చి: అయిదు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయలు: మూడు, టొమాటో:ఒకటి (పేస్టులా చేసుకోవాలి), కరివేపాకు రెబ్బలు: మూడు, గరంమసాలా: పావుచెంచా, మిరియాలపొడి: పావు చెంచా, నిమ్మకాయ: ఒకటి, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం:
చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మిక్సీలో పసుపు, కారం, దనియాలపొడి, చెంచా నిమ్మరసం, వెల్లుల్లి తరుగు, మూడు పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలపైన వేసి బాగా కలపాలి. గంట తరువాత స్టౌమీద బాణలి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో కప్పు నూనె వేసి చికెన్ ముక్కల్ని వేయించి తీసుకోవాలి. మరో బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. నిమిషం తరువాత టొమాటో గుజ్జు వేసి.. ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేయాలి. చికెన్ ముక్కలకు టొమాటో గుజ్జు పట్టాక ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా, మిరియాలపొడి, మిగిలిన నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.
చిల్లీ చైనీస్ చికెన్
![variety dishes with chicken like achari and chettinad fry curries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8699611_742_8699611_1599384394941.png)
కావలసినవి:
చికెన్: అరకేజీ, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, సోయాసాస్: నాలుగుటేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, ఉల్లిపాయలు: రెండు, నూనె: కప్పు, ఎండుమిర్చి: ఆరు, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం తరుగు: చెంచా, టొమాటో కెచప్: రెండు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం: రెండు, ఉప్పు: తగినంత.
తయారీవిధానం:
చికెన్‌ని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో చికెన్ ముక్కలు, మొక్కజొన్నపిండి, సోయాసాస్, గుడ్డు సొన వేసి అన్నింటినీకలిపి పెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. అవి వేగాక టొమాటో కెచప్, తగినంత ఉప్పు వేసి ఓసారి కలిపి దింపేయాలి. మరోబాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేసి చికెన్ ముక్కల్ని వేయించి టొమాటోసాస్‌లో వేయాలి. తరువాత అన్నింటినీ కలిపి స్టౌమీద పెట్టి క్యాప్సికం ముక్కలు, కప్పు వేడి నీళ్లుపోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మిశ్రమం కాస్త చిక్కబడ్డాక దింపేయాలి.