దేశమంతా కొవిడ్ రెండో దశ విజృంభణతో అతలాకుతలమవుతుంటే, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పశ్చిమ తీరాన నీళ్లలో నిప్పు రగిలిస్తున్నారు. ఆయన పేరు ప్రఫుల్ ఖోడా పటేల్. ఈ గుజరాతీ రాజకీయ నాయకుడు కేంద్రపాలిత ప్రాంతాలైన దమన్- దివు, దాద్రా-నగర్ హవేలీలతో మొదలుపెట్టి లక్షద్వీప్(Lakshadweep) వరకు రాజకీయ, సాంస్కృతిక ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రఫుల్ పటేల్ తన అజెండా జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి సాధనకేనని చెబుతున్నారు. కానీ, విపక్షాలు అందులో హిందూత్వ ఛాయలను, జనజీవన ఛిద్రాన్ని చూస్తున్నాయి.
గతమెంతో వివాదాస్పదం
పటేల్ కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితం. సివిల్ కాంట్రాక్టర్ అయిన పటేల్, 2007లో గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో(2010) నాటి రాష్ట్ర హోం మంత్రి అమిత్ షా అరెస్టయినప్పుడు, ఆయన స్థానంలో ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. 2016లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పటేల్‌ను దాద్రా-నగర్ హవేలి, దమన్-దివులకు పాలనాధికారిగా నియమించింది. ఐఏఎస్ అధికారులనే ఈ హోదాలో నియమించే సంప్రదాయాన్ని ఈయన కోసం పక్కనపెట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దాద్రా-నగర్ హవేలి కలెక్టర్, ఎన్నికల అధికారి కణ్ణన్ గోపీనాథన్‌తో పటేల్‌కు పొసగలేదు. దానితో కణ్ణన్ రాజీనామా చేయకతప్పలేదు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికైన మోహన్ డేల్కర్ గత ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నారు. పటేల్ వేధింపులే దీనికి కారణమని లేఖరాసి మరీ ఒక హోటల్ గదిలో ఉరివేసుకున్నారు!
గత డిసెంబరు నుంచి..
నిరుడు జనవరిలో దాద్రా-నగర్ హవేలీ, దమన్-దివులను విలీనం చేసి వాటి పాలనా బాధ్యతను పటేల్‌కు అప్పగించిన కేంద్రం, గత డిసెంబరులో లక్షద్వీప్‌నూ ఆయన చేతుల్లో పెట్టింది. చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి లక్షద్వీప్‌ను(Lakshadweep) భద్రతాపరంగా పటిష్ఠం చేయడం కేంద్ర ప్రభుత్వ విధానమని పటేల్ సూచిస్తున్నారు. ఈ దీవులు ఉగ్రవాదులు, మాదకద్రవ్య రవాణాదారుల అడ్డాలుగా మారకుండా నివారిస్తానంటున్నారు. పర్యాటకంగా లక్షద్వీప్‌ను అభివృద్ధి చేసి హోటల్ పరిశ్రమను, తద్వారా ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. విపక్షాలు మాత్రం ఆయన విధానాలు దాద్రా-నగర్ హవేలీ, దమన్-దివులలో అంతేవాసులకు లబ్ధి చేకూర్చి స్థానికుల పొట్టకొట్టాయని, లక్షద్వీప్‌లోనూ(Lakshadweep) అదే జరుగుతోందని విమర్శిస్తున్నాయి.
విరుద్ధ ఫలితాలనిస్తున్న పథకాలు..
లక్షదీవులకు వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. అక్కడ పాలనాధికారిగా పటేల్ పగ్గాలు స్వీకరించిన వెంటనే ఈ నిబంధనను రద్దుచేశారు. గతేడాది మొత్తం ఒక్క కరోనా కేసు సైతం నమోదు కాని లక్షద్వీప్‌లో నేడు బయటివారి రాకపోకలు పెరిగి దాదాపు 7000 కేసులు నమోదయ్యాయి. కేవలం 65 వేల జనాభా గల ఈ దీవుల్లో కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం దేశంలోనే అత్యధికం. పటేల్ చేపట్టిన ఇతర పథకాలూ ఇలానే విరుద్ధ ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన ప్రకటించిన లక్షద్వీప్(Lakshadweep) అభివృద్ధి ప్రాధికార పథకం ప్రకారం ప్రభుత్వం ఎవరి భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు. లక్షదీవుల జనాభాలో అత్యధికులైన జాలరులు సముద్ర తీరంలో వేసుకునే షెడ్లను, వలలను, బోట్లను అధికారులు ఈ పథకం పేరు చెప్పి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు.
అక్కడి బీచుల్లో రిసార్టులు కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ దీవుల్లో గనుల తవ్వకానికి అనుమతించి పర్యావరణ విధ్వంసానికి గేట్లు బార్లా తెరిచారు. ఈ చర్యలను నిరసించేవారిపై గూండా చట్ట ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. పైకి మాత్రం ఆయుధాలు, మాదకదవ్య స్మగ్లర్లపైనే దీన్ని (అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ చట్టం) ప్రయోగిస్తామంటున్నారు. పటేల్ విధానాలు గుజరాత్‌లో ఢోలెరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం కోసం భూములు సేకరించడానికి ప్రయోగించిన చట్టాన్ని పోలి ఉన్నాయి. ఢోలెరా కోసం ఒక చట్టం కింద 22 గ్రామాల్లోని 60 వేల రైతుల భూముల్లో సగానికి సగం స్వాధీనం చేసుకున్నారు. లక్షద్వీప్ రేపటి చిత్రం ఇలానే ఉంటుందా అన్నది ప్రశ్న. ఈ దీవుల్లోని ముస్లిం జనాభా ఆహార అలవాట్ల మీదా పటేల్ దెబ్బ పడుతోంది. దీన్ని సాంస్కృతిక దండయాత్రగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. పటేల్ యంత్రాంగం లక్షద్వీప్‌లో మద్యనిషేధాన్నీ ఎత్తివేసింది!
జనావాసాలపై దాడి
లక్షద్వీప్‌లో ఇప్పటికే తాగు నీటి కొరత ఉంది. రేపు హోటళ్లు, రిసార్టులు ఏర్పడితే వాటి కోసం భారీ వ్యయంతో నిర్లవణీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందే. దీనివల్ల పర్యావరణానికి మరింత నష్టం జరుగుతుంది. పర్యాటక వసతులు, నౌకా స్థావరాల నిర్మాణానికి చిరకాలంగా ప్రజలు నివసిస్తున్న దీవులను మాత్రమే ఎంచుకోనక్కర్లేదు. 36 దీవుల సముదాయమైన లక్షద్వీప్‌లో ఒక దీవి సముద్ర జలాల్లో మునిగిపోగా, 35 మనుగడలో ఉన్నాయి. వాటిలోనూ 10 దీవుల్లోనే జనావాసాలు ఉన్నాయి. వీటిని విడిచిపెట్టి మిగిలిన దీవులను అభివృద్ధి చేయవచ్చు. అది కాదని జనావాసాలపైనే దాడి జరపడమేమిటని కేరళ, లక్షద్వీప్‌లలోని(Lakshadweep) భాజపా వర్గీయులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ప్రఫుల్ పటేల్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
- ప్రసాద్
ఇదీ చూడండి: