వందలాది సంవత్సరాలకు ముందే ఆవిష్కరణల బాటలో విలక్షణతను చాటుకుంటూ భారత్- బలమైన సంప్రదాయ విజ్ఞానంలో సుసంపన్నత సాధించింది. ఇప్పటికీ పసుపు కలిపిన పాలు, మూలికలతో చేసే కషాయం వంటి బామ్మ చిట్కాలతో కూడిన పానీయం తాగే సంప్రదాయం వాడుకలో ఉంది. ప్రస్తుత కరోనా మహమ్మారి మూలంగా అలాంటి జీవన విధానం, పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ మహమ్మారి ప్రభావం బారి నుంచి బయటపడేందుకు, కొత్తగా ఆవిష్కరణలు చేపట్టేందుకు ప్రపంచమంతా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో రూపొందించే విధానాలు, నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలకు మద్దతు ఇచ్చేలా ఉండాలనేది సుస్పష్టం.
సరైన తరణమిదే!
స్వయంసహాయక బృందాలకు అండగా నిలిచేలా, వాటి మనుగడకు తోడ్పడేలా అమూల్ పాల ఉత్పత్తులు, లిజ్జత్ పాపడ్‌ల వంటి విప్లవాత్మక దేశీయ వ్యాపార నమూనాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం. ‘స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గళమెత్తాలి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రధాని సూచించిన అంశాల్లో అతి కీలకమైన నూతన ఆవిష్కరణలు కూడా ఉన్నాయి. అయితే, బలమైన మేధా సంపత్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ-ఐపీ) వ్యవస్థ లేనిదే నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్ళలేం. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాల్ని ఉపయోగించుకోకపోతే భారత్ చాలా విషయాల్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
భారత్‌కు దేశీయంగానే భారీస్థాయి మార్కెట్ ఉండటం ఎంతో సానుకూల ప్రయోజనాల్ని అందిస్తోంది. దేశాన్ని వృద్ధి మార్గంలో నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు సాధించాలనే, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే, డిమాండ్, వినియోగాన్ని పెంచాలనే సంకల్పం ఉండితీరాలి. కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో అందరికంటే ముందుగా వేగంగా స్పందించే వారే దీర్ఘకాలంపాటు నిలబడగలుగుతారన్న సంగతి గుర్తుంచుకోవాలి. బహుళ జాతి సంస్థలు, భారీ కార్పొరేట్ కంపెనీలు, మధ్యస్థాయి వ్యాపార సంస్థలు పోటీలో నిలిచే అవకాశాలున్నా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఇలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు భారత్ స్థూల దేశీయోత్పత్తికి తమవంతుగా నిశ్శబ్దంగా ఇతోధిక సేవలను అందిస్తుంటాయి. భారత ప్రభుత్వం- సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎమ్‌ఎస్‌ఎంఈ) ఆదుకోవడానికి ముందుకొచ్చింది. వాటి స్వభావాన్ని మార్చడం, అత్యవసర రుణ సౌకర్యాలు, ఇతర ప్యాకేజీల ఏర్పాటు ద్వారా ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించింది. ఇప్పుడు, ఎమ్‌ఎస్‌ఎంఈలు కొత్త ఉత్పత్తి మార్గాలను అన్వేషించడం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణలను చేపట్టడం, ఆవిష్కరణలపై మేధాసంపత్తి హక్కులను పొందడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, లైసెన్సింగ్ విధానాలపై దృష్టి సారించడం, ఇతరులతో ఒప్పందాలు చేసుకోవడం వంటి విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.
మనదైన 'ముద్ర' అవసరం
ఎలాంటి మహమ్మారి వచ్చినా, విపత్తులు సంభవించినా బ్రాండ్లు అనేవి ఎక్కడికీ పోవు. అవి స్థిరంగా నిలిచే ఉంటాయి. ఎలాంటి పరిస్థితులున్నా నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. ఎమ్‌ఎస్‌ఎంఈలు లేదా చిన్నపాటి వాణిజ్య సంస్థల విషయానికొస్తే, వాటికి సొంత బ్రాండ్లు, గుర్తింపు ఉండదు. అందుకని, ఇలాంటి సంస్థలు మేధాసంపత్తి రక్షణ లేకుండా విపత్తుల తర్వాత సాధారణ పరిస్థితులకు చేరుకోవడం ఒకరకంగా పెద్ద సవాలే. చాలామంది వినియోగదారులు నాణ్యత లేని ఉత్పత్తుల్ని కొనేందుకు మొగ్గు చూపరు. మంచి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతారు. ఇందుకు మంచి ఉదాహరణ శానిటైజర్లే. ప్రస్తుతం చాలా సంస్థలు శానిటైజర్లను తయారు చేస్తున్నాయి. ఏవో కొన్ని ప్రముఖ బ్రాండ్లు తప్ప ఎవరూ వాటి సమర్థతపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తక్కువ వ్యయంతో అత్యున్నత స్థాయి నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలి. వాటికి మేధాసంపత్తి హక్కుల రక్షణ కూడా ఉండాలి. వస్తువుల్ని నాణ్యతతో తయారు చేస్తూ, ప్రజల మనసుల్లో నెమ్మదిగా ఓ ముద్ర వేస్తూ, వారిలో గట్టి నమ్మకాన్ని పాదుకొల్పాలి. మరిన్ని భారత బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడంలోనూ, వినియోగదారుల మనసుల్లో ముద్ర పడేలా చేయడంలోనూ భారత ఐపీ కార్యాలయం కూడా కీలకపాత్ర పోషించాల్సి ఉంది. వాణిజ్య వృద్ధిలో భౌగోళిక సూచీ(జీఐ)లను ఉపయోగించుకునే విషయంలో సమృద్ధిగా ఉన్న అవకాశాలను భారత్ ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. మన దేశం నుంచి పేటెంట్ల దాఖలు భారీగా పెరిగినప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. భారీస్థాయిలో జనాభాగల దేశంలో పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్‌ల కోసం ఏటా స్వల్పసంఖ్యలోనే దరఖాస్తులు దాఖలవుతున్న పరిస్థితులు కొనసాగితే... స్వయంసమృద్ధ లేదా ఆత్మనిర్భర్ భారత్‌గా అవతరించేందుకు చాలా దూరం పయనించాల్సి ఉంటుందన్న సంగతి గుర్తించాలి.
- సుభజిత్ సాహా (రచయిత- మేధాసంపత్తి వృత్తినిపుణులు)