హరిత ఉదజని (గ్రీన్ హైడ్రోజన్) ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచానికి సరికొత్త కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జాతీయ ఉదజని కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఉదజని వల్ల ఎలాంటి కర్బన ఉద్గారాలూ విడుదల కావు. 2050నాటికి తటస్థ ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రపంచదేశాలన్నీ దీన్ని విస్తృతంగా వినియోగంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలోనూ పరిశ్రమలు, విద్యుత్తు, రవాణా తదితర రంగాల్లో దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. దిగ్గజ వ్యాపార సంస్థలు సైతం హరిత ఉదజనిలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ.75వేల కోట్ల పెట్టుబడితో రానున్న మూడేళ్లలో సోలార్ మాడ్యూళ్లు, విద్యుత్ నిల్వ చేయడానికి బ్యాటరీ గ్రిడ్‌లతో పాటు ఉదజని, ఫ్యూయల్‌సెల్స్ రూపొందించే నాలుగు భారీ సాంకేతిక కర్మాగారాల నిర్మాణాన్ని తలపెట్టింది. ఉదజని తయారీకి ఎలక్ట్రొలైట్లు అవసరమవుతాయి. రిలయన్స్ ప్రాజెక్టుల్లో వాటిని తయారుచేసే కర్మాగారం ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇటాలియన్ వ్యాపార దిగ్గజం మైర్ టెక్నిమోంట్‌తో కలిసి హరిత ఉదజని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాజస్థాన్‌లో హరిత ఉదజని, హరిత అమోనియా తయారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
అందరికీ ఆసక్తి
పలు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం హరిత ఉదజని పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) తన పునరుత్పాదక ఇంధన జాబితాలో హరిత ఉదజనికి స్థానం కల్పించింది. ఫ్యూయల్‌సెల్ బస్సులు, కార్లు తయారుచేసేందుకు పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ద్రవ ఉదజనిని ఉపయోగించి అమోనియాను తయారుచేయడం, విద్యుత్ రంగంలో హరిత గ్రిడ్‌లను ప్రవేశపెట్టడం వంటి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా లద్దాఖ్‌లో ద్రవ ఉదజని మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటుచేస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో ఉదజని ఉత్పత్తికి, నిల్వకు ఏర్పాట్లు చేయడంతోపాటు, ఈ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి సిద్ధమవుతోంది. బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర సంస్థ (ఐఐఎస్‌సీ)తో కలిసి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ సాంకేతికత రూపకల్పనకు ఒప్పందం కుదుర్చుకొంది. భారతీయ రైల్వే హైడ్రోజన్ ఆధారిత సబర్బన్ రైలు ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
నీటిని పునరుత్పాదక ఇంధనం ద్వారా విడగొట్టి హరిత ఉదజనిని, బొగ్గును గ్యాసిఫికేషన్ చేయడం లేదా సహజవాయువును మార్పుచేయడం ద్వారా నీలి ఉదజనిని తయారుచేస్తారు. వీటిలో హరిత ఉదజని ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఎలక్ట్రొలైజర్ల ద్వారా అపరిమితంగా ఉన్న సౌర, వాయు, జల శక్తిని వినియోగించుకొని తక్కువ ఖర్చుతో తయారుచేయగలిగే వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. నీలి ఉదజనిలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన అవరోధం. రిఫైనరీలు, ఎరువుల పరిశ్రమల్లో హరిత ఉదజని అవసరం ఎక్కువగా ఉంటుంది. రసాయన, ఔషధ రంగాల్లోనూ దీన్ని వినియోగించవచ్చు. ఉదజని ద్వారా కర్బన రహితమైన అమోనియా, మిథనాల్ వంటి పారిశ్రామిక రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చు. ఉక్కు పరిశ్రమలోనూ దీన్ని ఉపయోగించవచ్చు. సహజవాయు గ్రిడ్‌లకూ వాడుకోవచ్చు. భారత్‌లో 2030 నాటికి ఉదజని గిరాకీ పదిలక్షల టన్నులకు చేరుతుందని, 44 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఇందులో ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటికి అంతర్జాతీయంగా గిరాకీ 200 మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని, భారత్ ఈ ఇంధనాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుతుందని భారతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది.
విస్తృత పరిశోధనలు
ప్రస్తుతం మన దేశంలో ఏటా అరవై లక్షల టన్నుల వినియోగం ఉంటుందని అంచనా. ఈ క్రమంలో పరిశోధన రంగంలోనూ అడుగులు పడుతున్నాయి. దేశంలో ఉదజని ఆధారిత సాంకేతికతను మెరుగుపరచడానికి ఇంధన వనరుల సంస్థ (టెరి) నార్వే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. బెంగళూరులోని ఇంటెల్ సంస్థ ఫ్యూయల్ సెల్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఐఐటీ దిల్లీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు సైతం ఉదజని వినియోగంపై పరిశోధనలు మొదలుపెట్టాయి. దాదాపు డజను వరకూ అభివృద్ధి చెందుతున్న దేశాలు హరిత ఉదజనిపై పరిశోధనలు చేస్తున్నట్లు ప్రకటించాయి. భారత్ కూడా వాటితో జతకలవాలి. ప్రభుత్వపరంగా పరిశోధన-అభివృద్ధి, పైలట్ ప్రాజెక్టులపై నిధులను వెచ్చించవలసి ఉంది. ఎలక్ట్రొలైట్లలో ప్లాటినమ్ ఉపఉత్పత్తి అయిన ఇరిడియమ్‌ను ఎక్కువగా వాడతారు.
సంప్రదాయ వాహనాల్లోనూ దీన్నే వినియోగిస్తారు. ప్రత్యామ్నాయ ఖనిజాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఎలక్ట్రొలైజర్లు, ఫ్యూయల్‌సెల్ సాంకేతికత వంటి అంశాలపై పనిచేస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలలు వంటి వాటిని సంప్రదించాలి. ఉదజని నిల్వకు సురక్షితమైన, అంత వ్యయంకాని విధానాలను అనుసరించడం మరో ప్రధాన అంశం. సముద్రమార్గంలో, గాలిలో, నేలపై దీన్ని పంపిణీ చేయడానికి తగిన మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. వీటన్నింటికి తగిన పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్)ను రూపొందించుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంయుక్త తోడ్పాటుతో ఈ రంగంలో త్వరలో సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రచయిత- పార్థసారథి చిరువోలు
ఇదీ చూడండి: Independence day: స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టే ఎందుకంటే?