ప్రపంచం నుంచి ఆకలిని పారదోలడానికి, సంఘర్షణ పీడిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు అవిశ్రాంత కృషి జరుపుతున్న ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ(డబ్ల్యూఎఫ్‌పీ)ని ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న కోట్లాది అభాగ్యుల దుస్థితిని అంతర్జాతీయ సమాజం పట్టించుకోవాలని ఈ అవార్డు గుర్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ, ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) కలిసి 1961లో స్థాపించిన డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సేవా సంస్థ. డబ్ల్యూఎఫ్‌పీ తన బృహత్తర లక్ష్యాన్ని నెరవేర్చడానికి వీలుగా ప్రపంచ దేశాలు ఈ సంస్థకు తగు నిధులు సమకూర్చాలని అవార్డును బహూకరించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ పిలుపిచ్చింది. నోబెల్ శాంతి బహుమతి కింద డబ్ల్యూఎఫ్‌పీకి 11 లక్షల డాలర్ల నగదు లభిస్తుంది.
ప్రపంచ దేశాలు ఈ సంస్థకు గతంలో వాగ్దానం చేసిన 410 కోట్ల డాలర్లను వెంటనే విడుదల చేస్తే, ఇంకా ఎందరో అన్నార్తుల క్షుద్బాధను తీర్చవచ్ఛు. డబ్ల్యూఎఫ్‌పీ ఒక్క 2019లోనే 88 దేశాల్లో 42 లక్షల టన్నుల ఆహార పదార్థాలను పంచి 9.7కోట్ల మంది ఆకలి బాధ తీర్చింది. మరోవైపు, కరోనా కల్లోలం వల్ల అనేక దేశాల్లో కోట్లమంది ఆకలి కోరలకు ఎర కానున్నారు. 2030కల్లా ప్రపంచం నుంచి ఆకలిని పారదోలాలనే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్‌డీజీ)అందుకోవడం కష్టతరమనిపిస్తోంది. 2000 సంవత్సరంలో 100 పాయింట్ల ప్రపంచ క్షుద్బాధా సూచి 28.2 పాయింట్లు ఉండగా, నేడు అది 18.2కు తగ్గింది. అయినా ఇప్పటికీ ప్రపంచంలో 69 కోట్లమంది ఖాళీ కడుపులతో వేదనకు గురవుతున్నారు. 14.4కోట్ల మంది బాలల్లో ఎదుగుదల నిలిచిపోయింది. 53 లక్షల మంది బాలలు అయిదో సంవత్సరం నిండకముందే పోషకాహార లోపం వల్ల చనిపోతున్నారు.
యుద్ధోన్మాదుల ఆయుధంగా...
ప్రపంచంలోని మొత్తం పేదల్లో సగంమంది 2030నాటికి యుద్ధ సంక్షుభిత దేశాల్లోనే నివసిస్తారని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది. వారు పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఇతర దేశాల్లోకన్నా రెండున్నర రెట్లు ఎక్కువని పేర్కొంది. సంక్షుభిత దేశాల్లో ఆకలిని ఒక ఆయుధంగా, సంఘర్షణ సాధనంగా ఉపయోగించే ప్రయత్నాలను అడ్డుకొంటున్నందుకు డబ్ల్యూఎఫ్‌పీకి నోబెల్ శాంతి బహుమతిని ఇస్తున్నామని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. దశాబ్దాల తరబడి అంతర్యుద్ధాల్లో, సంఘర్షణల్లో కూరుకుపోయిన సిరియా, సోమాలియా, యెమెన్, దక్షిణ సూడాన్, కాంగో, అఫ్ఘానిస్థాన్‌లలో జన జీవనం పూర్తిగా విచ్ఛిన్నమై ఆకలి, పోషకాహార లోపాలు మిన్నంటాయి.
ఈ సమస్యలను తీర్చడం ఒక్క డబ్ల్యూఎఫ్‌పీ వల్లనే అవుతుందని భావించడం సరి కాదు. యుద్ధాలను ముగించాలనే రాజకీయ దృఢ సంకల్పం అంతర్జాతీయ సమాజానికి ఉండాలి. రాజకీయ, మతపరమైన విభేదాలు తారస్థాయికి చేరి, అంతర్యుద్ధం చెలరేగే దేశాల్లో జనం అన్నపానాలు దొరకక అల్లాడుతుంటారు. వారికి ఆహారం అందించడానికి డబ్ల్యూఎఫ్‌పీ రంగంలోకి దూకినా, పరస్పరం పోరాడుకుంటున్న స్థానిక వర్గాలు ఎదుటివారికి ఆహారం అందకుండా అడ్డుకొంటూ ఉంటాయి. తమకు మాత్రమే ఆహారం సరఫరా కావాలని, తమ ప్రత్యర్థులకు అవి అందరాదని పట్టుపడతాయి.
