సాధారణంగా గులాబ్జామ్ అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. మరి ఎప్పడూ ఒకే రకం గులాబ్ జామ్ కాకుండా వెరైటీగా ప్రయత్నించాలని ఉందా?అయితే ఈసారి బ్రెడ్ గులాబ్జామూన్ను చేసేయండి.
కావల్సినవి:
- అంచులు తీసేసిన బ్రెడ్ స్లైసులు - నాలుగు
- చక్కెర - ముప్పావుకప్పు
- నీళ్లు - ముప్పావుకప్పు
- పాలపొడి లేదా మైదా - రెండు టేబుల్‌స్పూన్లు
- పాలు - పావుకప్పు
- నూనె - వేయించేందుకు సరిపడా
- యాలకులపొడి - అరచెంచా
తయారీ:
- ఓ బ్రెడ్స్లైస్ని తీసుకుని పాలల్లో ముంచి వెంటనే తీసేసి గట్టిగా నొక్కాలి.
- ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకుని అన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇందులో పాలపొడీ లేదా మైదా వేసి ముద్దలా కలపాలి.
- ఈ ముద్దను చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో చక్కెరా, నీళ్లూ పోసి పొయ్యిమీద పెట్టాలి.
- చక్కెర కరిగి పాకం చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి.
- ఇందులో ముందుగా వేయించుకున్న బ్రెడ్ ఉండల్ని వేసుకుంటే చాలు.