వడియాలు.. భోజనంలో చారు, కూరలు, పచ్చళ్లు ఎన్ని ఉన్నా వడియాలు లేకుంటే ఏదో కాస్త వెలితిగా ఉంటుంది. అయితే ఎప్పుడూ మిగిలిన అన్నంతో చేసిన వడియాలే కాకుండా ఈసారి కాస్త వెరైటీగా అటుకులతో వడియాలు చేసేయండి. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తినేయడం పక్కా. ఇంతకీ వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా!
తయారీకి కావాల్సిన పదార్థాలు
- పెసరపప్పు - పావుకేజీ
- అటుకులు - అరకేజీ
- మిర్చి - పది
- జీలకర్ర - నాలుగు చెంచాలు
- కొత్తిమీర - ఒక కట్ట
- నువ్వులు - ఐదు చెంచాలు
- ఉప్పు - నాలుగు చెంచాలు (రుచికి తగ్గట్టు)
తయారు చేసే విధానం
- పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టి తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
- అలాగే అటుకుల్ని నీళ్లలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పులో పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, తడిపిన అటుకులు వేసి బాగా కలపాలి.
- ఇక వడియాలు పెట్టుకోవడానికి పిండి సిద్ధమైనట్టే. ఇక ఓ వస్త్రంపై వడియాలు పెట్టి బాగా ఎండిపోయాక నిల్వ చేసుకుంటే సరి.
- ఇక ఎప్పుడుకావాలంటే అప్పుడు వాటిని వేయించుకుని తినడమే.
ఇదీ చదవండి: మోదీ 'డొల్ల' ప్రసంగంలో ఉద్దీపన మాటేది?: కాంగ్రెస్