సమితి జోక్యం అవసరం
మరోవైపు సంఘర్షణల వల్ల ఆయా దేశాల్లో వ్యవసాయం, మార్కెట్లు దారుణంగా దెబ్బతిని ఆహారం దొరకకుండా పోతోంది. ప్రధాన దేశాలు ఉగ్రవాదంపై జరుపుతున్న పోరు కూడా ఇలాంటి పరిస్థితులనే సృష్టిస్తోంది. కొన్ని దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడటం వల్లా వ్యవసాయోత్పత్తి, ప్రజల సంచారం, మార్కెట్లు దెబ్బతిని ఆకలి కేకలు పెరుగుతున్నాయి. యుద్ధానికి, ఆకలికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించబట్టి, ఆకలిని ఒక ఆయుధంగా ఉపయోగించరాదని 2018లో ఐరాస భద్రతా మండలి తీర్మానించింది. అప్పటి నుంచి డబ్ల్యూఎఫ్‌పీ ఆహార భద్రతకు, సాయుధ సంఘర్షణకు మధ్య ఉన్న లంకెను తెగ్గొట్టి, శాంతిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. బాధితులకు ఆహారం అందించడానికి పకడ్బందీ బట్వాడా ఏర్పాట్లను చేయడంతోపాటు, గడచిన దశాబ్ద కాలం నుంచి నగదు బదలీ పథకాలనూ అమలుచేస్తోంది. సంక్షుభిత దేశాల్లో డబ్ల్యూఎఫ్‌పీ ట్రక్కుల నుంచి ఆహారాన్ని దొంగిలించే ఘటనలు విస్తృతంగానే జరుగుతున్నాయి.
స్థానిక పోరు వర్గాలు తమ ప్రాంతాల్లో ఆహార బట్వాడాపై పన్నులు విధించి, ఆ డబ్బుతో ఆయుధాలు కొని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయి. సోమాలియాలో ఆహార బట్వాడా గుత్తేదారులు రాజకీయవాదులుగానూ చలామణీ అవుతారు. సిరియా, సూడాన్ ప్రభుత్వాలు ప్రతిపక్ష అధీనంలోని ప్రాంతాలకు ఆహారం పంపిణీ కాకుండా అడ్డుకుంటున్నాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి- అక్కడి వ్యాపారులు ఆహార ధరలను పెంచేయగలుగుతున్నారు. నిర్వాసిత ప్రజానీకం క్షుద్బాధ తీర్చుకోవడానికి కారు చౌక కూలీలుగా మారుతున్నారు. ఇలాంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలను డబ్ల్యూఎఫ్‌పీ ఒక్కటే పరిష్కరించలేదు. సమితి, ప్రధాన దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలి. దీనంతటినీ దృష్టిలో ఉంచుకుని నోబెల్ కమిటీ ఆకలిని ఆయుధంగా ప్రయోగించే యత్నాలకు గండి కొట్టి, సంఘర్షణలకు రాజకీయ పరిష్కారం సాధించాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టింది. ఎఫ్‌ఏఓ సంస్థాపక దినమైన అక్టోబరు 16వ తేదీని ప్రపంచ దేశాలు ఏటా ఆహార దినంగా జరుపుకొంటున్నాయి. అందరికీ ఆహార భద్రత కల్పించడానికి ప్రపంచం మరింత పట్టుదలగా కృషి చేయాల్సిన అవసరాన్ని నేడు నిర్వహించుకోనున్న ప్రపంచ ఆహార దినం గుర్తు చేస్తుంది.
కోర సాచనున్న ఈతి బాధలు
కొవిడ్‌వల్ల ఆర్థికాభివృద్ధి దారుణంగా పడిపోవడంతో ఆహార దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్తోమత సన్నగిల్లి దిగుమతులను తగ్గించుకోవలసి వస్తోంది. ఈ దేశాల్లో ఎనిమిది కోట్ల మందిని పోషకాహార లోపం పీడిస్తోందని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) హెచ్చరించింది. కొవిడ్‌వల్ల ఆకలి బాధితుల సంఖ్య అదనంగా 13.2కోట్ల మేర పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా. ఈ పరిస్థితిలో డబ్ల్యూఎఫ్‌పీ అవసరం ప్రపంచానికి మరింత పెరిగింది. ఈ సంస్థ ప్రతి రోజూ 5,600 ట్రక్కులు, 30 నౌకలు, 100 విమానాల్లో ఆహారం, ఇతర సహాయక సామగ్రిని బాధితులకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఏటా 1,500 కోట్ల రేషన్ ప్యాకెట్లను అన్నార్తులకు పంచుతోంది. 2030కల్లా ప్రపంచం నుంచి ఆకలిని పారదోలాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించే గురుతర బాధ్యతను డబ్ల్యూఎఫ్‌పీ తన భుజస్కంధాల పైకి ఎత్తుకొంది.
రచయిత- కైజర్ అడపా
ఇదీ చూడండి: బిహార్ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు!