కేంద్ర ప్రభుత్వం 2020-21 ఖరీఫ్ కాలానికి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. గత సంవత్సరం కంటే అన్ని పంటలకు మద్దతు ధర పెంచేశామని, ఇది పంట పండించడానికైన ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం ఎక్కువేనని పేర్కొంది. దీంతో రాబోయే కాలంలో దేశంలో రైతులకు వ్యవసాయం మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటోంది. ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారం రైతుకయ్యే మొత్తం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి ఇవ్వాలనే విధానానికి అనుగుణంగా లేవు.
ఉత్పత్తి వ్యయమే కీలకం
పంటల మద్దతు ధరపై సీఏసీపీ ఏడు ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. వాటిలో అతి ముఖ్యమైంది ఉత్పత్తి వ్యయం. ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించే విషయంలో సరైన విధానం లేకపోవడంతో కనీస మద్దతు ధర ప్రక్రియ ఇప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. సీఏసీపీ పంటల ఉత్పత్తి వ్యయాన్ని ఎనిమిది విధాలుగా లెక్కిస్తుంది. మొదటిది- ఏ1 ఉత్పత్తి వ్యయం. అంటే రైతు ఒక క్వింటాలు పంట పండించడానికి 14 విధాలుగా ఇతరులకు చెల్లించిన ఖర్చు విలువ. ఏ1 ఉత్పత్తి వ్యయానికి కౌలు భూమికి చెల్లించే కౌలును కలిపితే వచ్చేది ఏ2 ఉత్పత్తి వ్యయం. ఏ1 ఉత్పత్తి వ్యయానికి భూమేతర సొంత స్థిర మూలధనంపై వడ్డీని కలపగా వచ్చేది బీ1 ఉత్పత్తి వ్యయం. ఏ1 ఉత్పత్తి వ్యయానికి సొంతభూమి, కౌలు భూమిపై చెల్లించే కౌలును జోడిస్తే వచ్చేది బీ2 ఉత్పత్తి వ్యయం. బీ1కు సొంత శ్రమ చేరిస్తే సీ1, బీ2కు సొంత శ్రమ జోడిస్తే సీ2 వస్తుంది. సీ2కు మార్కెట్ లేదా చట్టపరమైన కనీస శ్రమ వేతనం కలిపితే సీ2(స్టార్) వస్తుంది. దీనికి పది శాతం ఉత్పత్తి కారకాల నిర్వహణ ఖర్చును కలిపితే సీ3 ఉత్పత్తి వ్యయం వస్తుంది. సీ3 ఉత్పత్తి వ్యయం అనేది నిజానికి రైతు పంట సాగు చెయ్యడానికయ్యే మొత్తం ఆర్థిక ఉత్పత్తి వ్యయం. ఇతర రంగాల్లో వస్తువుల ధరలను సీ3 ఉత్పత్తి వ్యయం ఆధారంగానే నిర్ణయిస్తారు. వ్యవసాయ రంగంలోనూ పంట గిట్టుబాటు ధర అనేది సీ3 ఉత్పత్తి వ్యయాన్ని అనుసరించి ఉండాలి. అప్పుడే రైతులకు తమ కష్టానికి తగ్గ పూర్తి ప్రతిఫలం దక్కి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రెండోదైన సీ2 ఉత్పత్తి వ్యయం (మొత్తం చెల్లించిన వ్యయంతో పాటు చెల్లించని వనరులైన సొంత భూమి, శ్రమ, మూలధనం ఖర్చు విలువ) రైతుకయ్యే నిర్వహణ వ్యయం మినహా, అన్ని ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలను కలిగి కొంతవరకు న్యాయం చేస్తుంది. కాబట్టి 2006లో స్వామినాథన్ కమిషన్ పంటల కనీస మద్దతు ధర నిర్ణయించడంలో సీ2 ఉత్పత్తి వ్యయాన్ని ప్రామాణికంగా తీసుకుని, దానికి అదనంగా 50 శాతం కలిపి పంట కనీస మద్దతు ధర నిర్ణయించాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం దీన్ని పాటించకుండా ఏ2 ఉత్పత్తి వ్యయం అంటే మొత్తం చెల్లించిన వ్యయానికి సొంత కుటుంబ శ్రమను మాత్రమే జోడించింది. దానిమీద 50 శాతం విలువ కలిపి కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. దీనివల్ల రైతు తమ సొంత వనరులైన భూమి, మూలధనం, యాజమాన్యపు విలువను కోల్పోవాల్సి వస్తోంది. స్వామినాథన్ కమిటీ సూచించిన ధరల విధానంతో పోలిస్తే, ఇప్పుడు ప్రకటించిన పంటల మద్దతు ధరలు సుమారు 25 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల రైతుకు జరిగే నష్టం క్వింటాలుకు వరి పంటలో రూ.633, జొన్నలో రూ.790, మొక్కజొన్నలో రూ.559, కందిలో రూ.2,196, మినుములో రూ.2,355, వేరుశనగలో రూ.1,493, పత్తిలో రూ.1,888. పంట ఉత్పత్తి వ్యయాన్ని లెక్కకట్టడానికి సేకరించే నమూనాల సంఖ్య తక్కువ ఉండటం, రవాణా, మార్కెటింగ్, బావుల తవ్వకం వంటి ఇతర ఖర్చులను ఉత్పత్తి వ్యయంలో చేర్చకపోవడం వల్ల ప్రభుత్వం ప్రకటించే పంటల మద్దతు ధరలు వాస్తవమైన పంట ఉత్పత్తి వ్యయాల్ని ప్రతిబింబించడం లేదు. ఒక పంట ఉత్పత్తి వ్యయంలో రాష్ట్రాల మధ్య అంతరం ఎక్కువగా ఉన్నా, దేశం మొత్తం ఒకే రకమైన మద్దతు ధర ప్రకటించడం వల్ల ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉండే రాష్ట్రాల్లోని రైతులు నష్టపోతున్నారు.
