ఒడిశాలో ప్రతి ఏటా మార్చి నెలలో 'పఖాలీ అన్నం' లేదా 'సద్దన్నం' దినోత్సవం జరుపుకొంటారు. పఖాలీ అంటే మనం తినే చద్దన్నమే. ఈ పఖాలీ అన్నం గురించి మాట్లాడకుండా ఒడిశా క్యుజీన్‌కి సంపూర్ణత్వం రాదు. రాత్రి మిగిలిన అన్నంలో గంజి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రాత్రంతా పులియబెడతారు. ఫెర్మెంట్ అయిన ఈ అన్నంలో కొద్దిగా ఆవనూనె వేసి తింటారు. దీన్నే పఖాలా అంటారు. అక్కడి పెళ్లిళ్లలో కూడా ఈ అన్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లికూతురు అత్తింటివారికి వేయించిన చేపలు, పఖాలీ అన్నం వడ్డించడం ఆచారం.
నిమ్మఆకులు వేసి చేసే చద్దన్నాన్ని 'లేంబు పత్ర పఖాలా' అనీ 'తోరాణి అన్నం' అనీ అంటారు. ఇది మన తర్వాణి అన్నమే! చద్దన్నంలో కాస్త మజ్జిగ, నిండుగా నిమ్మఆకులు కానీ దబ్బ ఆకులు కానీ వేస్తే అది తోరణి లేదా తర్వాణి అవుతుంది. పూరీజగన్నాథుని సన్నిదిలో దొరికే ఈ ప్రసాదానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ అన్నాన్నే రైతోడి అన్నం అని, అలబొద్దు అనీ అంటారు. కంచుమట్టు గిన్నెల్లో తింటారు.
అసిస్టెంట్ దోసెలు..
కావాల్సినవి: అన్నం - మూడు కప్పులు, పెరుగు - 50గ్రా, ఉప్పు, నూనె - తగినంత, ఉల్లిపాయ- సగం
తయారీ: అన్నం, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయముక్కలని మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు కూడా కలుపుకొని జారుగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి. దోసెలపిండి సిద్ధం. దీంతో కరకరలాడే రుచికరమైన దోసెలని వేసుకోవచ్చు.
సద్ది ఇడ్లీలు..
కావాల్సినవి: అన్నం - కప్పు, అటుకులు - పావుకప్పు, బొంబాయి రవ్వ- కప్పు, పెరుగు- కప్పు, ఈనో ఫ్రూట్ సాల్ట్- రెండు చెంచాలు, ఉప్పు, నూనె- తగినంత
తయారీ: అన్నం, అటుకులు, రవ్వ, పెరుగు వీటన్నింటిని తగినంత ఉప్పు వేసి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత రుబ్బి మరో పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. గరిటెతో కలిపి చివరిగా ఈనో సాల్ట్ వేసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. కొబ్బరి చట్నీతో రుచిగా ఉంటాయి.
సద్ది జంతికలు
కావాల్సినవి: అన్నం - కప్పు, బియ్యప్పిండి - అరకప్పుపైన చెంచా, సెనగపిండి - పావుకప్పుపైన చెంచా, పసుపు- కొద్దిగా, కారం- అరచెంచా, ఉప్పు- తగినంత, ఇంగువ- తగినంత, జీలకర్ర - అరచెంచా, నువ్వులు- చెంచా, వెన్న- రెండు చెంచాలు
తయారీ: ముందుగా మిక్సీలో అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్‌కి సెనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇంగువ, నువ్వులు, జీలకర్ర కూడా కలుపుకొని చివరిగా వెన్న కలుపుకొంటే జంతికలు వేసుకోవడానికి అనువైన మెత్తని జంతికల పిండి సిద్ధమైపోతుంది. వీటితో చేసిన జంతికలు చాలా రుచిగా ఉంటాయి.
సద్ది కట్లెట్..
కావాల్సినవి: అన్నం- కప్పు, ఉడికించి మెదిపిన బంగాళాదుంప- ఒకటి, క్యారెట్ తురుము- పావుకప్పు, ఉల్లిపాయ తరుగు- పావుకప్పు, క్యాప్సికమ్ ముక్కలు- పావుకప్పు, పాలకూర తరుగు- పావుకప్పు, బీన్స్ ముక్కలు- చెంచాన్నర, కొత్తిమీర తరుగు- చెంచా, మొక్కజొన్నపిండి లేదా బియ్యప్పిండి- మూడుచెంచాలు, పసుపు- కొద్దిగా, కారం- అరచెంచా, అల్లంతరుగు- చెంచా, చాట్‌మసాలా పౌడర్- చెంచా, గరంమసాలా పొడి- అరచెంచా, నిమ్మరసం- అరచెంచా, ఉప్పు- తగినంత, నూనె- కట్‌లెట్‌లు కాల్చడానికి కావల్సినంత.
తయారీ: ముందుగా అన్నాన్ని తీసుకుని చెంచాతో కానీ చేత్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. పైన చెప్పిన వాటిలో నూనె తప్పించి తక్కిన అన్నింటిని కలుపుకోవాలి. వీటిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని అరచేతుల మధ్యలో ఉంచి కట్‌లెట్‌ల మాదిరిగా ఒత్తుకోవాలి. వీటిని డీప్‌ఫ్రై కాకుండా తక్కువ నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే ఇటూ ఇటూ కాల్చుకోవాలి.
జీరా పఖాలా..
కావాల్సినవి: వండిన అన్నం- కప్పు (కుక్కర్ అన్నం కాకుండా గంజివార్చిన అన్నం), నీళ్లు - రెండుకప్పులు, జీలకర్ర - చెంచా, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - ఒక రెమ్మ, ఆవనూనె - చెంచా, ఉప్పు - తగినంత.
తయారీ: గంజివార్చిన అన్నంలో నీళ్లు వేసి రాత్రంతా ఉంచాలి. ఈ అన్నానికి తెల్లారి ఆవనూనెలో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టి కలపాలి. వేయించిన చేపముక్కలు దీనికి చక్కని కాంబినేషన్.
రసగుల్ల..
కావాల్సినవి: పాకం కోసం: పంచదార- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, అన్నం- కప్పు, రవ్వ- రెండు చెంచాలు, మైదా- రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, యాలకులు- రెండు
తయారీ: ముందుగా ఒక బాండీలో ఒక కప్పు పంచదారకి రెండు కప్పుల నీళ్లువేసి మరగనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో అన్నం, రవ్వ వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌కి మొక్కజొన్నపిండి, మైదాపిండి కలిపి చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని మరుగుతున్న పంచదార పాకంలో వేసి ఉడకనివ్వాలి. చివరిగా యాలకులు కూడా వేసి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తినాలి.
ఇదీ చదవండి:సాయంత్రం క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారా.. జాగ్రత్త!