దక్షిణ భారత దేశంలో ఫేమస్ ఫలహారం ఇడ్లీ. అయితే, ప్రాంతాన్ని బట్టి ఇడ్లీ చేసే తీరు మారుతుంది. దానితో పాటు రుచి మారుతుంది. ఇక కాంచీపురంలో చేసే ఈ స్పెషల్ ఇడ్లీ రెసిపీ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే..
కావల్సినవి
మినప్పప్పు- అర కప్పు, బియ్యం, అటుకులు, ఉప్పుడు బియ్యం - అరకప్పు చొప్పున, మెంతులు- పావు చెంచా, నెయ్యి - రెండు చెంచాలు, కరివేపాకు తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - పావు చెంచా, శొంఠి పొడి - టేబుల్ స్పూను, జీలకర్ర, మిరియాలు - ఒకటిన్నర చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, తాలింపు దినుసులు - చెంచా.
తయారీ
మినప్పప్పు, బియ్యం, ఉప్పుడు బియ్యాన్ని విడివిడిగా కడిగి, మెంతులు వేసి నీళ్లలో ఎనిమిది గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి గరకుగా రుబ్బుకోవాలి. పది నిమిషాలు నీళ్లలో నానబెట్టిన అటుకులను కూడా మెత్తగా రుబ్బుకుని మినప్పిండిలో కలపాలి. మిరియాలూ, జీలకర్రను మిక్సిలో బరకగా పొడిలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక తాలింపు దినుసులు వేయించి, జీలకర్ర పొడీ, కరివేపాకు తరుగు వేసి దింపేయాలి. ఇందులో ఇంగువా, శొంఠిపొడి కలపాలి. ఈ తాలింపూ, సరిపడా ఉప్పు మినప్పిండిలో వేసి బాగా కలపాలి. ఈ పిండిని పది గంటలు నాననివ్వాలి. తర్వాత సాధారణ ఇడ్లీ రేకుల్లో లేదా గిన్నెలాంటి పళ్లెంలో వేసి ఇరవై నిమిషాలు ఆవిరిమీద ఉడికించుకుని తీసుకుంటే సరిపోతుంది.
ఇదీ చదవండి: 'చాక్లెట్ కేక్' సూపర్ గా బేక్ చేసేద్దామిలా..!