అమలులో సమస్యలు
కనీస మద్దతు ధరల విధానం అమలులోనూ సమస్యలున్నాయి. దేశంలో 30 శాతం రైతులకు మాత్రమే పంటల కనీస మద్దతు ధరల గురించి అవగాహన ఉంది. వారిలోనూ 30 శాతమే ప్రభుత్వ ధాన్య సేకరణ కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్మి లబ్ధి పొందుతున్నారు. కనీస మద్దతు ధరల పథకం కింద ప్రభుత్వం సేకరించే పంటల ఉత్పత్తిలో 80 శాతం వరి, గోధుమలే ఉంటాయి. కొంతమేర చెరకూ ఉంటోంది. వీటిలో 50 శాతం వరి, 75 శాతం గోధుమ పంటల ఉత్పత్తిని కేవలం మూడు రాష్ట్రాలు- పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచే సేకరిస్తున్నారు. కనీస మద్దతు ధరల కింద ధాన్య సేకరణను వికేంద్రీకరించినా, అది క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి వరినే ఎక్కువగా సేకరించి మిగతా పంటలను అంతగా పట్టించుకోవడం లేదు. దీన్నిబట్టి దేశంలో కనీస మద్దతు ధర విధానం కొన్ని పంటలకు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మేలు చేసేదిగా ఉంటోంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పరిష్కరించాలి. కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సూచన ప్రకారం ఉండాలి. వీటిని రాష్ట్రాల స్థాయిలో ప్రకటించాలి. రవాణా, మార్కెటింగ్ వంటి ఇతర ఖర్చులనూ లెక్కలోకి తీసుకోవాలి. ఉత్పత్తి, సేకరణలో అన్ని పంటలకు, వికేంద్రీకరణలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. అప్పుడే దేశంలో పంటల కనీస మద్దతు ధర విధానం ద్వారా వ్యవసాయ రంగంతోపాటు, రైతులూ ఆశించిన రీతిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది!
అన్నదాతకు భరోసా!
రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే సరైన గిట్టుబాటు ధర కల్పించాల్సి ఉంటుంది. అది సరైన కనీస మద్దతు ధరల విధానాన్ని అమలు చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఏటా 'వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ (సీఏసీపీ)' సూచనల ప్రకారం దేశంలో 22 రకాల పంటలకు కనీస మద్దతు ధరను వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రకటిస్తుంది. పౌర సరఫరాల శాఖ చెరకుకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర ప్రకటిస్తుంది. కనీస మద్దతు ధర అనేది- రైతులు పండించే పంటలకు మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రకటించిన ధర వద్ద ప్రభుత్వమే పంట కొనుగోలుకు ఇచ్చే హామీ- రైతుల కనీస ఆదాయానికి ప్రభుత్వాలు ఇచ్చే భరోసా. దీనివల్ల వివిధ పంటలను పండించేలా రైతుల్ని ప్రోత్సహించి, ఆహార, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం, కనీస మద్దతు ధర వద్ద ప్రభుత్వమే పంటలను సేకరించి పౌర సరఫరా చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరలతో ఆహార సరఫరా చేపట్టడం వంటి ప్రయోజనాలను ఉద్దేశించారు.
- డాక్టర్ చీరాల శంకర్రావు
(రచయిత - ఆర్థిక రంగ నిపుణులు)
ఇదీ చూడండి: కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే