మెలగు రసం.. (తమిళనాడు)
Rasam Recipes : కావాల్సినవి: టొమాటోలు- నాలుగు, చింతపండు రసం- కప్పు, సాంబారు/రసం పొడి, జీలకర్ర, మిరియాలు- రెండు చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, నీళ్లు- రెండు గ్లాసులు, నెయ్యి/నూనె- రెండు పెద్ద చెంచాలు, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు.
తయారీ: పొయ్యి వెలిగించి పెద్ద గిన్నె పెట్టి టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. అవి కాస్త మగ్గిన తర్వాత చింతపండు రసం కలపాలి. కొన్ని నీళ్లు పోసి, సాంబారు/రసం పొడి వేసి కలిపి బాగా మరిగించాలి. ఈ సమయంలోనే చిన్న రోలులో మిరియాలు, జీలకర్ర వేసి బరకగా దంచాలి. రోలు లేకపోతే మిక్సీజార్‌లోనూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీన్ని మరుగుతున్న చారులో వేసి చిన్న మంటపై పది నిమిషాలు మరిగించాలి. ఈలోగా మరో పొయ్యి మీద చిన్న కడాయి పెట్టి నెయ్యి/నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు వేసి చిటపటమన్నాక కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును చారులో కలిపి పొయ్యి కట్టేయొచ్చు.
వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు.. జలుబు, దగ్గులతో బాధపడుతున్నప్పుడు ఈ రసం తీసుకుంటే గొంతుకు కాస్త ఉపశమనంగా ఉంటుంది. జలుబూ తగ్గుతుంది.
ఆయుర్వేద రసం..
Types of Rasam : కావాల్సినవి: కంది పప్పు- పావు కప్పు, జీలకర్ర, పసుపు- పావు చెంచా చొప్పున, చింతపండు గుజ్జు- రెండు పెద్ద చెంచాలు, బెల్లం- చెంచా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు,- చెంచా చొప్పున, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క- ఒకటి చొప్పున, శొంఠి- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- మూడు, ఇంగువ- పావు చెంచా, ఉప్పు- తగినంత.
తాళింపు వేయడానికి.. నూనె- రెండు చెంచాలు, ఎండు మిర్చీ- నాలుగైదు, ఇంగువ- చిటికెడు, జీలకర్ర, ఆవాలు- చెంచా.
తయారీ: ధనియాలు, శొంఠి, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, జీలకర్ర, దాల్చిన చెక్క, కందిపప్పు, ఎండు మిర్చీ, లవంగాలు, వెల్లుల్లి, ఇంగువ వీటన్నింటిని చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద పెద్ద బాండీ పెట్టి నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో పసుపు, ఉప్పు, బెల్లం వేసి మరిగించాలి. ఆపై తయారుచేసి పెట్టుకున్న పొడిని వేసి మరికాసేపు చిన్న మంటపై మరిగించాలి. మరో పొయ్యి మీద చిన్న కడాయి పెట్టి నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వాము, ఎండు మిర్చీ, ఇంగువ వేయాలి. ఈ పోపును మరుగుతున్న చారులో వేస్తే సరి. ఘుమఘుమలాడే చారు రెడీ..
ఈ చారులో బోలెడు ఔషధ గుణాలుంటాయి. ఇవి రుచితోపాటు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అన్నంలో వేసుకుని తిన్నా, తాగినా చాలా మంచిది.
టొమాటో రసం (కేరళ)..
Tomato Rasam : కావాల్సినవి: టొమాటోలు- రెండు (ముక్కలుగా కోసుకోవాలి), చింతపండు రసం- కప్పు, పసుపు- పావు చెంచా, కరివేపాకు రెబ్బలు- రెండు, కొత్తిమీర- కట్ట, వెల్లుల్లి రెబ్బలు- పన్నెండు, ధనియాలు, జీలకర్ర- చెంచా చొప్పున, మిరియాలు- రెండు చెంచాలు, అల్లం- చిన్న ముక్క, చిన్న ఉల్లిపాయలు- అయిదారు, కొబ్బరినూనె- రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చీ, ఎండు మిర్చీ- రెండు (నిలువుగా చీల్చాలి), మెంతి పొడి- పావు చెంచా, ఆవాలు, ఇంగువ, కారం- అర చెంచా చొప్పున, ఉప్పు- తగినంత.
తయారీ: గిన్నెలో టొమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు రసం, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు వేసి చేత్తో బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో పొట్టుతీయని వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, మిరియాలు, అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ/మట్టి పాత్ర పెట్టి కొబ్బరి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు, తయారుచేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి కలపాలి. ఆ తర్వాత ఎండుమిర్చీ ముక్కలు వేయాలి. మెంతి పొడి, ఇంగువ, కారం, కరివేపాకునూ జత చేయాలి. దీన్ని ఓసారి బాగా కలిపి తయారుచేసి పెట్టుకున్న టొమాటో, చింతపండు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇందులోనే మిగిలిన చింతపండు రసం పోసి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి మంటను మధ్యస్థంగా పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వేడి మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేయాలి.
జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఈ రసాన్ని తయారు చేసుకుని అన్నంతో తినొచ్చు లేదా గ్లాసులో పోసుకుని తాగేయొచ్చు.
థిలి సారు (కర్ణాటక)
Healthy Rasam : కావాల్సినవి: కందిపప్పు- అర కప్పు, టొమాటో- ఒకటి (ముక్కలుగా), పసుపు- పావు చెంచా, కరివేపాకు- కొద్దిగా, నీళ్లు- రెండు కప్పులు, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- చెంచా, ఇంగువ- చిటికెడు, చింతపండు రసం- కప్పు, బెల్లం- చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు.
తాలింపు కోసం.. నూనె- చెంచా, ధనియాలు, జీలకర్ర- పెద్ద చెంచా చొప్పున, మెంతులు, ఆవాలు- పావు చెంచా చొప్పున, మిరియాలు- అర చెంచా, ఎండుమిర్చీ- మూడు, కరివేపాకు- కొద్దిగా.
తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చీ, కరివేపాకు వేసి చిన్నమంటపై వేయించాలి. వీటి నుంచి చక్కటి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఈ దినుసులను పొడి చేసుకోవాలి. కుక్కర్‌లో పప్పు, టొమాటో ముక్కలు, పసుపు, కరివేపాకు, నూనె వేసి, నీళ్లు పోయాలి. మూత పెట్టి అయిదు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బాలి. దీనికి నాలుగు కప్పుల నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చీ, కరివేపాకు వేయాలి. దీంట్లో చింతపండు రసాన్ని పోయాలి. అలాగే పసుపు, బెల్లం, ఉప్పును కూడా జత చేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలు చింతపండు రసం బాగా మరిగే వరకు మరిగించాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న పప్పును కలపాలి. చివరగా థిలిసారు పొడిని వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోసి కాసేపు మరిగించాలి. ధనియాల పొడి వేసి మరోసారి కలిపి దించేస్తే వేడి వేడి కర్ణాటక ప్రత్యేక రసం థిలి సారు సిద్ధం.
ఈ చారులో కాస్తంత నెయ్యి వేసి అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. రుచితోపాటు ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
మిరియాల రసం..
miriyala rasam : కావాల్సినవి: నానబెట్టుకున్న కందిపప్పు నీళ్లు- కప్పున్నర, చింతపండు రసం- కప్పు, పసుపు- పావు చెంచా, పచ్చిమిర్చీ- రెండు (ముక్కలుగా కోసుకోవాలి), ఎండు మిర్చీ- నాలుగు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు- చెంచా చొప్పున, సెనగపప్పు- పెద్ద చెంచా, కరివేపాకు- పావు కప్పు, ఉప్పు- తగినంత.
తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి చింతపండు రసం పోసి, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చీ ముక్కలు వేసి ఉడికించాలి. ఆ తర్వాత మరో పొయ్యి మీద పెనం పెట్టి సెనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చీ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మరుగుతున్న చింతపండు రసంలో వేసి బాగా కలపాలి. ఇందులోనే నానబెట్టుకున్న కందిపప్పు నీళ్లు, మరికొన్ని నీళ్లను పోసి చిన్న మంటపై మరిగించాలి. మరోసారి పొయ్యి మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును మరుగుతున్న చారులో వేసి పొయ్యి కట్టేయాలి. అంతే మిరియాల రసం సిద్ధం.
మైసూర్ రసం..
Mysure Rasam : కావాల్సినవి: టొమాటో ప్యూరీ, చింతపండు రసం, కందిపప్పు నీళ్లు- కప్పు చొప్పున, ఎండు మిర్చీ- అయిదారు, ధనియాలు, సెనగపప్పు, మినప్పప్పు- రెండు చెంచాల చొప్పున, మిరియాలు- పెద్ద చెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము- పావు కప్పు, జీలకర్ర- అర చెంచా, పసుపు- పావు చెంచా, పచ్చిమిర్చీ- మూడు, నెయ్యి- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, బెల్లం- చెంచా.
తయారీ: పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఎండు మిర్చీ, ధనియాలు, సెనగపప్పు, మినప్పప్పు, మిరియాలు వేసి చిన్న మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చికొబ్బరి తురుము వేసి మరి కాసేపు వేయించాలి. దీన్ని చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి నీళ్లు పోసి అందులో పచ్చిమిర్చీ ముక్కలు, పసుపు, టొమాటో ప్యూరీ, చింతపండు రసం, కందిపప్పు నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి అయిదారు నిమిషాలు మరిగించాలి. మరుగుతున్న సమయంలో తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి చిన్న మంటపై మరికాసేపు మరిగించాలి. ఆ తర్వాత బెల్లం, ఉప్పు కూడా జత చేయాలి. చివరగా... పోపు పెట్టుకోవాలి. అందుకోసం కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఈ పోపును చారులో వేసి చివరగా కొత్తిమీర తరుగుతో అలంకరించుకుంటే సరి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!