కరోనా(Corona virus) కట్టడి కోసం విధించిన ఆంక్షల వలయం నుంచి బయటపడేందుకు సన్నద్ధమవుతున్న బ్రిటన్‌ను కొవిడ్ మూడోదశ(Covid third wave) ఆందోళనకు గురిచేస్తోంది. మూడో దశ మొదలైనందువల్ల పూర్తిస్థాయి ఆంక్షల ఉపసంహరణ ప్రక్రియ కొంతకాలం వాయిదా వేయాలని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. భారత్‌లో మొదటిసారి గుర్తించిన డెల్టా రకం వైరస్, ఇప్పుడు బ్రిటన్‌లో చాపకింద నీరులా పాకుతోందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రవి గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేసులు తక్కువగానే ఉన్నా, వారం వ్యవధిలోనే ఏడు వేల మంది డెల్టా రకం బారినపడటం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. బి.1.617.2గా పిలిచే డెల్టా వేరియంట్, బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా ఉత్పరివర్తనం కంటే ఎన్నో రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని, టీకాలతో పాక్షికంగా రక్షణ కూడా కలిగి ఉందని ఇంగ్లాండ్ ప్రజారోగ్య పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడోదశ మరింత తీవ్రంగా ఉంటుందని ఈ పరిణామాలు సంకేతాన్నిస్తున్నాయి. బ్రిటన్‌లో ఇప్పటికే 75శాతం పెద్దలకు టీకా(Vaccine) తొలి డోసు అందింది. దాదాపు 50శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. దీనివల్ల తొలి రెండు దశలతో పోల్చుకుంటే మూడో దశ తీవ్రరూపం దాల్చేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
పెరగాల్సిన వేగం
కరోనాపై పోరులో టీకా సంజీవని వంటిదని చెప్పేందుకు బ్రిటన్ అనుభవమే నిదర్శనం. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో టీకా రెండు డోసులు తీసుకున్న ప్రజలకు రక్షణ సమకూరుతుంది. అయితే, భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం జనాభాలో తక్కువ మందికే టీకాలు వేశారు. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. లేకపోతే మొత్తం జనాభాకు వ్యాక్సిన్లు ఇచ్చేసరికి ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్‌లో ఆస్ట్రాజెనెకా టీకా డోసుల మధ్య కాలవ్యవధిని తగ్గించి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తుండగా, ఇటు టీకాల కొరతతో భారత్‌లో మాత్రం రెండో డోసు కోసం 12-16 వారాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్యలు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు వేయడం మొదలుపెట్టాయి. ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందని పిల్లలు, యుక్తవయసు వారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి టీకాలు వేయడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక వ్యూహ రచన చేయాలి.
ప్రస్తుతం మనదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంది. ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెరిగినా, సిబ్బంది కొరత వెంటాడుతోంది. దేశంలోని ప్రతి 1,511 మందికి ఒక్క వైద్యుడే ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు కంటే ఇది చాలా తక్కువ. రెండోదశను ఎదుర్కొనే క్రమంలో ఆక్సిజన్ సరఫరాలో సమన్వయం లోపించింది. ప్రామాణిక విధానాల వల్ల విదేశాల నుంచి వచ్చిన పరికరాలు ఎన్నో రోజులు విమానాశ్రయాల్లోనే మగ్గిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లూ సరిగ్గా పనిచేయలేదు. బ్లాక్ మార్కెట్‌లో ఔషధాల విక్రయం కాసుల వర్షాన్ని కురిపించింది. ప్లాస్మా థెరపీ కూడా ప్రాణాలను రక్షించలేదని తేలింది. టీకా వృథా మరో తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, గ్రామీణ భారతంలో ఆరోగ్య సంరక్షణ, ఆక్సిజన్, ఔషధాల నిల్వలను పెంచకపోతే, మూడో దశ పరిణామాలను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
అనుభవాలే పాఠాలుగా..
దేశంలో కరోనా రెండో దశ సృష్టించిన కల్లోలాన్ని మరవద్దు. ఒక్క రోజులో అత్యధికంగా 4.14 లక్షల కేసులు నమోదైన పరిస్థితి తెలిసిందే. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో మూడో దశను సమర్థంగా ఎదుర్కోవాలంటే, మొదటి దశ అనంతరం చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. కేసుల గుర్తింపు కోసం శక్తివంతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సూపర్ స్ప్రెడర్ వేదికలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలను నియంత్రించాలి. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించేలా కఠిన నిర్ణయాలు అమలు చేయాలి. కొత్త ఉత్పరివర్తనాలను ఎంత తొందరగా గుర్తించి కట్టడి చేస్తే దేశానికి అంతమంచిది.
ముందుగా 18 ఏళ్లు పైబడిన వారిలో 60 కోట్ల మందికి రానున్న అయిదు నెలల్లో టీకాలు వేయాలి. వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు పడుతున్న ఇక్కట్లు తీర్చాలి. భవిష్యత్తులో పుట్టుకొచ్చే ఉత్పరివర్తనాలపై అవగాహన పెంచుకోవాల్సిన తరుణంలో అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ ఊసే వినిపించడం లేదు. దీనిపై దృష్టిసారించడం తక్షణావసరం. ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలి. ఇప్పటికే అన్ని విధాలుగా ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆరోగ్య వ్యవస్థపై పనిభారాన్ని తగ్గించాలి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ, పకడ్బందీ చర్యలతో ముందుకు సాగితే మూడో దశకు అడ్డుకట్ట వేయవచ్చు. కొవిడ్ చికిత్సా కేంద్రాల సంఖ్యను పెంచి, వాటిలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, సిబ్బంది లోటు తలెత్తనీయకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తేనే, మూడో దశ ముప్పును దేశం సమర్థంగా ఎదుర్కోగలదు.
- డాక్టర్ రాధా రఘురామపాత్రుని (రచయిత్రి- అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు).
ఇదీ చదవండి:'డెల్టా ప్లస్' కరోనాపై కేంద్రం కీలక ప్రకటన