రోజూ కనీసం 250 గ్రా. ఆకుకూరల్ని తీసుకోవడం వల్ల కండరాల పనితీరు బాగుంటుందని ఎడిత్ కొవన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. నైట్రేట్ ఎక్కువగా ఉండే లెట్యూస్, పాలకూర, కేల్, తోటకూర వంటి వాటితోపాటు బీట్‌రూట్ కూడా ఎక్కువగా తీసుకునేవాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు వీళ్ల అధ్యయనంలో స్పష్టమైంది. నైట్రేట్ తక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకున్నవాళ్లతో పోలిస్తే అది ఎక్కువగా ఉండే ఆకుకూరల్ని తీసుకునేవాళ్ల కాళ్లల్లో బలం బాగా ఉండటమే కాదు, వాళ్లకన్నా వీళ్లు వేగంగా నడుస్తున్నట్లు గుర్తించారు.
వీటివల్ల వెన్నెముక కండరాలతోపాటు గుండె కండరాల పనితీరు కూడా మెరుగ్గా ఉందట. వయసుతోపాటు వచ్చే కంటి కండరాల క్షీణత కూడా తగ్గుతుందనీ, ముఖ్యంగా వృద్ధాప్యంలో వీటిని ఎక్కువగా తినేవాళ్లు చురుగ్గా ఉంటున్నారనీ చెబుతున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు కూడా రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని తీసుకుంటే కండరాల పనితీరు బాగుంటుంది అంటున్నారు పరిశీలకులు.
ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్: మ్యాంగో చికెన్ కూర