ETV Bharat / opinion

ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు? - భారత్​లో ఆర్థిక అసమానతలు

ఆర్థిక అసమానత అనే రుగ్మత మనుషుల జీవితాలను దుర్భరం చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టవచ్చేమోగానీ.. మానవుల మధ్య నెలకొన్న ఆర్థిక అంతరాలకు మాత్రం మందు కనిపెట్టలేకపోతున్నారు. బ్రిటిష్‌ పరిపాలనకు ముందు స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత్​.. తెల్లవారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది. మనుష్యుల మధ్య భారీగా ఆర్థిక అంతరాలు ఏర్పడ్డాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఇది కొనసాగుతుండడం బాధాకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

What is the end of economic inequalities between human beings?
ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు?
author img

By

Published : Jul 29, 2020, 8:44 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని గజగజలాడిస్తోంది. అది ఎంతగా విజృంభించినా నేడు కాకపోతే రేపైనా కనుమరుగు కాక తప్పదు. కలరా, తట్టు, పోలియో, మెదడు వాపు, మశూచి, సార్స్‌, ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహమ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- 'ఆర్థిక అసమానత'!

అసమానతలకు అంతంలేదా?

కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మారులు పీడిస్తూనే ఉన్నాయి. అసమానత అనే రుగ్మతకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామాజిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూత్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృతమవుతుంది. 'ఫోర్బ్స్‌' లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచంలో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తే ఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మభూషణ్‌ కౌశిక్‌ బసు 'ఆక్స్‌ఫామ్‌' నివేదికను ఉటంకిస్తూ- 73 శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దీనివల్ల పేదరికం పెరుగుతూ దాని కవలలైన ఆకలి, అనారోగ్యం మహమ్మారుల కంటే ఎక్కువగా పీడిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్పకుండా... తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.

ఆర్థికంగా చితికిపోయింది..

బ్రిటిష్‌ పరిపాలనకు ముందు మనది స్వయంసమృద్ధ దేశం. వారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది. తదనంతర కాలంలో దేశాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు అనేక విధానాలను రూపొందించి అమలు చేశాయి. జనాభా పెరిగి అవసరాలూ మారిన తరవాత 1965లో హరిత విప్లవం దిశగా సాగి దిగుబడులు సాధించింది. 1990లో ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. అయినప్పటికీ స్వావలంబన అనేది ఇప్పటికీ ఇంకా సుదూరంలోనే ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో 23.64 శాతం దిగుమతులు ఉంటే, 19.74 శాతం ఎగుమతులు ఉన్నాయి. మందులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రక్షణ సామగ్రి, చమురు, సెమీకండక్టర్ల వంటివాటికి ఇప్పటికీ ఇతర దేశాల మీదే ఆధారపడుతున్నాం. అందుకే స్వావలంబన మంత్రాన్ని జపిస్తున్నాం. కరోనా, లాక్‌డౌన్‌, సడలింపులు వంటి వాటితో మన వైద్య, ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. వలస కూలీల వెతలే ఇందుకు నిదర్శనం. బ్రూకింగ్స్‌ నివేదిక ప్రకారం 7.30 కోట్ల ప్రజలు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఆపైన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు అరకొర ఆదాయాలు, చుక్కలంటుతున్న ధరలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 1917-18లో 4.6శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో 6.3శాతానికి 2019-20లో 7.6 శాతానికి ఎగబాకింది. అసంఘటితరంగం ఆసాంతం, సంఘటిత రంగంలోని చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోసుకుపోయి, ఆదాయాలు అడుగంటినవేళ 'ఆత్మనిర్భర్‌ భారత్‌' ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఉపాధి, ఆదాయం, కొనుగోలు శక్తి, ఈ మూడింటి మధ్య సంబంధాన్ని గుర్తించనంతకాలం, ఉపాధిలో స్వావలంబన సాధించనంత కాలం అంతరాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఆర్థిక అంతరాలు తగ్గే విధంగా, సంపద సృష్టి సమాజంలో అందరికీ విస్తరించేలా ఉపాధి కల్పన పథకాలు, కార్యక్రమాలను అమలుచేసే విధంగా ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత కరోనా క్లిష్టకాలంలో ఎంతైనా ఉంది!

(రచయిత - పొడిశెట్టి సత్యనారాయణ)

ఇదీ చూడండి: రాజ్యాంగ రక్షకులా? భక్షకులా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.