ఇంట్లో ఉండే సామగ్రితోనే.. వెరైటీ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు.. కమ్మని ఆలూ బ్రెడ్ రోల్స్ ట్రై చేయాల్సిందే..
కావాల్సిన పదార్థాలు..
- బ్రెడ్ ముక్కలు - 4 (ఎడ్జెస్ కట్ చేసుకోవాలి)
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
- నీళ్లు - కొన్ని
ఆలూ మసాలా కర్రీ కోసం కావాల్సినవి:
- బంగాళా దుంపలు - 3
- ఉల్లిపాయ – 1 (సన్నగా తరుగుకోవాలి)
- తురిమిన అల్లం - టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర – అర టీస్పూన్
- శనగపప్పు - టీస్పూన్
- మినప్పప్పు - టీస్పూన్
- కరివేపాకు రెబ్బలు - కొన్ని (సన్నగా తరుగుకోవాలి)
- పచ్చిమిర్చి - 1 (సన్నగా తరుగుకోవాలి)
- పసుపు - చిటికెడు
తయారీ విధానం..
ముందుగా ఆలూ మసాలా కర్రీని తయారు చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా బంగాళా దుంపల్ని ఉడికించుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై ప్యాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆపై పసుపు, ఉప్పు వేసి మ్యాష్ చేసిన బంగాళా దుంపల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చి ఆపై దించేస్తే ఆలూ మసాలా కర్రీ రెడీ.
ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని నీళ్లలో ముంచి గట్టిగా వత్తుతూ నీళ్లను పిండేయాలి. ఆపై ఇందులో ఆలూ మసాలా కర్రీని స్టఫ్ చేసుకొని రోల్‌లా చేసుకోవాలి. ఈ రోల్‌ను నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఆలూ బ్రెడ్ రోల్ తయార్. ఇదే విధంగా పనీర్ మసాలాతో కూడా బ్రెడ్ రోల్ చేసుకోవచ్చు.
చూశారుగా.. తక్కువ సమయంలోనే ఎంత సింపుల్‌గా బ్రెడ్ రోల్స్‌ని తయారుచేసుకోవచ్చో.. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేయండి.
ఇదీ చదవండి: చిటపటల వేళ 'మొక్కజొన్న గారెలు' చేసుకోండిలా!