ETV Bharat / opinion

భారత్‌పై పోరుకు చైనా పన్నాగం! - సరిహద్దు పోరాట దళం

చైనా దురాక్రమణలు ఎదుర్కోవడంలో భారత సైన్యానికి అండగా ఉంటున్నారు టిబెటన్ యోధులు. అతిశీతల ప్రాంతాల్లో పుట్టిపెరిగిన టిబెటన్లు అలాంటి వాతావరణంలో ఇమడలేని చైనీయులకు సింహస్వప్నమయ్యారు. దీంతో చైనా తన ఏలుబడిలోని టిబెట్‌ నుంచి.. స్థానికులను తన సైన్యంలో నియమించుకొని భారత్​పై పోరుకు పన్నాగం పన్నుతోంది.

India China border
చైనా
author img

By

Published : Aug 9, 2021, 7:34 AM IST

ప్రవాస టిబెటన్‌ యోధులతో భారత సైన్యం రహస్యంగా ఏర్పరచిన ప్రత్యేక సరిహద్దు పోరాట దళం (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) లద్దాఖ్‌లో చైనా దురాక్రమణను వీరోచితంగా అడ్డుకొని శత్రువును చావుదెబ్బ తీసింది. 1962 యుద్ధం తరవాత ఏర్పాటైన ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ 1971 బంగ్లా విమోచన సమరంలో, 1984 సియాచిన్‌ ఘర్షణల్లో, 1999 కార్గిల్‌ పోరాటంలో తన సత్తా చాటింది. లద్దాఖ్‌లో నివసిస్తున్న 7,500 మంది టిబెటన్‌ శరణార్థుల్లో 1,500 మంది ఎస్‌ఎఫ్‌ఎఫ్‌లో చేరి భారతీయ జవాన్లతో భుజం కలిపి పోరాడుతున్నారు. అతిశీతల ప్రాంతాల్లో పుట్టిపెరిగిన టిబెటన్లు అలాంటి వాతావరణంలో ఇమడలేని చైనీయులకు సింహస్వప్నమయ్యారు. చైనా సైనికులు హిమాలయాల్లో విపరీతమైన చలిని తట్టుకోలేకపోవడం వల్లనే లద్దాఖ్‌ పోరులో భారత్‌ చేతిలో ఎదురుదెబ్బలు తిన్నారు. తూర్పు లద్దాఖ్‌లో, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ మోహరించడం చైనీయులకు కంటగింపుగా మారింది. నిరుడు కొన్ని కీలక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంలో భారత్‌కు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ అమోఘంగా ఉపకరించింది. దీంతో చైనా తన ఏలుబడిలోని టిబెట్‌ నుంచి స్థానికులను నియమించుకొని భారత సైన్యం తరహాలో ప్రత్యేక దళాలను ఏర్పరచాలని నిశ్చయించింది.

పీఎల్‌ఏలోకి టిబెటన్లు..

తన ఆక్రమణలోని టిబెట్‌లో ప్రతి కుటుంబం కనీసం ఒక్కరిని చైనా ప్రజా విమోచన సైన్యం(పీఎల్‌ఏ)లోకి పంపాలని బీజింగ్‌ ఆదేశించింది. టిబెట్‌ వాసులకు చైనా భాష నేర్పించి, వారి విధేయతను నిగ్గుతేల్చుకుని తమ సైన్యంలో చేర్చుకొంటోంది. వీరితో ఇటీవల యుద్ధ అభ్యాసాలూ నిర్వహించింది. చైనా సైన్యంలో చేరే టిబెటన్లు తాము చైనా పౌరులమని, టిబెట్‌ చైనాలో అంతర్భాగమని ప్రమాణం చేయాలి. కమ్యూనిస్ట్‌ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ప్రకటించాలి. భారత్‌పై టిబెటన్లను ఉసిగొల్పడం ద్వారా తనపై అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చైనా భావిస్తోంది. టిబెట్‌కు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోరుతున్నారు. చైనాకు, దలైలామాకు మధ్య 2010 నుంచి స్తంభించిపోయిన సంప్రతింపులను పునరుద్ధరించాలని సూచిస్తున్నారు. తమ భాషను, సంస్కృతిని, మతాన్ని సంరక్షించుకోవడానికి టిబెటన్లకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలన్నారు. దలైలామా వారసుడిని చైనాయే నిర్ణయించాలనుకోవడం టిబెటన్ల మతస్వేచ్ఛపై దాడి అంటూ బైడెన్‌ ఖండించారు. మరోవైపు భారత్‌, చైనాల మధ్య శాంతి సంప్రతింపులు ఇంకా ఒక కొలిక్కిరానందున బీజింగ్‌ ఎత్తుగడలను దిల్లీ జాగ్రత్తగా గమనిస్తోంది. పీఎల్‌ఏ శిక్షణ పొందిన టిబెటన్లను లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో మోహరిస్తారని ఇంటెలిజెన్స్‌ సమాచారం. రేపు భారత్‌తో సంఘర్షణ సంభవిస్తే, మొదట ఈ టిబెటన్లను పోరుకు పంపుతారు. వారిలో ఎవరైనా మరణిస్తే, మాతృభూమి రక్షణ కోసం టిబెటన్లు పోరాడి భారత్‌ చేతిలో హతమయ్యారంటూ అంతర్జాతీయంగా యాగీ చేయాలనేది చైనా పన్నాగం.

అరుణాచల్‌ పైనా కన్ను..

టిబెట్‌ విషయంలో తన పట్టును చైనా సడలించదలచడం లేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ జులైలో టిబెట్‌లో మూడురోజులు రహస్య పర్యటన జరిపారు. చైనా అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి టిబెట్‌ను సందర్శించడం మూడు దశాబ్దాల తరవాత అదే మొదటిసారి. జిన్‌పింగ్‌ పర్యటన ముగిసిన తరవాతే దాని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు అతి సమీపంలోని నైయింగ్చి మైన్లింగ్‌ విమానాశ్రయంలో జిన్‌పింగ్‌ దిగడం గమనించాల్సిన విషయం. 200 కోట్ల డాలర్ల వ్యయంతో ఇలాంటి విమానాశ్రయాలు మరో మూడింటిని టిబెట్‌లో నిర్మించనున్నారు. భారత్‌ సరిహద్దు వెంబడి వ్యాపించి ఉన్న టిబెట్‌ ప్రాంతంలో రోడ్లు, వంతెనలను జోరుగా నిర్మిస్తున్నారు. గ్రామాలు, బస్తీలకు పక్కా ఇళ్లు, వైఫై ఇంటర్నెట్‌తోపాటు పలు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. సరిహద్దుకు ఆవల అరుణాచల్‌ ప్రదేశ్‌ కన్నా ఎన్నెన్నో రెట్లు మిన్న అయిన వసతులను కల్పించడం ద్వారా చైనా పాలన పట్ల అరుణాచల్‌ వాసులను ఆకర్షితుల్ని చేయాలన్నది బీజింగ్‌ పథకం. పైగా, టిబెటన్లతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పేదలను సైతం తమ సైన్యంలో చేర్చుకోవాలని చైనా యోచిస్తున్నట్లు గూఢచారి వర్గాలు భారత ప్రభుత్వానికి తెలిపాయి. అరుణాచల్‌లో మున్ముందు అస్థిర పరిస్థితులు సృష్టించడానికి వీరు ఉపకరిస్తారని బీజింగ్‌ భావిస్తోంది. ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలను చైనా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చని గూఢచారి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ పన్నాగాల పట్ల అప్రమత్తం కావాలి.

- ఆర్య

ఇదీ చూడండి: చైనా సరిహద్దులోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.