భోజన ప్రియులకే కాక ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వంటకం బిర్యానీ. తెలుగు రాష్ట్రాల్లో దీనికి అంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ వంటకంతో పాటు పులావ్‌ను ఎక్కువగానే ఇష్టపడతారు కొందరు. కానీ బిర్యానీ, పులావ్‌ను ఒకటే అనుకుంటారు. చూడటానికి ఈ రెండూ ఒకేలా కనిపించినా.. రుచితో పాటు చేసే విధానాన్ని గమనిస్తే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవచ్చు.
ముందుగా పులావ్ గురించి తెలుసుకుందాం. పులావ్ తయారీ చాలా తేలిక. ఏ బియ్యంతో అయినా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఒన్షాట్ అంటారే ఆ తరహాలో పులావ్‌ని తయారుచేసుకోవచ్చు. కావల్సినంత బియ్యం, కాయగూరలు, వేయాలనుకుంటే మాంసాహారం వేసి కుక్కర్ మూతపెట్టి ఉడికించేస్తే అది పులావ్. దీనికి పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. పిలాఫ్ అనే పదం నుంచి పులావ్ అనే పదం వచ్చింది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ పులావ్‌ని తయారు చేసుకుంటారు. కానీ బిర్యానీ అలా కాదు.
బిర్యానీ చాలా చాలా తక్కువ చోట్ల మాత్రమే దొరుకుతుంది. నైపుణ్యంతో చేసే ఖరీదైన వంటకం బిర్యానీ. దీనిని ఒకేసారి చేద్దామంటే కుదరదు . అంచెలంచెలుగా చేయాల్సిందే. సరైన బిర్యానీలో.. 21 రకాల సుగంధ ద్రవ్యాలు పడాల్సిందే. ఇలాచి, లవంగం, దాల్చినచెక్క, జాజికాయ, జాపత్రి మరాటి మొగ్గ, చందనం ఇలా 21 రకాలు వేసుకోవచ్చు. ఇన్ని పులావ్‌లో వేయరు. ప్రాథమికంగా వేసే దాల్చినచెక్క, లవంగాలు వంటివి మాత్రమే వేస్తారు . బిర్యానీని ప్రత్యేకించి బాస్మతి బియ్యంతోనే తయారుచేయాలి. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి . పక్కి బిర్యానీ , కచ్చీ బిర్యానీ అని. బిర్యానీలో కాయగూరలు వాడినా, మాంసాహారం వాడినా వాటిని తప్పనిసరిగా మారినేషన్ చేసే వేయాలి. అది కూడా నెయ్యితోనే వండాలి. పులావ్‌కి నెయ్యి తప్పనిసరి కాదు.
ఇదీ చూడండి: నోరూరించే హైదరాబాద్ సబ్జీ దమ్కీ బిర్యానీ