శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే గుడ్డు ధర ఇప్పుడు గుండె గుబేల్ మనిపిస్తోంది. హోల్‌సేల్ ధరలు ఎలా ఉన్నా.. రిటైల్ వ్యాపారులు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కో గుడ్డు ధర రూ. 6.25ల నుంచి రూ.7 వరకూ ఇష్టారీతిన అమ్ముతున్నారు. ఇందుకు కారణం కోడి గుడ్ల రాక తగ్గడమే కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో వాటి వినియోగం గణనీయంగా పెరగడంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఎండాకాలం ఆదిలో తెగుళ్లు వచ్చి 20 శాతం వరకూ కోళ్లు చనిపోయాయి. లాక్‌డౌన్ సమయానికి వాటి దాణా ధరలు 50 శాతం వరకూ పెరిగాయి. ఈ తరుణంలో గుడ్లు పెట్టే కోళ్లకు దాణా వేయడం రైతుకు చాలా ఖర్చుతో కూడుకున్నది. కరోనా వేళ వీటి వినియోగం బాగా పెరిగింది. ఇది వరకూ డజను చొప్పున కొన్నవారు.. ఇప్పుడు ట్రేలో ఎన్ని ఉంటే అన్ని తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనూ వినియోగం పెరిగిందని.. అదే సమయంలో వాటి ఉత్పత్తి తక్కువవడం వల్ల ధరలు పెరిగాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(ఎన్‌ఈసీసీ) ప్రతినిధి సంజీవ్ చెబుతున్నారు. తెలంగాణలో 3.70 కోట్ల గుడ్ల ఉత్పత్తి ప్రస్తుతం జరుగుతోంది. గతంలో ఇది 4 కోట్లు పైచిలుకు ఉండేది.